జనం నుండి.. జనం కోసం..

జనం నుండి.. జనం కోసం..బ్రిటన్‌ సామ్రాజ్యవాదుల్ని మన దేశం నుండి తరిమేయడం కోసం వ్యక్తిగత సౌఖ్యాలు వదులుకున్న అల్లూరి, భగత్‌సింగ్‌ వారసులు వారు. సంతానం కలిగితే ప్రజా ఉద్యమాల్లో స్వార్థం తొంగి చూడొచ్చనుకుని కష్టజీవులకు అండగానే కాదు, తండ్రిగానూ నిలిచిన సుందరయ్య వార సత్వంలో పెరిగిన ‘కామ్రేడ్లు’ వారు. వీళ్ల కాళ్లు జనంలోనే ఉంటాయి. వాళ్లు జనం కోసమే ఉంటారు. స్టాలిన్‌ ఉదహరించిన హెర్క్యూలిస్‌లు కాదు. గాల్లోకి ఎగరేసి చంపడానికి! వాళ్లు డబ్బుకి బానిసలు కాదు. లక్ష్యశుద్ధి ఉన్నవారు. లక్షలతో వారిని కొనలేరు. చిటారు కొమ్మనున్న పక్షి కన్ను మాత్రమే కనపడే అర్జునులు ఆ పందొమ్మిది మంది. శాసనసభ పోసుకోలు కబుర్లు చెప్పుకునే ‘గాసిప్‌ క్లబ్‌’ గా కాకుండా ప్రజా సమస్యలపై చర్చలు చేసే వేదికగా ఉండాలంటే తెలంగాణ శాసనసభకు సీపీఐ(ఎం) అభ్యర్థులు ఎన్నిక కావాలి. రాష్ట్రంలో గిరిజ నోద్యమాల నుండి కార్మిక పోరా టాల వరకు ప్రజా సమస్యలే వారి ఉఛ్వాస నిశ్వాసాలు.
నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసి పోయింది. అటు విజయ భేరీలు, ఇటు ఆశీర్వాద సభలు రాజకీయ విమర్శలు దాటి తిట్ల పురాణాల్లోకి జారుతున్నాయి. ముందు, ముందు బూతుల పంచాంగాలు విప్పినా ఆశ్చర్యం లేదు. బీజేపీ ఎలానూ గూడలు జారేసింది. తెలంగాణలో తన పప్పులుడికేలా లేవని ప్లాన్‌-బి కి తెరలేపింది. బీఆర్‌ఎస్‌ ని మెల్లిగ తన నిఘంటువులో నుండి పక్కకు జరిపింది. మొన్న కష్టపడి ఎల్‌బీ స్టేడియంలో సభ పెట్టిన మోడీ, కేసీఆర్‌ను పల్లెత్తు మాటనలేదు. ‘డొక్క చించేస్తాం, డోలు కట్టేస్తాం’ అన్న డైలాగులు లేకుండా ఆయన సందేశం చప్పగా సాగే సరికి బీజేపీ కార్యకర్తలే ఇదేం మతలబోనని బుగ్గలు నొక్కుకున్నారు. ఇప్పుడు నడిచేవి ‘క్విడ్‌ప్రోకో’ రాజకీయాలు కాబట్టి మొన్న రామగుండం సభలో కేసీిఆర్‌ కోలిండియాలో నూట అరవయ్యొక్క బ్లాకులను వేలానికి పెట్టిన బీజేపీని, ముఖ్యంగా మన సింగరేణిలో ఐదు బ్లాకులను అమ్మేసిన బీజేపీని కాకుండా కాంగ్రెస్‌ని విమర్శించడం ఆయనకి రాజకీయంగా ఉపయోగపడచ్చు గాని వాస్తవమైతే కాదు.
దేశంలో సంఫ్‌ు పరివార్‌ దుర్మార్గాలు అన్నీ, ఇన్నీ కావు. భారత సమా జాన్ని నిలువునా చీలుస్తున్నది. వర్ణాశ్రమ ధర్మాన్ని పున:ప్రతిష్ట చేసే ప్రయ త్నంలో ఉంది ‘పరివార్‌’. 1930వ దశకంలో యూ దుల్ని ఊచకోత కోసిన హిట్లర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆరాధ్య దైవం. ప్రస్తుతం పాలస్తీనాపై నరమేధం సాగిస్తున్న ‘యూదు సామ్రాజ్యం’ దానికి దిశానిర్దేశం చేసే తోక చుక్క. అందుకే బీజేపీని తెలం గాణ రాష్ట్రంలో ఐపు, అజా లేకుండా చేయాలి. అపుడే మన రాష్ట్రం ప్రశాం తంగా ఉంటుంది. కాంగ్రెస్‌ నుండి వయా బీఆర్‌ఎస్‌ నేడు బీజేపీ అభ్యర్థిగా నిలిచిన ఒక పెద్ద మనిషి బుల్డోజర్ల రాజ్యం కోసం బుల్డోజర్ల ప్రదర్శనతో మొన్న నామినేషన్‌ వేయడం ఒక చిన్న మచ్చు తునక.
