మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి మృతి

– నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా సేవలు
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాజకీయ కురవృద్దుడు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చిల్కూరి రాంచంద్రారెడ్డి(78) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చేరగా.. గురువారం మృతిచెందారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో నాలుగు సార్లు శాసనసభ్యునిగా, రెండు సార్లు మంత్రిగా సేవలందించిన ఆయన ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్రవేశారు. తన జీవిత చరమాంకం వరకు ప్రజల్లోనే ఉన్న ఆయన ప్రజలకు, కాంగ్రెస్‌ పార్టీకి ఎనలేని సేవలందించారు. ఉమ్మడి జిల్లాలో రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానులను కలిగి ఉన్నారు. రాంచంద్రారెడ్డి మరణవార్త విని పార్టీ శ్రేణులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1978లో తొలిసారి స్వతంత్రుడిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1985లోనూ స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లోనూ ఎమ్మెల్యేగా గెలిచి 1991-1992 వరకు మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో చిన్ననీటి పారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రిగా సేవలందించారు. చివరిసారి 2004లోనూ ఆదిలాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన హయాంలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో రిమ్స్‌ ఆస్పత్రితో పాటు మత్తడివాగు ప్రాజెక్టులు నిర్మితమయ్యాయి. శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు.

Spread the love