– గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీలో పలు సమస్యలు
– సర్కారు లక్ష్యం నెరవేరాలంటే వాటిని అధిగమించాల్సిందే..!
– మార్గదర్శకాలు ఎలా ఉంటాయనే దానిపై రైతుల ఆసక్తి.. ఆరా..
– కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారేమోనని అనుమానం
– ఖాతా నంబర్లలో లోపాలు వెతికి తిరికాసు పెట్టొద్దని విజ్ఞప్తి
– విధివిధానాలు వెల్లడైతేనే అపోహలకు ఫుల్‌స్టాప్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గత ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీ పథకంలో రకరకాల కొర్రీలు పెట్టడంతో పాటూ అనేక సాంకేతిక సమస్యలూ ఎదురయ్యాయి. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అధిగమిస్తేనే పథకం ఉద్దేశం నెరవేరుతుందని రైతులు, రైతుసంఘాల నేతలు అంటున్నారు. గతంలో లాగా కాకుండా ఏకకాలంలో రూ.2లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని మంత్రివర్గం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నా.. కొర్రీలు లేకుండా సాఫీగా అమలు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అమలు విషయంలో ఎలాంటి డౌట్ లేకున్నా.. విధివిధానాలపై మాత్రం పలు సందేహాలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వం 2018 డిసెంబర్ 12లోపు పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చినా.. అమలు నాటికి కొర్రీలు పెట్టింది. కుటుంబం ప్రాతిపదికగా అనడంతో అనేక రకాల సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ ప్రభుత్వం కూడా అలాంటివేవైనా తలపెడితే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశమూ లేకపోలేదు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేండ్లలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తామని ప్రభుత్వం మాటిచ్చింది. ఇందుకు రూ.31వేల కోట్లు కేటాయించింది. 47 లక్షల మంది రైతులను లబ్దిదారులుగా సూచించింది. అన్నీ బాగానే ఉన్నా మార్గదర్శకాలు ఎలా ఉంటాయనే దానిపైనే రైతుల్లో ఆసక్తి నెలకొంది.
పరిమితులపై రైతుల్లో ఉత్కంఠ..
రుణమాఫీని సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో మార్గదర్శకాలు ఎలా ఉంటాయన్న దానిపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో జీవో విడుదల చేస్తామని సీఎం చెప్పినా ఎలాంటి పరిమితులు ఉంటాయనే చర్చ సాగుతోంది. రైతుల పంట రుణాల మాఫీలో పీఎం కిసాన్ మార్గదర్శకాల్లో కొన్నింటిని అమలు చేస్తారనే ప్రచారం సాగుతోంది. పీఎం కిసాన్ పథకం నుంచి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని మినహాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆదాయ పన్ను చెల్లించేవారినీ పరిగణలోకి తీసుకోలేదు. రుణమాఫీ విషయంలోనూ వీరిని మినహాయించే అవకాశం ఉంది. ఆదాయ పన్ను చెల్లించే వారందర్నీ కాకుండా అధిక ఆదాయం ఉన్నవారిని, అధిక భూమి ఉన్నవారిని మినహాయిస్తారనే ప్రచారం సాగుతోంది.
కొర్రీలు లేకుండా చూడాలి
గతంలో పలు రకాల కొరీల్రు పెట్టారు. కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే మాత్రం చాలా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఆధార్, రేషన్‌కార్డు, ఒకవేళ రేషన్‌కార్డు లేకపోతే గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ప్రాతిపదికగా తీసుకుంది. కానీ దీనివల్ల ‘ఫ్యామిలీ గ్రూపింగ్’ కాక అనేక సాంకేతిక సమస్యలు వచ్చాయి. అలా కాకుండా రైతు ప్రాతిపదికగా రుణమాఫీ చేసినా గతంలో అక్షరం మారినా తిరకాసు పెట్టారు. ఒక రైతుకు రెండు బ్యాంకుల్లో రుణాలుంటే రెండింటిలోనూ ఒకేలా పేరు ఉండాలి. స్పెల్లింగ్‌లో తేడా వస్తే మాత్రం మాఫీకి అనర్హులను చేశారు. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ముదిగొండ మండలాల్లో ఇలాంటివి చోటుచేసుకున్నాయి. ఒక కారేపల్లిలోనే 750 మంది అకౌంట్లు స్పెల్లింగ్ మిస్టిక్స్ కారణంగా నిలిచిపోయాయి. ఇంకా అనేక రకాల కొర్రీలు తలెత్తాయి. వాటన్నింటినీ అధిగమించి ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంది.
ఖమ్మం జిల్లాలోనే రూ.4.3 వేల కోట్ల రుణాలు
2023 డిసెంబర్ 31 నాటికి ఖమ్మం జిల్లాలో 3,73,157 మంది రైతులు 28 బ్యాంకుల నుంచి రూ.4,307.58 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి లెక్కిస్తే వీరిలో ఎందరు రుణమాఫీకి అర్హత సాధిస్తారో చూడాలి. ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాకు రూ.వెయ్యి కోట్లకు పైనే అవసరం అవుతాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకానికి కేటాయించిన రూ.31వేల కోట్లలో రూ.2 లక్షలకు పైగా రుణం తీసుకున్న వారిని సైతం లెక్కించారు. ఇలా గుర్తించిన లబ్దిదారుల సంఖ్య 45 లక్షలకు చేరింది. విధివిధానాలు ఖరారు అయితేనే ఈ పథకం తీరుపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది.