తన ఆహార విధానంతో ఆరోగ్య డైట్ స్థాపించి ‘ఆహారం మాది ఆరోగ్యం మీది’ అనే నినాదంతో కొంతమంది డైటీషియన్స్, కొంతమంది డాక్టర్స్‌ను కలుపుకొని కూరగాయలతో కొన్ని వంటకాలు కనిపెట్టి ఎంతోమందికి దీర్ఘకాలిక వ్యాథుల్ని తగ్గిస్తున్నారు లక్ష్మణ్ పూడి. ఆయన తన మాతృ సంస్థ ప్రజానాట్యమండలి రూపకల్పనలో ఎం శేషగిరి రచించిన పాటను శ్రీనివాస్ నందుల సంగీత సారథ్యంలో లక్ష్మణ్ పూడి గానం చేసినటువంటి ‘స్వాతంత్రం మా స్వాతంత్య్రం..’ అనే పాటను దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సోమవారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన దేశం ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ నిరక్షరాస్యత, పేదరికంలో చాలా కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని లక్ష్మణ్ పూడి స్వాతంత్య్రం మీద చేసిన సాంగ్ అద్భుతంగా ఉంది’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి గాయకుడు లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ,’నేను కారులో వెళుతున్నప్పుడు సిగల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి స్వాతంత్య్రం అంటే ఏమిటో తెలియదు. దేశంమీద ప్రేమతో ఇలాంటి నిరక్షరాస్యులను పాటతో మేల్కొల్పటానికి ఈ సాంగ్ చేశాం. సాంగ్ లాంచ్ చేసిన మా గురువు భరద్వాజ్‌కి కృతజ్ఞతలు’ అని చెప్పారు. ఈ కార్యక్రమానికి సినీ డైరెక్టర్ కర్రి బాలాజీ, వంశీ లక్ష్మణ్ పూడి తదితరులు హాజరయ్యారు.