జి-20 కాదు 21

Permanent membership of the African Union

– ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం
– యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీ డిక్లరేషన్‌
– ఆమోదం పొందినట్టు ప్రధాని ప్రకటన
– ఘనంగా ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు
న్యూఢిల్లీ : ఆఫ్రికన్‌ యూనియన్‌కు జి20లో శాశ్వత సభ్యత్వం కల్పిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. జి20 శాశ్వత సభ్యదేశం హోదాలో కేటాయించిన కుర్చీలో ఆసీనులు కావాల్సిందిగా ఆఫ్రికన్‌ యూనియన్‌ చైర్‌ పర్సన్‌ అజలి అసౌమనిని మోడీ ఆహ్వానించారు. అజలి తన కూర్చీలో ఆసీనులు కాగా శాశ్వత సభ్యదేశాలన్నీ చప్పట్లతో స్వాగతం పలికాయి. ప్రధాని మోడీ ఆయనను ఆలింగనం చేసుకున్నారు. జి20లో అమెరికా, అర్జెంటినా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండియా, బ్రిటన్‌, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరెబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే కలిపి 19 దేశాలున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ ఈ గ్రూపులో 20వ మెంబర్‌గా ఉంది. ఇప్పుడు ఆఫ్రికన్‌ యూనియన్‌ కూడా శాశ్వత సభ్యత్వం పొందడంతో జి20లో 19 దేశాలు, రెండు యూనియన్లు సభ్యులుగా మారాయి. 1999లో జి-20 ఏర్పడిన తర్వాత మొట్టమొదటి విస్తరణ ఇదే. జి-20లో శాశ్వత సభ్యత్వ దేశాల్లో యురోపియన్‌ యూనియన్‌ తర్వాత 55 దేశాలతో రెండో అతిపెద్ద గ్రూపుగా ఆఫ్రికన్‌ యూనియన్‌ వుంది. భారత్‌ వ్యాప్తంగా 60కి పైగా నగరాల్లో 200కి పైగా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా భారత్‌లో ప్రజా జి-20గా మారిందని మోడీ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదముద్ర
ఉక్రెయిన్‌ ఘర్షణపై ఉద్రిక్తతలు, భిన్నాభిప్రా యాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ రూపొందించిన న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు జి20 శిఖరాగ్ర సదస్సు తొలిరోజే ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ప్రధాని మోడీ ప్రకటించారు. ఉక్రెయిన్‌ ఘర్షణను వివరిస్తూ జి-20 దేశాలకు భారత్‌ కొత్త ముసాయిదాను పంపిణీ చేసిన కొద్ది గంటల తర్వాత ఈ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం నెలకొన్నట్లు, ఆ తర్వాత ఆమోద ముద్ర పొందినట్లు ప్రకటన వెలువడింది.
ఉక్రెయిన్‌ ఘర్షణపై ఉపయోగించిన పదజాలంపై నేతలంద రూ ఏకాభిప్రాయానికి రావడంతో ఆమోదం పొందింది. ‘ప్రపంచంలోని భిన్న ప్రాంతాల్లో యుద్ధాల వల్ల ప్రజలు అనుభవించే తీవ్రమైన బాధ, ప్రతికూల ప్రభావాలపై ఆందోళన చెందుతున్నాం’ అని డిక్లరేషన్‌ మొదటి వ్యాక్యంలోనే పేర్కొనడం విశేషం.
అయితే బాలి శిఖరాగ్ర సదస్సులో మాదిరి ‘ఉక్రెయిన్‌పై రష్యా దాడి’ వంటి పదజాలాన్ని ఇందులో ఉపయోగించకుండా మెతక పదజాలాన్ని వినియోగించినందునే రష్యా దీనిపై సంతకం చేసినట్లు పేర్కొంటున్నారు. అణ్వాయుధా ల గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. అయితే ఏ దేశం పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. ‘ఐక్యరాజ్యసమితి నిబంధనలు అన్ని దేశాలూ అనుసరించాలి. ఇతర దేశాల సార్వభౌమాధికారం, రాజకీయ స్వతంత్రత, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాలి. ఇక్కడ ఎలాంటి బలప్రయోగాలకూ దిగకూడదు’ అని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. అయితే న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో వినియోగించిన పదజాలం కఠువుగానే ఉందని బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ పేర్కొన్నారు. ప్రధానంగా ఆహార ధరలపై యుద్ధం చూపుతున్న ప్రభావాన్ని ప్రస్తావించారని చెప్పారు. ఉక్రెయిన్‌ ఆహార ధాన్యాలు ప్రపంచ మార్కెట్లోకి వచ్చేందుకు ‘బ్లాక్‌ సీ గ్రెయిన్‌ ఇన్సియేటివ్‌’ను పక్కాగా అమలు చేయాలని డిక్లరేషన్‌లో పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు.
