జి-20 ఢిల్లీ శిఖరాగ్ర సభ ఉక్రెయిన్‌ సంక్షోభంపై రష్యా ప్రస్తావన లేకుండా ప్రకటన!

G-20 Delhi Summit Statement without mentioning Russia on Ukraine crisis!ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో జి-20 దేశాల 2023 శిఖరాగ్ర సమావేశం జయప్రదంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఒక సభ్య దేశ ఆతిధ్యంలో సమావేశాలు జరుగుతాయి. గతేడాది ఇండోనేషియాలో జరగ్గా వచ్చే ఏడాది బ్రెజిల్‌ వేదిక కానుంది. మరుసటి ఏడాది దక్షిణాఫ్రికాలో జరుగుతుంది, కాగా 2026లో జరగాల్సిన సభకు అమెరికా వేదిక కావటాన్ని చైనా ప్రశ్నించినప్పటికీ చివరికి అంగీకరించింది. ప్రతి సమావేశం తరువాత విడుదల చేసే సంయుక్త ప్రకటన విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తినప్పటికీ చివరికి విడుదల చేశారు. ఈ కూటమిలోని కొన్ని దేశాల మధ్య కొనసాగుతున్న తీవ్ర విబేధాలు, పరస్పర అనుమానాలు తదితర కారణాల వలన చైనా అధినేత షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హాజరు కాలేదు. దీని గురించి ఎవరికి తోచిన ఊహాగానాలను వారు చేశారు తప్ప అధికారికంగా సదరు దేశాల నుంచి ఎలాంటి ప్రకటనలూ విడుదల కాలేదు. చైనా తరఫున ప్రధాని లీ చియాంగ్‌, రష్యా నుంచి విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావరోవ్‌ ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహించారు. ఈ కూటమిలో ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వం ఇవ్వటంతో ఇప్పటి నుంచి అది జి-21గా మారింది. దీనిలో 19 దేశాలు ఉన్నాయి. వాటిలో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, రష్యా, చైనా, అర్జెంటీనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, మెక్సికో, కెనడా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, టర్కీ, ఇటలీ, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా ఉన్నాయి. ఆఫ్రికా యూనియన్‌, ఐరోపా యూనియన్‌ పూర్తి సభ్యత్వం గల సంస్థలు, ఐరాసతో సహా కొన్ని శాశ్వత ఆహ్వానితుల జాబితా ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తినపుడు ఒక పరిష్కార మార్గంగా ఈ కూటమి ఏర్పాటుకు 1999లో జి-7 దేశాల కూటమి ఆలోచన చేసింది. 2008లో ధనిక దేశాల్లో తీవ్ర సంక్షోభం తలెత్తినప్పుడు ప్రతి ఏటా శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ కూటమిలో ఇప్పటి వరకు ఆహ్వానితురాలిగా ఉన్న ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వ హోదా కల్పిస్తూ ఢిల్లీ సభ ఆమోదం తెలిపింది. దీనికి కారకులం తామంటే తామని మన దేశంతో పాటు రష్యా, చైనాలు కూడా ప్రకటించుకున్నాయి. ఈ చర్య ద్వారా పేద దేశాల గొంతుక వినిపించేందుకు అవకాశం వచ్చిందన్నది స్పష్టం. సభ్యత్వం ఇచ్చిన ఖ్యాతిని ఎవరి ఖాతాలో వేసుకోవటం అన్నది ముఖ్యం కాదు. వాటికి తోడ్పడుతున్నది ఎవరు అన్నదే గీటురాయి. దాన్ని పరిశీలించినప్పుడు ఇటీవలి కాలంలో ఆఫ్రికా ఖండంలో రష్యా, చైనా సాయంతో పాటు వాటి పలుకుబడి కూడా పెరుగుతోందన్నది అందరికీ తెలిసిందే. న్యూఢిల్లీలో సభ జరిగిన తీరుతెన్నులు, పర్యవసానాలు, ఫలితాల గురించి సమీక్షలు వెలువడుతున్నాయి. తీసుకున్న నిర్ణయాలపై నవంబరు నెలలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష జరుపుతారు. ఆమోదించాల్సిన తీర్మానాలు, నిర్ణయాల మీద ఏకాభిప్రాయం సాధించే బాధ్యత ఆతిధ్య దేశం కలిగి ఉంటుంది. అందుకు అనుగుణంగానే దాన్ని మన దేశం కూడా నిర్వహించింది. ఐరాస తీర్మానాలు, పారిస్‌ ఒప్పందాల వంటి వాటినే అంగీకరించకుండా, అమలు జరపకుండా ఠలాయిస్తున్న దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. నిర్ణయాలను స్వచ్ఛందంగా అమలు జరపటం తప్ప విధికాదు. కొన్ని స్పందనలు, కొన్ని అభిప్రాయాలకు భిన్నంగా దేశాలు వ్యవహరిస్తున్న తీరుతెన్నుల గురించి స్థూలంగా చూద్దాం…ఈ సమా వేశాలను తన రాజకీయ ప్రయోజనాలకు నరేంద్రమోడీ ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం మనదేశంలో ఇప్పటికే ఉంది. సభ జరిగిన తీరు మీద బీజేపీ, నరేంద్రమోడీ మద్దతుదారుల స్పందన కూడా దానికి అనుగుణంగానే ఉంది.
