ఫారెస్ట్‌ అధికారి శ్రీనివాసరావు హత్య కేసులో..

Forest officer Srinivasa Rao's murder case.– ఇద్దరికి జీవిత ఖైదు
– ఏడు నెలల్లోపే విచారణ పూర్తి చేసిన పోలీసులు
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్‌
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాసరావు హత్య కేసులో ఇద్దరు నిందితులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌ సంచలన తీర్పు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం చంద్రుగొండ రేంజ్‌ రావికంపాడు సెక్షన్‌ శిక్షణ ఆఫీసర్‌ తేజావత్‌ రామారావు, చంద్రుగొండ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావుతో కలిసి 2022 నవంబర్‌ 22న పోకలగూడెం అటవీ ప్రాంతంలోని ప్లాంటేషన్‌ పనులు పరిశీలించి తిరిగి వెళుతున్న సమయంలో రావికంపాడు బేస్‌ క్యాంపు వాచర్లు.. ప్రసాద్‌, భుక్య రాములు ఫోన్‌ చేసి.. ఎర్రబోడుకు చెందిన గుత్తికోయలు స్థానిక ప్లాంటేషన్‌లో పశువులు మోపుతున్నారని, వద్దని చెప్పినా వినడం లేదని ఫిర్యాదు చేశారు. దాంతో ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు అక్కడికి చేరుకొని పశువులు మొక్కలను తొక్కుతాయని, వేరేచోట మేపుకోవాలని నిందితులు మడకంతుల, పోడియం నంగాలుకు సూచించారు. అయినప్పటికీ వారు అలాగే మేపుతుండటంతో ఎఫ్‌ఆర్‌ఓ సెల్‌ఫోన్‌లో ఫొటో తీయడానికి ప్రయత్నించగా వారు అడ్డుకొని గొడవకు దిగారు. వారి వద్ద ఉన్న కత్తులతో శ్రీనివాసరావుపై దాడిచేశారు. దాంతో కంగుతిన్న తోటి ఉద్యోగులు వెంటనే.. శ్రీనివాసరావును కారులో చంద్రుగొండ పీహెచ్‌సీకి తీసుకెళ్లి ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటల సమయంలో మృతిచెందారు. ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు హత్యపై చంద్రుగొండ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ జి.విజయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఏడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి ందితులపై కోర్టులో చార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయస్థానం 20 మంది సాక్షులను విచారించారు. కాగా, గురువారం ఆ ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ పీపీ పోసాని రాధా కృష్ణమూర్తి నిర్వహించారు. కోర్టు లైసన్‌ ఆఫీసర్‌ బాబు, కోర్టు డ్యూటీ ఆఫీసర్‌ ఎం.రవి సహకరించారు.

Spread the love