న్యూఢిల్లీ/తిరువనంతపురం : కేరళ కార్మికోద్యమ నేత, అఖిల భారత ఉద్యాన కార్మికుల సమాఖ్య (ఏఐపీడబ్ల్యూఎఫ్) మాజీ ప్రధానకార్యదర్శి పి లాలాజీ బాబు బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. లాలాజీ బాబు 1948లో చెంగన్నూరులో జన్మించారు. అత్యధిక కాలంలో కొల్లంలో జీవించిన ఆయన నాలుగు దశాబ్దాల సుదీర్ఘకాలం ఉద్యాన కార్మికుల హక్కుల కోసం పోరాడారు. సీఐటీయూ వర్కింగ్ కమిటీ సభ్యులుగానూ సేవలందించారు. దేశంలో అత్యయిక పరిస్థితి విధించినప్పుడు ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపారు. రబ్బరు బోర్డు సభ్యునిగా, ఆయిల్ ఫాం ఇండియా లిమిటెడ్ బోర్డు సభ్యునిగా, పథనపురం తాలుకా వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు అధ్యక్షులుగా, సహకార బ్యాంకు అధ్యక్షులుగా, అనేక ఇతర ముఖ్యమైన సంస్థలకు వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన నిత్యం కార్మికవర్గ ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషిచేశారు.
2013లో త్రిపురలోని అగర్తలలో జరిగిన ఏఐపీడబ్ల్యూఎఫ్ మహాసభలో ఆయన ఫెడరేషన్ అఖిల భారత అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఉద్యాన కార్మికోద్యమాల నిర్మాణంలో విశేష పాత్ర పోషించిన లాలాజీ బాబు తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా 2022 డిసెంబరులో డార్జిలింగ్‌లో జరిగిన ఏఐపీడబ్ల్యూఎఫ్ మహాసభలో బాధ్యతల నుంచి విరమణ పొందారు. అదే ఏడాది ఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరై తిరిగివస్తుండగా గుండెపోటుకు గురై.. అప్పటి నుంచి కోలుకోలేదు. లాలాజీబాబు మృతి పట్ల సిఐటియు తీవ్ర సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఉద్యాన కార్మికుల ఉద్యమంలో ఆయన కృషి చిరస్మరణీయమని కొనియాడుతూ ఘన నివాళులర్పించింది.