పశ్చిమాసియాలో ప్రముఖ మీడియా సంస్థ ”అల్‌ జజీరా”లో రాసిన ఒక విశ్లేషణ ఇలా ప్రారంభమైంది… ”నరేంద్ర మోడీ మోము, భారత దౌత్య మహత్తు (లేదా వివేకం) ప్రదర్శితమైంది. కానీ భారత భిన్నత్వ ప్రదర్శనకు అవకాశాన్ని నిరాకరించారు. భారత్‌ 140కోట్ల జనాభా ఉన్న దేశం. కానీ సమావేశ రోజుల్లో రాజధాని నగరంలో ఎక్కడ చూసినా కేవలం ఒక ముఖమే కనిపించింది. జి-20 కూటమి నేతలకు ఆతిధ్యం ఇస్తున్న ప్రధాని నరేంద్రమోడీదే అది. కేవలం విమానాశ్రయం వద్దనే కాదు, సభకోసం ఇటీవల జరిపిన నిర్మాణం వరకు చూస్తే ప్రతి రోడ్డు, కొన్ని చోట్ల ప్రతి కొన్ని అడుగులకు, ఎక్కువ చోట్ల రెండుకార్ల పొడవునా ఒక వ్యక్తి ప్రదర్శన మాత్రమే కనిపించింది. దౌత్య ఆడంబర ప్రదర్శనలో మోడీ హీరో కాగా మధ్య ఢిల్లీలో సభ నిర్వహణ ప్రాంతానికి సమీపంలోని విదేశీ రాయబార కార్యాలయాలు, హోటళ్ల వద్ద సంచరించే కోతులను భయపెట్టేందుకు వాటి బొమ్మలతో కూడిన భారీ కటౌట్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సభ జరిగిన చోట వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ ప్రధాన ప్రతీకగా ఉన్న మోడీ బొమ్మలు ఎక్కువగా కనిపించాయి. ప్రగతి మైదాన్‌ గా పిలుస్తున్న ప్రాంతంలో కొత్త సభా భవనాన్ని నిర్మించి దానికి భారత మండపం అని పేరు పెట్టారు. దీంతో లౌకిక ముద్ర నుంచి దూరంగా జరిగినట్లయింది. హిందూ దేవాలయాల్లో ముందు వసారాలను మండపం అని పిలుస్తారు.” ఈ విశ్లేషణలో వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు.
