ఆధిపత్యవాదంపై పోరులో రష్యాకు పూర్తి మద్దతు

Full support for Russia in the fight against hegemony కిమ్‌ ఉద్ఘాటన
– రష్యన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వద్ద ఇరువురు నేతల భేటీ
– ద్వైపాక్షిక సంబంధాలు, సహకారంతో సహా పలు అంశాలపై చర్చ
మాస్కో: అమెరికా, దాని మిత్రపక్షాల ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా రష్యా సల్పుతున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బుధవారం ఉద్ఘాటించారు. కిమ్‌ విదేశీ పర్యటనలు జరపడం చాలా అరుదు. రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తన పర్యటన ఉద్దేశమని కిమ్‌ తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలసి ఆయన రష్యన్‌ సుదూర తూర్పు ప్రాంతమైన అమూర్‌లోని రష్యన్‌ అంతరిక్ష రాకెట్‌ ప్రయోగ కేంద్రం (సోయజ్‌-2)ను సందర్శించారు. అనంతరం ఈ ఇరువురు నేతలు తమ ప్రతినిధి బృందాలతో కలసి గంటకు పైగా చర్చలు జరిపారు. ఆ తరువాత పుతిన్‌, కిమ్‌ ముఖాముఖి సమావేశం జరిగింది.. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, సహకారం, ఆర్థిక, వాణిజ్య సంబంధాలు, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఈ ఇరువరు నేతలు చర్చించినట్లు రష్యన్‌ అధ్యక్ష భవన ప్రతినిధి డిమిట్రి పెస్కొవ్‌ తెలిపారు. ఆధిపత్య శక్తులు సాగిస్తున్న దాడుల నుంచి తన దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను పరిరక్షించుకోవడం కోసం రష్యా పోరాడుతోందని ఉక్రెయిన్‌ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని కిమ్‌ వ్యాఖ్యానించారు. తనను రష్యా పర్యటనకు ఆహ్వానించి నందుకుగాను పుతిన్‌కు తన తరపున, తన దేశం తరపున కిమ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. రష్యాతో మైత్రీబంధాన్ని మరింత బలోపేతం చేసుకు నేందుకు తాము అత్యంత ప్రాధాన్యతనిస్తామని కిమ్‌ తెలిపారు. అంతరిక్ష పరిశ్రమ రంగంలో రష్యా సహకారాన్ని ఉత్తర కొరియా నేత కోరారు. కిమ్‌ రష్యా పర్యటనకు బయల్దేరడానికి ముందు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఒక ప్రకటన చేస్తూ రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేస్తే సహించేది లేదని హూంకరించారు. ఆ వెంటనే ఆయుధాలు అమ్ముకోవడానికే కిమ్‌ పర్యటన ఉద్దేశించబడిందని పాశ్చాత్య మీడియా ప్రచారం అందుకుంది. దక్షిణ కొరియాతో సంధి కుదిరి 70 ఏళ్లు అయిన సంద ర్భంగా ప్యాంగ్యాంగ్‌లో మొన్న జులైలో జరిగిన కార్యక్రమానికి రష్యన్‌ రక్షణ మంత్రి సెర్గీ షోయిగు హాజరయ్యారు.

Spread the love