అన్నింటికీ మ‌తం మ‌ర‌కే

Forget everything about religion– యూపీలో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా బరితెగింపు
– ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ ఓట్ల సమీకరణకు ఎత్తుగడ
– రాముడినీ రాజకీయాల్లోకి లాగుతున్న కమలదళం
గత రెండు ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి సైతం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా రంగంలోకి దింపలేదు. ఆ రాష్ట్ర ఓటర్లలో ముస్లింలు ఐదో వంతు ఉన్నప్పటికీ వారికి ప్రాతినిధ్యం కల్పించలేదు. పార్టీ తరఫున పోటీ చేసేందుకు ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వలేదు.
న్యూఢిల్లీ: ‘అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, కుక్కపిల్ల…కాదేదీ కవితకనర్హం’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు బీజేపీ నాయకులు దానిని కొంచెం మార్చి పేరు ఏదైనా మతం రంగు పులమడానికి అడ్డేముందంటూ వితండవాదం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ‘మతం’ రంగు పులుముకుంటున్నాయి. ఆహారం, బట్టలు, పేర్లు, రిజర్వేషన్లు, జనాభా, చరిత్ర, భౌగోళిక రాజకీయాలు, ప్రార్థనా స్థలాలు, నినాదాలు, ఓటింగ్‌…పేరు ఏదైతేనేం? వాటన్నింటికీ బీజేపీ మతం రంగు అంటిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. అయితే అప్పుడు అభివృద్ధి, లబ్దిదారులు, జాతీయ భద్రత పేరుతో మతతత్వాన్ని ముందుకు తీసుకొచ్చింది. మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశిస్తున్న నరేంద్ర మోడీ ఈ ఎన్నికల్లో మరో అడుగు ముందుకేసి విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. దేశంలో నివసిస్తున్న ముస్లిం మైనారిటీలపై విషం చిమ్ముతున్నారు. ప్రతిపక్షాలపై ఆరోపణలు సంధిస్తూ ప్రత్యక్షంగా దాడికి దిగుతున్నారు. హిందూ ఓటర్లలో భయాందోళనలు, అభద్రతాభావాన్ని కలిగించి వారి ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ నాయకులు చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతిపక్షాలపై హిందూ వ్యతిరేక పార్టీలుగా ముద్ర వేశారు. వారి దృష్టంతా 80 లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌ పైనే. ఎందుకంటే యూపీలో సీట్లు తగ్గితే ఆ ప్రభావం జాతీయ రాజకీయాలపై పడుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలు బీజేపీకి తగ్గిపోతాయి.
మత రాజకీయాల వ్యాప్తి
యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఇచ్చిన నినాదాలు చూస్తుంటే కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో కాషాయ పార్టీ తన మతతత్వ రాజకీయాలను ఎంత విస్తృతపరిచిందో అర్థమవుతుంది. ముస్లింలతో పాటు సమాజ్‌వాదీ పార్టీకి విధేయులైన యాదవులు (ఓబీసీలు), బీఎస్పీ పక్షాన ఉండే దళితులకు వ్యతిరేకంగా హిందువులను ఏకం చేయడమే ఈ నినాదాల లక్ష్యం. రాష్ట్ర జనాభాలో వీరందరూ 40 శాతంగా ఉన్నారు. ‘100 మందిలో 60 మంది మా వారు. మిగిలిన 40 మంది విడిపోయారు. ఆ 40 శాతం మందిలో కూడా మాకు ఓటేసే వారు ఉన్నారు’ అని మౌర్య 2022లో వ్యాఖ్యానించారు. హిందూత్వ వాదం, సంక్షేమ పథకాలు, స్థానిక ప్రాతినిధ్యం ద్వారా యాదవులు, దళితుల్లో ఓ వర్గాన్ని చీల్చి బీజేపీ ఓటుబ్యాంకును పెంచుకోవడమే ఆ వ్యాఖ్య ఉద్దేశం. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఆయన మరో కొత్త పల్లవి అందుకున్నారు. ‘100 మందిలో 80 మంది మా వారే. మిగిలిన 20 శాతంలో కూడా మాకు వాటా ఉంది’ అని చెప్పుకొచ్చారు. దీనర్థం ఏమంటే రాష్ట్రంలోని 80 శాతం హిందువులందరూ బీజేపీ వైపే ఉన్నారని, మిగిలిన 20 శాతం ముస్లింలు ఇండియా కూటమి, బీఎస్పీ మధ్య చీలిపోయారని చెప్పడమే. ముస్లింలను ఒంటరి చేయడమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ. ఇక అమ్రోహా స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కున్వర్‌ దనీష్‌ అలీని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యను కూడా ఈ కోణం నుండే చూడాల్సి ఉంటుంది. ‘భారత్‌ మాతా కీ జై’ అనడానికి ఇష్టపడని వ్యక్తిని పార్లమెంటులోకి ఎలా అనుమతించగలమని మోడీ ప్రశ్నించారు.