వాతావరణ మార్పులపై విభేదాలు ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశాల తరహా లో జి20 సదస్సుల్లో సాధారణంగా అభివృద్ధి చెందిన, వర్తమాన దేశాల మధ్య విభేదాలు కనిపించవు. కానీ ఈ దఫా శిఖరాగ్ర సదస్సులో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించుకోవడం, పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను పెంచడం, హరిత వాయు ఉద్గారాల కట్టడి వంటి అంశాలపై ఉమ్మడి డిక్లరేషన్‌లో విభేదాలు కనిపించాయి. జి20 దేశాలు ప్రపంచ హరిత వాయు ఉద్గారాల్లో 75 శాతానికి కారణం అన్న సంగతి తెలిసిందే. అయితే 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలనే అభివృద్ధి చెందిన దేశాల వాదనకు రష్యా, చైనా, సౌదీ అరెబియా, భారత్‌ తీవ్ర అభ్యంతరాలు తెలియ జేశాయి. రెండు రోజుల్లో 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాల్లో మోడీ పాల్గొంటున్నారు. శుక్రవారం అమెరికా అధ్యక్షులు బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.సదస్సుకు హాజరైన నేతల్లో జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్స్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షులు ఎమ్మాన్యు యెల్‌ మాక్రాన్‌, బ్రిటీష్‌ ప్రధాని రిషి సునాక్‌, టర్కీ అద్యక్షుడు రెసెప్‌ తైయీప్‌ ఎర్డోగన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెయు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, దక్షిణ కొరియా అధ్యక్షులు యూన్‌ సుక్‌ యోల్‌, బ్రెజిల్‌ అధ్యక్షులు లూయిస్‌ డసిల్వా వున్నారు. చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ సదస్సుకు హాజరుకాలేదు.
పేదరికాన్ని దాచిన మోడీ
న్యూఢిల్లీ : జి-20 సదస్సుకు హాజరయిన ప్రపంచ నేతలకు మురికివాడలు, వీధి జంతువులు కనిపించకుండా వుండేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక పాట్లు పడిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రస్తుతం విదేశాల్లో వున్న రాహుల్‌ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. భారతదేశ
పేదరికాన్ని దాచిన మోడీ వాస్తవికతను మన అతిథుల కంటపడకుండా దాచిపెట్టాల్సిన అవససరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సదస్సుకు ముందుగా, కొన్ని మురికివాడలను గ్రీన్‌ షీట్‌లతో కప్పివుంచిన దృశ్యాన్ని, వీధి జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించిన తీరును కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఇదే విషయమై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ కూడా ప్రధానిపై ధ్వజమెత్తారు. సదస్సుకు ముందుగానే మురికివాడలను కూల్చడమో లేదా కప్పి వుంచడమో చేశారని, దీంతో వేలాదిమంది పేదలు నిర్వాసితులయ్యారని పేర్కొన్నారు. ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ అన్న థీమ్‌తో జి-20 సదస్సు జరుగుతోందని, కానీ ప్రధాని మోడీకి ‘ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వం, ఒక బిజినెస్‌ గ్రూపు’ పట్లే నమ్మకం వున్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది. గౌతమ్‌ అదానీ గ్రూపు ఆర్థిక లావాదేవీలను కాంగ్రెస్‌ ప్రశ్నించింది. అవినీతి, మనీ లాండరింగ్‌ కార్యకలాపాలను అణచివేయాలం టూ మోడీ అంతర్జాతీయ సమాజానికి గతంలో ఇచ్చిన పిలుపులను ఈ సందర్భంగా కాంగ్రెస్‌ గుర్తు చేసింది.
మోడీ ఎదుట భారత్‌ కార్డు
జి20 శిఖరాగ్ర సదస్సులో అధ్యక్ష స్థానంలో కూర్చున్న ప్రధాని మోడీ ఎదుట ‘ఇండియా’ బదులుగా ‘భారత్‌’ అని రాసివున్న కార్డు కనిపించింది. ఇప్పటికే ఆహ్వాన పత్రాలపై ఇండియా స్థానంలో భారత్‌ అని ముద్రించడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అయితే జి20 మొత్తంగానే ‘ఇండియా’ స్థానంలో ‘భారత్‌’ అనే పదాన్ని జొప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించినట్లు దీంతో స్పష్టమైంది. ఈ దస్సులో ‘భారత్‌’ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నది ప్రధాని నరేంద్ర మోడీ అని కూడా పేర్కొనడం మరో విశేషం. జి-20 అధికార పత్రాలన్నింటిలోనూ ప్రభుత్వం ‘భారత్‌’ అనే మాటనే ఉపయోగించడం సభ్యదేశాల్లోనూ చర్చనీయాంశమైంది.

Spread the love