ఉచిత కరెంట్‌ కాంగ్రెస్‌ పేటెంట్‌

Free Current Congress Patent– కేసీఆర్‌కు బై బై చెప్పాలి
– రాష్ట్రాన్ని ఇచ్చినట్లే..ఆరు గ్యారెంటీలు అమలుచేస్తాం
– సింగరేణికి తీరని అన్యాయం
– కార్మిక సంఘాల ఎన్నికలెందుకు జరపలేదు? : రామగుండం, బెల్లంపల్లి సభల్లో రేవంత్‌
నవతెలంగాణ-కోల్‌సిటీ/కాసిపేట
తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బైబై చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. శనివారం గోదావరిఖని, బెల్లంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభల్లో రేవంత్‌ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులకు కేసీఆర్‌ తీరని అన్యాయం చేశారు అని ఆరోపించారు. సింగరేణి సీఎండీగా ఒక్క వ్యక్తినే కొనసాగిస్తూ సింగరేణి నిధులను మొత్తం దోచుకుంటున్నారని విమర్శించారు. బొగ్గు ఉత్పత్తి చేసి దేశానికి కరెంటు వెలుగులు పంచుతున్న కార్మికులను దోచుకోవడం, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం కేసీఆర్‌కే సాధ్యమైందని అన్నారు. కారుణ్య నియామకాల పేరిట వేల కోట్లు దోచుకున్నారని ఆయన విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తామని, బొందలగడ్డలను చేసే ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌లను బంద్‌ చేసేలా తాను కుర్చీ వేసుకొని కూర్చుంటా అని చెప్పిన సీఎం కేసీఆర్‌, స్థానిక ఎమ్మెల్యే ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ మందేసి ఫామ్‌ హౌస్‌లో పడుకుంటున్నారనీ, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశాడని అన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన ఎమ్మెల్యే చందర్‌కు తగిన బుద్ది చెప్పాలన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి కప్పం కడుతున్నాడని, కాబట్టే మళ్లీ ఎమ్మెల్యే టికెట్టు కేటాయించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్న సీపీఐ నాయకులతో కలసి ఈ ప్రాంతంలో ముందుకు వెళ్తామని ఆయన వ్యాఖ్యనించారు.
ఓడిపోతామన్న భయంతో ఎన్నికల వాయిదా..
సింగరేణి కార్మికుల హక్కులను కాలరాసేలా సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తూ, ఓటమి భయంతో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయించారని రేవంత్‌ అన్నారు. కోర్టు చెప్పినా ఎన్నికలను నిర్వహించలేమని అధికారులతో కోర్టుకు విన్నవింపజేశారని ఆరోపించారు. మొగోడివైతే సింగరేణి కార్మికుల ఎన్నికలను ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే బొందల గడ్డలుగా మారిన ఈ ప్రాంతంలో అండర్‌ గ్రౌండ్‌ మైన్‌లను ఓపెన్‌ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సభలో రామగుండం అభ్యర్థి మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, మంథని అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌, పెద్దపల్లి, రామగుండం,మంథని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటా : బెల్లంపల్లిలో రేవంత్‌
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్లే అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం వాన వస్తేనే కుంగిపోయిందని విమర్శించారు. బెల్లంపల్లిలో జరిగిన సభలో రేవంత్‌ మాట్లాడుతూ బెల్లంపల్లి, చెన్నూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి డా.వినోద్‌, డా వివేక్‌లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో గాంధీ కుటుంబంలా తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్‌ పార్టీకి పట్టాదారులని తెలిపారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దుర్గం చిన్నయ్య దుర్మార్గాల గురించి రాష్ట్రమే కాదు దేశమంతా తెలుసని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తిని గెలిపించాలని కేసీఆర్‌ చెప్పడం సిగ్గుచేటన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఉచిత కరెంటు కాంగ్రెస్‌ పార్టీ పేటెంట్‌ అని అన్నారు.

Spread the love