బరువు నియంత్రణకు…

టీనేజ్‌ అమ్మాయిల దృష్టంతా ఎప్పుడూ బరువు తగ్గడం మీదే వుంటుంది. దానికోసం ఎవరు ఏం చెప్పినా పాటిస్తూ వుంటారు. కొందరయితే భోజనం మానేయటం వంటివి చేస్తుంటారు. అయితే బరువు పెరగకుండా వుండాలనుకోవటం మంచిదే.. అదే సమయంలో శరీరానికి కావలసిన పోషకాలు సమద్ధిగా అందేలా కూడా చూసుకోవాలి. లేదంటే శారీరక అనారోగ్యంతో పాటు, ముఖ కాంతి కూడా తగ్గిపోతుంది. అంటే సరైన ఆహారం తీసుకోకపోతే అందం మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, ప్రోటీన్లు ఇతర ఎంజైములు శరీరానికి చక్కగా అందేలా చూస్తే అందం, ఆరోగ్యం కూడా సొంతం అవుతాయి.
మరి అవన్నీ అందాలంటే ఏం చేయాలి అంటే… రోజూ ఓ గుప్పెడు మొలకెత్తిన గింజలు తినటమే. వీటినుంచి పుష్కలంగా లభించే మాంసకత్తులు అత్యంత సురక్షితమయినవి. వీటిలో కొవ్వు శాతం తక్కువ, పీచు పదార్దం ఎక్కువ. కొలస్ట్రాల్‌ అన్న మాటే ఉండదు. కాబట్టి బరువు పెరగకుండా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా రోజూ ఇవి తప్పక తీసుకోవాలి.
అంతే కాదు వీటిలో ఇంకా చాలా ప్రయోజనాలు దాగున్నాయి. ఈ గింజలకి ఇంత ప్రాధాన్యం ఎందుకూ అంటే మొలకెత్తే సమయంలో వీటిలో క్లోరోఫిల్‌ శాతం పెరుగుతుంది. ఇది రక్తహీనత తగ్గించటంలో సహాయపడుతుంది. అలాగే ఇవి మొలకెత్తే సమయం లో వీటిలో విటమిన్లు, పీచుపదార్ధాల శాతం చాలా పెరుగుతుంది. పైగా సులువుగా జీర్ణం అవుతాయి, తిన్న ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తాయి.
ఇంతకీ ఏవేవి తినాలి అంటే… గోధుమ, రాగి వంటి తణ ధాన్యాలు, పెసలు, శెనగలు, బఠాణి, రాజ్మా, సోయా బీన్స్‌ వంటి చిక్కుడు జాతి గింజలు తినటం మంచిది. అలా అని ఎక్కువగా కూడా తినకూడదు. టేనేజర్లు అరకప్పు మొలకెత్తిన ధాన్యాలను తింటే సరిపోతుంది. అది బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌లలో ఎప్పుడయినా తినచ్చు. వీటిని నేరుగా తినటం, లేదా పొడి చేసుకుని సూపులో కలుపుకోవటం, జావగా చేసుకోవటం, లేదా రోటి పిండిలో, దోశల పిండిలో కలపటం వంటివి కూడా చేయవచ్చు. ఆరోగ్యం, అందం రెండింటిని కాపాడుకుంటూ బరువు తగ్గాలి అనుకుంటే ఈ మొలకెత్తిన గింజలు తినటం మొదలు పెట్టండి.

Spread the love