ఇక నుంచి ఒకటో తారీఖునే జీతాలు

From now on the same date salaries– పీఆర్‌, ఆర్‌డీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఊరట
– పదేండ్ల ఎదురు చూపులకు పరిష్కారం
– సర్కార్‌ నిర్ణయంతో 92 వేల మందికి లబ్ది
– చెల్లింపునకు నూతన విధానం
– మంత్రి ఆదేశాలతో ఫైల్‌ సిద్ధం చేసిన అధికారులు
– ఆర్ధిక శాఖ ఆమోదమే తరువాయి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పంచాయతి రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో పార్ట్‌ టైం, ఫుల్‌టైం, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు ఇక నుంచి ప్రతి నెలా ఒకటో తారీఖున ఠంచన్‌గా జీతాలు పడనున్నాయి. గతంలో మూడు, నాలుగు నెలలకోసారి గాని జీతాలు రాని పరిస్థితి. సర్కార్‌ తాజాగా తసుకున్న నిర్ణయంతో గత పదేండ్లుగా జీతాల కోసం పడుతున్న కష్టాలకు ఇక పుల్‌ స్టాఫ్‌ పడనుంది. పంచాయతిరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఆదేశాలతో సంబంధిత ఫైల్‌ను అధికారులు సిద్ధం చేసి ఆర్ధిక శాఖకు పంపారు. వారం పది రోజుల్లో ఆర్ధిక శాఖ సైతం దీనికి ఆమోద ముద్ర వేయనున్నట్టు సమాచారం.
పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 92 వేల మంది సిబ్బంది పలు స్కీముల్లో పనిచేస్తున్నారు. గ్రామీణ ఉపాధి హమీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ స్టాఫ్‌, సెర్ప్‌ సిబ్బంది, వీఏఓ తదితర విభాగాల్లో పార్ట్‌టైం, ఫుల్‌టైం, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ పద్దతిలో వీరు సేవలందిస్తున్నారు. వీరికి ప్రతి నెలా జీతభత్యాల కింద రూ.117 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత పదేండ్లుగా వేతనాల విషయంతో ఎప్పుడూ పడిగాపులే. మూడు నాలుగు నెలలకోసారి జీతాలు రావడంతో వారికి కుటుంబ పోషణ భారంగా మారింది.
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సకాలంలో వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తాయి.అరకొరగా వచ్చే వేతనాలు తెచ్చిన అప్పుల వడ్డీలకే సరిపోతున్నాయని పలు సందర్భాల్లో ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ప్రతి సారీ ఓ నెల జీతం ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప శాశ్వత పరిష్కారం కోసం గత సర్కార్‌ ఎన్నడూ ప్రయత్నించలేదు. పని దినాల విషయంలో, బడ్జెట్‌ కేటాయింపుల్లో కేంద్రం కొర్రీలు పెడుతూ పలు సందర్భాల్లో ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసిన విషయం విదితమే. కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారం చేపట్టిన తర్వాత కూడా గత పది నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. మూడు నాలుగు నెలలకోసారీ జీతాలు చెల్లించని వైనం. దాంతో ఉద్యోగులు ముఖ్యమంత్రితో పాటు ఆ శాఖ మంత్రికి పలు సార్లు విన్నవించారు. ఈ క్రమంలో జీతాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యపై అధ్యయం చేసిన అధికారులు తగిన పరిష్కారం కనుగొన్నట్టు సమాచారం.
బడ్జెట్‌ కేటాయింపుల్లో మార్పులు
స్కీమ్‌ల అమలు, జీతాలు ఒకే ఖాతా కింద నిర్వహిస్తుండటంతో అవసరాన్ని బట్టి పథకాల అమలుకే మొత్తం నిధులను మళ్లిస్తున్నారు. ఈ విభాగంలో చేపడుతున్న పనులపై అధికారులకు సరైన అంచనా లేక పోవడం, ఒక్కోసారీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా రాక పోవడం తదితర కారణాల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తేలింది. దీంతో జీతాలు చెల్లించడానికి ఇక్కట్లు తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్కీంల అమలు, జీతాలకు వేర్వేరుగా బడ్జెట్‌ కేటాయింపులు చేయాలని సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు క్షేత్ర స్థాయిలో మాన్యువల్‌ పద్థతిలో చెల్లింపుల ప్రక్రియ కాకుండా, అన్‌లైన్‌లో ఏకకాలంలో సిబ్బందికి జీతాలు అందేలా సాంకేతికంగా మార్పులు చేయనున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఇకనుంచి ప్రతీ నెల మొదటిరోజే జీతాలు అందనున్నాయి. నూతన విధానానికి సంబంధించి పంచాయతిరాజ్‌ శాఖ ప్రతిపాదనలకు వారం పది రోజుల్లో ఆర్ధిక శాఖ ఆమోద ముద్ర వేయనున్నట్టు సమాచారం. అన్ని సక్రమంగా జరిగితే ఇక నుంచి ప్రతి నెల ఒకటిన జీతాలు అందుకోనున్నారు.

Spread the love