ఫన్‌ అండ్‌ ప్రస్టేషన్‌

హీరో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ నటించిన ఎఫ్‌2, ఎఫ్‌3 చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. నవ్వించాయి. తాజాగా బీజేపీలో కూడా ఎఫ్‌2 మొదలైంది. పార్టీలో భారీ మార్పులు జరుగుతాయన్న వార్తలు వస్తున్నాయి. మీడియాలో కథనాలు వస్తున్నాయి. డీకే అరుణ బీజేపీ అధ్యక్షులు అవుతారట కదా? అంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత మురళీధర్‌రావును మీడియా ప్రతినిధులు అడిగారు. ఆయన ఒక్కసారిగా ప్రస్టేషన్‌కు గురయ్యారు. ‘మీరే రాస్తారు. మీరే ప్రసారం చేస్తారు. మీరు మమ్ముల్ని అడుగుతారు’ అంటూ విలేకర్లపై అసహనాన్ని ప్రదర్శించారు. ఆయన ప్రస్టేషన్స్‌ను గమనించిన మరో విలేకరి కలుగజేసుకుని ‘సార్‌ మీరు చెప్పకుండా మాకెలా తెలుస్తుంది. మీ నాయకులు లీకులు ఇస్తేనే కదా మాకు తెలిసేది. విలేకరికి తెలిసిన విషయాన్ని వార్త రాయకుండా ఎలా ఉంటారని’ కాస్త గట్టిగా అనడంలో ఆయన వెనక్కి తగ్గారు. అదీ కాదండీ పార్టీని బదనాం చేసేందుకు లేనిది ఉన్నట్టు రాస్తున్నారని మరో పల్లవి అందుకున్నారు. మొత్తంగా బీజేపీలో జరుగుతున్న అంతర్గత పోరు మాత్రం ఆ పార్టీని కొంత ఇబ్బందికి గురి చేస్తున్నట్టు కనపిస్తున్నది. అందుకే ఆ పార్టీ నేతలు ప్రశ్నలను తట్టుకోలేకపోతున్నారు. చిన్న ప్రశ్నకు కూడా తుఫానులా లేస్తున్నారు. అప్పుడే నవ్విస్తున్నారు. అప్పుడే ఏడిపించేస్తున్నారు. ఇది తాజాగా కమలం పార్టీ ఫన్‌ అండ్‌ ప్రస్టేషన్‌ అని విలేకర్లు జోకులు వేసుకుంటూ మీడియా సెంటర్‌ నుంచి జారుకున్నారు. -గుడిగ రఘు

Spread the love