తక్షణమే నిజాంషుగర్స్‌కు నిధులు విడుదల చేయాలి

తక్షణమే నిజాంషుగర్స్‌కు నిధులు విడుదల చేయాలి– యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేపట్టాలి : సీపీఐ(ఎం) నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు
నవతెలంగాణ-బోధన్‌
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించడానికి ప్రభుత్వం తక్షణమే కావాల్సిన నిధులు విడుదల చేసి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఐ(ఎం) బృందం నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. అనంతరం నాయకులు ఫ్యాక్టరీ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని అసెంబ్లీలో ప్రకటించినందున.. ముందుగా ఫ్యాక్టరీ పునరుద్ధరణకు, యంత్రాల మరమ్మ తుకు నిధులు కేటాయించాలని కోరారు. చాలా సంవత్సరాలుగా మూతపడి ఉండటంతో యంత్రాలు తుప్పు పట్టి పనికిరాకుండా పోయాయని చెప్పారు. వాటిని మరమ్మతు చేస్తేగానీ ఫ్యాక్టరీ తెరుచుకునే అవకాశం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే, కార్మికులను నియమించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో పనిచేసిన కార్మికులకు గత ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలుగా వేతనాలు ఇవ్వలేదని, వాటిని తక్షణమే మంజూరు చేయాలని కోరారు. వేతనాలు లేక.. ఆర్థిక ఇబ్బందుల్లో కార్మికులు మనోవేదనకు గురై అనారోగ్యంతో చనిపోయిన ఆ కుటుంబాలను ఆదుకోవాలన్నారు. చెరుకు బండ్లు, ట్రాక్టర్లు నిలుపుకోవడానికి ప్రస్తుతం స్థలం లేనందున దానిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరీ స్థలాలను గత ప్రభుత్వంలో ప్రయివేట్‌ వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేసినట్టు ఉందన్నారు. గత ప్రభుత్వం లాగా మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించొద్దన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలగాలంటే తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఏశాల గంగాధర్‌, శంకర్‌గౌడ్‌, గంగాధరప్ప, వెంకటేష్‌, నన్నేసాబ్‌, కుమారస్వామి ఉన్నారు.

Spread the love