– ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తు నిలిపివేత
– పంజాగుట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు పెట్టిన ఎఫ్‌ఐఆర్‌పై దర్యాప్తును నిలిపి వేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్‌రావులను అరెస్ట్ చేయరాదన్న గత ఉత్తర్వులను పొడిగించింది. తన ఫోన్‌ను ట్యాప్‌చేయించారని చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టేయాలని వారిద్దరూ వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌లను జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ, సుప్రీం కోర్టు సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థలూద్రా వాదించేందుకు వస్తారని, విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనిపై హరీష్ లాయర్ అభ్యంతరం తెలిపారు. పీపీ 3 సార్లు వాయిదా తీసుకున్నారనీ, పోలీసులు మరో పక్క నిందితులను అరెస్టు చేసి వాళ్లతో తమకు అనుకూలంగా వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారని చెప్పారు. దర్యాప్తుపైస్టే ఇవ్వాలని కోరారు. ఇందుకు పీపీ వ్యతిరేకించారు. దీనిపై కల్పించుకున్న హైకోర్టు, వాయిదాలు కోరుతూ పోలీసులు దర్యాప్తు పేరుతో అరెస్టు చేయడాన్ని తప్పుపట్టింది. కేసు దర్యాప్తుపై స్టే విధిస్తూ విచారణను వచ్చే నెల 3కి వాయిదా వేసింది.