వాగర్‌పై క్రిమినల్‌ కేసు ఉపసంహరణ ఎఫ్‌ఎస్‌బీ వెల్లడి

– దేశ ప్రజలకు పుతిన్‌ కృతజ్ఞతలు
మాస్కో : వాగర్‌ గ్రూపుపైపెట్టిన క్రిమినల్‌ కేసును రష్యాకి చెందిన ఎఫ్‌ఎస్‌బీ సెక్యూరిటీ సర్వీస్‌ ఉపసంహరించుకుందని మంగళవారం రష్యన్‌ వార్తా సంస్థలు తెలిపాయి. ”ప్రత్యక్షంగా నేరానికి పాల్పడేందుకు ఉద్దేశించిన చర్యలను భాగస్వాములు విడనాడినందున” కేసును తొలగించినట్లు రియా వార్తా సంస్థ తెలిపింది.
శనివారం రాత్రి పొద్దు పోయిన తర్వాత కుదిరిన ఒప్పందం మేరకు ఈ తిరుగుబాటులో పాల్గొన్న వారిని ప్రాసిక్యూట్‌ చేయబోమని క్రెమ్లిన్‌ తెలిపింది. తిరిగి వారు వారి స్థావరానికి వెళ్ళేందుకు అనుమతిస్తామని తెలిపింది. తిరుగుబాటుకు పాల్పడిన వారిని పుతిన్‌ రాజద్రోహులుగా పేర్కొంటున్నప్పటికీ ప్రిగోజిన్‌ను, ఆయన అనుచరులను ప్రాసిక్యూట్‌ చేయరాదని క్రెమ్లిన్‌ నిర్ణయించింది. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనే వారి పట్ల క్రెమ్లిన్‌ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. సుదీర్ఘకాలం జైలుశిక్షలను ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేతలు కూడా వున్నారు. కానీ ప్రిగొజిన్‌ మాత్రం ప్రాసిక్యూషన్‌ను తప్పించుకున్నారు.
సాయుధ తిరుగుబాటుకు ప్రయత్నం జరిగిన నేపథ్యంలో ఐక్యతను ప్రదర్శించినందుకు అధ్యక్షుడు పుతిన్‌ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేశారు. పరిస్థితిని మరీ అధ్వాన్నంగా మార్చి రక్తపాతానికి దారి తీయకుండా సహకరించిన కిరాయి సైనికులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు.
కాగా తాను కుట్రకు పాల్పడాలని భావించలేదని, వాగర్‌ విధ్వంసం కాకుండా నివారించాలన్నదే తన అభిమతమంటూ ప్రిగొజిన్‌ 11 నిముషాల పాటు గల ఒక ఆడియోను సోమవారం విడుదల చేశారు. ”అన్యాయం జరుగుతున్నందున మేం మా ప్రదర్శన ప్రారంభించాం.” అని చెప్పారు. తానెక్కడుందీ, తన ప్రణాళికలు ఏమిటి అన్న వివరాలు వెల్లడించలేదు.

Spread the love