– ధృఢమైన వైఖరి తీసుకోవటంలో కేంద్రం విఫలం
– అమెరికాలో మన పౌరుల పట్ల వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం
– తొక్కిసలాట ఘటనలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి : సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సమన్వయకర్త ప్రకాశ్ కరత్
జమ్మూ: దేశం తన ప్రజాస్వామ్య వ్యవస్థలో విదేశీ నిధులను కోరుకోవటం లేదని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సమన్వయకర్త ప్రకాశ్ కరత్ అన్నారు. దానిని వెంటనే నిషేధించాలని తెలిపారు. యూఎస్‌ఏ నుంచి భారత పౌరులను తరలించటంలో భాగంగా వారి పట్ల అక్కడి యంత్రాంగం ప్రవర్తిస్తున్న తీరుపై ఒక దృఢమైన వైఖరి తీసుకోవటం లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు విఫలమైందని అన్నారు. మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో విదేశీ సంస్థలు అలాంటి జోక్యాలు చేయకూడదని కోరుకుంటున్నామని చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర 13వ మహాసభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయంపై కోత పెడుతున్నట్టు అమెరికాకు చెందిన డోజ్ స్పష్టం చేసిన విషయం విదితమే. దీనికి స్పందనగా కరత్ పైవిధంగా మాట్లాడారు.
అమెరికా నుంచి అక్రమ వలసదారులను తరలించే ప్రక్రియలో భారతీయుల చేతులకు బేడీలు వేసి అమానవీయంగా ప్రవర్తిస్తున్న తీరుపై ప్రకాశ్ కరత్ ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశ పౌరుల పట్ల ఈ విధంగా వ్యవహరించటం దురదృష్టకరమని అన్నారు. ”ప్రధాని మోడీ ఇటీవల తన అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడి(డోనాల్డ్ ట్రంప్)తో ఈ విషయం గురించి లేవనెత్తి ఉండాల్సింది. మోడీ పర్యటన తర్వాత మరో రెండు విమానాలు వచ్చాయి. వారు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. వాళ్లు మన దేశ పౌరులు. అలాంటి ట్రీట్‌మెంట్‌కు అర్హులైన నేరస్థులు కారు” అని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ ఒక దృఢమైన వైఖరిని తీసుకోవాలన్నారు. తాము ఈ అంశాన్ని బలంగా లేవనెత్తుతామని చెప్పారు. మహాకుంభ్‌లో భాగంగా యూపీలో, ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాటలపై స్పందిస్తూ.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహాకుంభ్‌లో, ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విలువైన ప్రాణాలు పోయాయన్నారు. తగిన ఏర్పాట్లను కల్పించటంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఇది చూపించిందని వివరించారు.