శిఖరాగ్ర సభ ఒక రోజు ముందే సంయుక్త ప్రకటనను ఆమోదించింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్‌ అని దానిలో పిలుపునిచ్చారు. ఈ సుభాషితంతో ఎవరికీ ఇబ్బంది లేదు, అభినందనీయమే. దానికి కట్టుబడి ఉన్నది ఎవరన్నదే ప్రశ్న. ఇది యుద్ధాలకు తగిన యుగం కాదు అన్నది ప్రకటనలోని ఒక అంశం. ఈ కూటమి ఉనికిలోకి వచ్చిన తరువాతనే ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ల మీద ఈ కూటమిలోని దేశాలు దురాక్రమణలకు పాల్పడిన చరిత్ర, అనేక దేశాల మీద దాడులకు ఉగ్రవాదులను, కిరాయి మూకలను ఉసిగొల్పుతున్న తీరు తెలిసిందే. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎగదోసిందీ, రష్యా ప్రాదేశిక భద్రత మీద ఎలాంటి హామీ ఇవ్వకుండా ఆయుధాలను సరిహద్దుల్లోకి చేర్చటం ప్రారంభించిన తరువాతే పుతిన్‌ సైనిక చర్యకు పాల్పడినదాన్ని ప్రపంచం చూసింది. దాన్ని పరిష్కరించాల్సిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు తమ ఆయుధ సంపత్తిని అందిస్తూ ప్రోత్సహిస్తూ మరోవైపు సుద్దులు చెప్పటం హాస్యాస్పదం. తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని ఐరాస గుర్తించింది. దాన్ని విలీనం చేసుకొనే హక్కు చైనాకు ఉంది. దానికి తగిన సమయం రాలేదంటూ తైవాన్‌కు ఆయుధాలు ఇస్తూ చైనా మీద దాడికి ఉసిగొల్పుతున్న దేశాల నిజాయితీ ఏమిటన్నది ప్రశ్న. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో చైనా ఇంతవరకు ఏ దేశ నౌకనూ అడ్డుకున్న దాఖలా లేదు.
న్యూఢిల్లీ ప్రకటనలో పేర్కొన్న లక్ష్యానికి భిన్నంగా ప్రపంచంలో పరిణామాలు జరుగుతున్నాయి. అణ్వాయుధాల వినియోగం గురించి ప్రకటన హెచ్చరించింది. కానీ తానుగా వాటిని వినియోగించబోనని ప్రకటించేందుకు ఇంతవరకు అమెరికా అంగీకరించలేదు. అణ్వాయుధాలను మోసుకుపోయే ఆధునిక క్షిపణులు, విమానాలను రోజు రోజుకూ మెరుగు పరుస్తోంది. ఐరాస నిబంధనావళి ప్రకారం ఏ దేశమూ బలప్రయోగం చేయకూడదని పేర్కొన్నది. దీని మీద కూటమి దేశాలు రాజీపడినట్లు ఉక్రెయిన్‌ మండిపడింది. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడతామని రష్యా కూడా అంగీకరిం చిందని అందుకే దిగొచ్చి సంతకం చేసిందని కొందరు పశ్చిమ దేశాల వారు వక్రీకరించారు. వాస్తవానికి పశ్చిమ దేశాల వలలో చిక్కుకొని నాటోలో చేరి తమ ప్రాదేశిక భద్రతకు ముప్పు తలపెట్టినందున ఉక్రెయిన్‌ను దారికి తెచ్చేందుకు సైనిక చర్య జరుపుతున్నాం తప్ప దాన్ని ఆక్రమించుకొనే లక్ష్యం లేదని రష్యా ప్రారంభం నుంచీ చెబుతున్నది. రష్యా, ఉక్రెయిన్ల నుంచి ఆహారం, ధాన్యాలు, ఎరువుల సరఫరాను పునరుద్దరించాలని, ఎగుమతి దిగుమతులను అడ్డుకోరాదని, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కూడా జి-21 కూటమి కోరింది. టర్కీ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించి తమను దెబ్బతీస్తున్న కారణంగానే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ కారణంగా అనేక పేద దేశాలు అధిక ధరలకు ఇతర దేశాల నుంచి ఆహారాన్ని దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితికి పశ్చిమ దేశాలే కారణం. రైతులు విదేశాలకు సైతం ఎగుమతులు చేసుకొని లబ్దిపొందవచ్చంటూ మూడు సాగు చట్టాలను రైతుల మీద రుద్దినపుడు కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ జి-20 అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడే గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లి ఎగుమతులను కూడా నిషేధించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ సమావేశానికి షీ జిన్‌పింగ్‌ హాజరు కాకపోవటం గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. గతంలో జరిగిన ఇలాంటి శిఖరాగ్ర సమావేశాలకు కొన్ని దేశాల నేతలు రాకపోవటం తెలిసిందే. కానీ జిన్‌పింగ్‌ రాలేదంటే దాని వెనుక బలమైన కారణాలేమీ లేవంటే ఎవరూ నమ్మరు, తప్పుకుండా ఉండి ఉంటాయి. చతుష్టయ కూటమి(క్వాడ్‌) అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా కూటమి తనకు వ్యతిరేకమే అని చైనా భావిస్తున్నది. ఈ కూటమి నేతలను వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవ అతిధులుగా పిలవాలని మన ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీలోని ఓ గదిలో చైనా ప్రధాని ఉండగా మరొక పక్క గదిలో జో బైడెన్‌-నరేంద్రమోడీ సమావేశమై క్వాడ్‌ పటిష్టత గురించి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్చా నౌకారవాణా గురించి చర్చలు జరిపారు. ఇవి చైనాను రెచ్చగొట్టేవే అన్నది స్పష్టం. వీటికంటే ముందే చైనా రూపొందించిన ప్రపంచపటంలో మన భూభాగాలను కొన్నింటిని మినహాయించటం, దాని మీద వివాదం చెలరేగిన సంగతీ తెలిసిందే. గతేడాది ఇండోనేషియా నగరమైన బాలిలో జరిగిన సమావేశ ప్రకటనలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండిస్తూ చేర్చిన పేరా వివాదాస్పదమైంది. రాజీమార్గంగా చివరకు ఎక్కువ మంది సభ్యులు ఖండించారని, పరిస్థితి మీద ఇతరులు భిన్నమైన వైఖరులను వెల్లడించారని పేర్కొన్నారు. మొత్తం మీద ఖండన దానిలో కనిపించింది. ఆ సమావేశంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన ఉక్రెయిన్‌ నేత జెలెన్‌స్కీ కూటమిని జి-20 బదులు జి-19 అని సంబోధించటం (రష్యాను గుర్తించకుండా) కూడా రచ్చకు దారి తీసింది. సమావేశం జరుగుతుండగా పోలాండ్‌లో క్షిపణి పేలుడు జరిగింది. వాస్తవాలు నిర్థారించుకోకుండానే దానికి రష్యా కారణమని ఆరోపించటం, సభలో ఉన్న జి-7, నాటో కూటమి దేశాల నేతలు అక్కడే విడిగా సమావేశం కావటం, వాటన్నింటికంటే ముందే రష్యా ప్రతినిధి వర్గ నేత లావరోవ్‌తో ఫొటో దిగేందుకు అనేక మంది నేతలు తిరస్కరించటంతో అసలు బాలిలో పాల్గొన్నవారి కుటుంబ చిత్రమే లేకుండా పోయింది. తరువాత జరిగిన అనేక పరిణామాలు చైనా, రష్యాలతో అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల సంబంధాలు మరింతగా దిగజారాయే తప్ప మెరుగుపడలేదు. బాలిలో షీ జిన్‌పింగ్‌-జో బైడెన్‌ భేటీ జరిగింది, సంబంధాలను, మాటామంతిని పునరుద్దరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన వెలువడింది. కానీ ఆ వెంటనే అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నానీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పంతంతో తైవాన్‌ వెళ్లటం తెలిసిందే. తరువాత అమెరికా సర్కార్‌ మరింతగా మిలిటరీ సాయాన్ని ప్రకటించింది. ఈ పూర్వరంగంలో వెళ్లకపోవటమే మంచిదని షీ జిన్‌పింగ్‌, పుతిన్‌ భావించి ఉండాలి. సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించి బాలి ప్రకటనలో ఉన్న పదజాలానికి భిన్నంగా రష్యా పేరు లేకుండా యుద్ధం కారణంగా జనం పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే పేర్కొన్నారు. ఇది పశ్చిమ దేశాలకు ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. బాలిలో మాదిరి ఖండిస్తే చైనా, రష్యా అంగీకరించకపోతే అసలు ప్రకటనే వెలువడి ఉండేది కాదు. అది జరిగితే తాము బలపరస్తున్న నరేంద్రమోడీ ప్రతిష్టకు భంగమని భావించి పశ్చిమ దేశాలు అయిష్టంగానే రష్యా మిలిటరీ చర్య ప్రస్తావన లేకుండా అంగీకరించినట్లు కనిపిస్తోంది.

ఎం. కోటేశ్వరరావు
8331013288

Spread the love