నవతెలంగాణ – శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పూంచ్ జిల్లాలోని సింధారా ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి ఇండియన్ ఆర్మీ ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, టెర్రరిస్టులకు మధ్య పెద్దఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారని అధికారులు తెలిపారు. వారంతా విదేశీ ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్, మ్యాగజైన్, 11 రౌండ్ల బుల్లెట్లు, ఇతర మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.