బీఆర్‌ఎస్‌పై వివిధ వర్గాల ప్రజల్లో పెరుగుతున్న అసం తృప్తిని మైక్రాన్ల స్థాయి వరకు సున్నితపు త్రాసులో ఎప్పటి కప్పుడు జోకి చూసిన వామపక్షాలు తప్పనిసరై మునుగోడులో బీఆర్‌ఎస్‌నే బలపరిచాయి. కారణం బీజేపీని ఓడించి తెలంగాణ సమాజాన్ని ఐక్యంగా పరిరక్షించుకోవాలన్న తపనే తప్ప వేరే కాదు. అది ఎంత సరైందో ఆ తర్వాతి పరిణామాలు తెలియ చేస్తున్నాయి. బీజేపీ గ్రాఫును అది అద: పాతాళంలోకి తొక్కేసింది. ఈ నేపథ్యంలో నుంచి ప్రస్తుత ఎన్నికలను చూడాలి. అభ్య ర్థులే దొరకక, నాయకుల సమన్వయం లేక, వచ్చిన వారందరూ ఎవరిదారి వారు వెతుక్కుని పోతుండగా ”మేమంటూ అధికా రంలోకొస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన”డం నవ్వుకోవడానికి తప్ప నమ్మడానికి ఉపయోగపడదు. పైగా కులగణనపై నోరిప్పని పార్టీ నోట్లోంచి ఈ వాగ్దానం రావడం ఎనిమిదవ వింతే.
ఈ స్థితిలో వామపక్షాల దారెటు? అని కొందరు సందేహాలు వెలిబుచ్చినా గౌరవ ప్రదమైన మార్గమెంచుకుంది సీపీఐ(ఎం). కాంగ్రెస్‌ ఎరలకు చిక్కకుండా గత అనేక ఏండ్లుగా ఉద్యమాలు చేస్తూ తనకంటూ శక్తి ఉందని భావించిన స్థానాల్లో పోటీకి దిగింది. బీజేపీ బలమున్న నియోజకవర్గాల్లో దాన్ని ఓడించే శక్తి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల్లో ఎవరికుంటే వారిని బలపరచాలని నిర్ణయిం చడం ఈ ఎన్నికల్లో కీలక పరిణామం. ఈ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కనీయరాదని ఆ పార్టీ అభిప్రాయం.
ఈ నేపథ్యంలో ప్రజాపోరాటాల్లో రాటుదేలిన వ్యక్తులు దాని అభ్యర్థులు. వాళ్లకు కోట్ల రూపాయల్లేవు. నోట్లు వాళ్లు పంచరు. ఎన్నికలంటేనే డబ్బుమయమైన వేళ, వారు చేసిన పోరాటాలే పెట్టుబడిగా ఎన్నికల రంగంలోకి దూకిన ప్రజల మనుషులు వాళ్లు. కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు ఉద్యమాల్లో పాల్గొని ప్రజల కోసం జైళ్లపాలైనవాళ్లు. ప్రజల కోసం లాఠీ దెబ్బలు తిన్నవారు, మహిళా హక్కులకై నిలిచిన వారు, కుల వివక్షతో పాటు, సామాజిక అణచివేతలపై పోరాడుతున్నవారు ఆ పార్టీ అభ్యర్థులు.
అన్యాయం జరిగేటపుడు నువ్వు తటస్థంగా ఉంటే పీడకుల పక్షం వహించిన వాడివి అవుతావన్న డెస్మెండ్‌ టుటు మాటలు వారికి శిరోధార్యం. ”ఉక్కు బాహువుల వీరులు తుఫానులు ఊదుతున్నారు. పాత లోకాన్ని భస్మం చేస్తున్నారు. కొత్త లోకాన్ని సృష్టిస్తున్నారు. కర్మాగారపు కొలిమిలో ” అని గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పింది సరిగ్గా నప్పేది వారికే!

Spread the love