ఎన్నికల అస్త్రంగా రామమందిరం
ప్రతిపక్షాలపై దాడి చేసి, హిందూ ఓట్లను రాబట్టుకునేందుకు అయోధ్యలో రామమందిరాన్ని బీజేపీ ఉపయోగించుకుంటోంది. రామ మందిర నిర్మాణం తన ఘనతే అంటూ ప్రచారం చేస్తోంది. ‘రామ మందిరాన్ని నిర్మించిన వారినే మేము తిరిగి అధికారంలోకి తీసుకొస్తాం’ అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన ఎన్నికల ప్రచారసభల్లో చెప్పారు. బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ నాయకులు హాజరు కాకపోవడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. రామ భక్తులకు, రామ ద్రోహులకు మధ్య జరుగుతున్న పోరుగా లోక్‌సభ ఎన్నికల సమరాన్ని యోగి అభివర్ణించారు. రామ భక్తులు మాత్రమే దేశాన్ని పాలిస్తారని కూడా సెలవిచ్చారు. యూపీఏ పాలనలో రామసేతు వివాదం సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రాముడి అస్తిత్వాన్నే నిరాకరించిందని బీజేపీ ఇప్పుడు గుర్తు చేస్తోంది. రాముడి అస్తిత్వాన్ని ప్రశ్నించడమంటే మన అస్తిత్వాన్ని ప్రశ్నించడమేనని యోగి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోకు వక్రభాష్యం
బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు పెట్టుకునే టోపీల రంగులను కూడా కాషాయ పార్టీ వదలడం లేదు. సమాజ్‌వాదీ నేతలు, కార్యకర్తలు ధరించే టోపీలు ముస్లింల టోపీలను పోలి ఉండడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రతి పౌరుడి మాదిరిగానే మైనారిటీలకు కూడా తమ వస్త్రధారణ, ఆహారం, భాష, వ్యక్తిగత చట్టాల విషయంలో స్వేచ్ఛ ఉంటుందని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో చెప్పింది. దీనికి బీజేపీ వక్రభాష్యం చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆవులను వధించేందుకు, గొడ్డు మాంసం తినేందుకు ముస్లింలను అనుమతిస్తుందని ఆరోపించింది. ముస్లింలు అధిక సంతానానికి జన్మనిస్తారంటూ ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లో చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అంతేకాదు.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ధారాదత్తం చేస్తుందంటూ తప్పుడు ప్రచారం చేశారు.
కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే రామమందిరాన్ని ఆస్పత్రిగా మారుస్తుందా? కాశీ విశ్వనాథ కారిడార్‌పై బుల్‌డోజర్‌ నడుపుతుందా అని వారణాసిలో మోడీ ప్రశ్నించారు. అయోధ్యలో కాకుండా రామమందిరాన్ని కాందహార్‌లోనో, కాబూల్‌లోనో, లాహోర్‌లోనో, కరాచీలోనో నిర్మిస్తారా అని కూడా నిలదీశారు. మోడీ, అమిత్‌ షా మొదలుకొని పలువురు బీజేపీ నాయకులు పాకిస్తాన్‌, కాశ్మీర్‌, కులం, రిజర్వేషన్లు, ఉగ్రవాదం, ఓట్‌ జిహాద్‌, శాంతిభద్రతలు, పండుగలు, షరియా వంటి పలు అంశాలను తమ ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావిస్తూ వాటికి సైతం మతం రంగు పులుముతున్నారు
వీటినీ వదలడం లేదు
1990లో ములాయం సింగ్‌ యాదవ్‌ పాలనలో కరసేవకులపై పోలీసులు జరిపిన కాల్పులను ప్రస్తావించడం కూడా బీజేపీ నాయకులు మరచిపోవడం లేదు. ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్నారన్న విషయాన్ని వారు పదే పదే గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు హిందువుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ముస్లింలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని కూడా వారు నిందిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలను యోగి ఆదిత్యనాథ్‌ మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌, ఔరంగజేబుతో పోల్చారు. మహారాణా ప్రతాప్‌ విగ్రహంపై కాలు పెట్టిన వారి సంగతిని ఎన్నికల తర్వాత తేలుస్తానని ఆయన హెచ్చరించారు. ఇండియా కూటమి విజయం సాధిస్తే అఖిలేశ్‌ యాదవ్‌, రాహుల్‌ గాంధీ రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు.

Spread the love