ఉక్రెయిన్ యుద్ధంపై నెలకొన్న తీవ్ర అభిప్రాయ భేదాలను దృష్టిలో ఉంచుకుంటే, న్యూఢిల్లీలో జరిగిన జి-20 సదస్సు, అన్ని సభ్య దేశాల ఆమోదంతో సంయుక్త డిక్లరేషన్‌ను ఆమోదించడం ఆ సదస్సు సాధించిన విజయంగా చెప్పవచ్చు. 2022 నుండి 2025 వరకు జి-20కి అధ్యక్షత వహించిన, వహించబోతున్న నాలుగు దేశాలు-భారత్, ఇండోనేషియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు చేసిన సంయుక్త కృషి కారణంగానే ఉక్రెయిన్ యుద్ధం గురించి చెబుతున్న 8 పేరాగ్రాఫ్‌లపై విజయవంతంగా చర్చలు జరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంపై గల సెక్షన్‌లో, దురాక్రమణ దారుగా రష్యా గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. అమెరికా, పశ్చిమ దేశాలు అంగీకరించిన విషయం ఇది. బ్రిక్స్ శక్తివంతమైన వేదికగా ఎదుగు తున్న సమయంలో, ఒక డిక్లరేషన్‌ను ఆమోదించడంలో విఫలమైతే జి-20 పలచనైపోతుందనే వాస్తవాన్ని గుర్తెరిగి రష్యా దూకుడును ఖండించాలన్న వారి దృఢమైన వైఖరి నుండి వెనక్కి మళ్ళారు. చైనాను ఎదుర్కోడానికి భారత్‌ను కీలకమైన మిత్రదేశంగా బైడెన్ చూస్తున్నారు. అందువల్ల నరేంద్ర మోడీ, భారత్ రెండూ జి-20 సదస్సును విజయవంతంగా నిర్వహించి నందుకు అభినందనలు పొందేలా చూడాలని అమెరికా చాలా ఆసక్తిగా ఉండటం ఇందుకు మరో కారణమని చెప్పవచ్చు.
అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై చర్చించే వేదికగా జి-20 మొదలైంది. ఆగేయాసియా ఆర్థిక సంక్షోభం తర్వాత 1999లో ఇది ఏర్పడింది. నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల పంథాను అనుసరించడం వల్ల తలెత్తిన సంక్షోభ భారాన్ని పంచుకునేందుకు వర్థమాన దేశాలను కూడా కలుపుకోవాలని సంపన్న దేశాలు భావించడంతో జి-7 కాస్తా జి-20గా విస్తరించింది. 2008లో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో అప్పటివరకు మంత్రిత్వ స్థాయిలో జరిగే వార్షిక సంప్రదింపులను ప్రభుత్వాధి నేతల సదస్సుగా మార్చారు. జి-20 అధ్యక్ష బాధ్యతలు సభ్య దేశాల మధ్య ప్రతి ఏటా మారుతూ ఉంటాయి. జి-20 వార్షిక సదస్సు పలు అంశాలను చర్చించి, ఒక డిక్లరేషన్‌ను ఆమోది స్తుందని అనుభవం తెలియచేస్తోంది కానీ, సభ్యదేశాలన్నీ అమలు చేయగలిగేలా నిర్ణయాలు తీసుకునే సంస్థ కాదిది. జి-20 సదస్సులనేవి ఒక రొటీన్ వ్యవహారంగా మారిపోయాయి. ఈ సదస్సుల్లో ఆర్థికాంశాలు చర్చిస్తారు, కొన్ని ప్రతినలు కూడా చేస్తారు. కానీ వాటి అమలుకు కట్టుబడి ఉండటంగానీ లేదా పర్యవేక్షించడంగానీ ఉండదు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఉధృతమయ్యాయి. ఇది సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసింది. ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా, దాని మిత్రపక్షాలు ఒకవైపు. చైనా-రష్యా మరోవైపు నిలిచాయి. గతేడాది బాలి సదస్సులో ఎజెండాలోకి ఉక్రెయిన్ యుద్ధాన్ని తీసుకురావడానికి జి-7 దేశాలు పట్టుబట్టాయి. కానీ దానివల్ల చీలికలు ఏర్పడ్డాయి. చివరకు సంయుక్త డిక్లరేషన్‌ను వెలువరించే సాంప్రదా యాన్ని కూడా గందరగోళంలో పడేసింది.
అంతర్జాతీయ పేద దేశాల వాణిగా జి-20 సదస్సును చూపించాలని నరేంద్ర మోడీ, భారత్ బృందం భావించాయి, అందుకోసం కృషి చేశాయి. అమెరికాతో సన్నిహితమైన వ్యూహాత్మక పొత్తును పెట్టుకుంటున్నప్పటికీ, మారుతున్న ప్రపంచ పరిస్థితులు, పెరుగుతున్న బహుళ ధృవ వైఖరులను దృష్టిలో ఉంచుకుంటే, భారత్‌ను అంతర్జాతీయ పేద దేశాల ఛాంపియన్‌గా చూపించుకోవాల్సిన అవసరం ఉందని మోడీకి తెలుసు. అయితే, వర్థమాన దేశాలు, నిరుపేద దేశాలు ఎదుర్కొంటున్న సమ కాలీన సమస్యలపై న్యూ ఢిల్లీ డిక్లరేషన్‌లో ఎలాంటి నిర్దిష్టమైన లేదా చెప్పుకోదగ్గ అంశం లేదు. వాతావరణ మార్పులు, ఆ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడం వంటి కీలకమైన అంశంపై కేవలం సాధారణ ప్రకటనలు మాత్రమే వెలువడ్డాయి. వాతావరణ విపత్తులను ఎదుర్కొనడానికి వర్థమాన దేశాలకు ఈ క్లైమేట్ ఫైనాన్సింగ్ చాలా కీలకం. వాతావరణ మార్పులను ఎదుర్కొనడానికి అవసరమైన ఆర్థిక సాయం కోసం వంద బిలియన్ల డాలర్లను సమీకరించేందుకు పారిస్ సదస్సులో పారిశ్రామిక దేశాలు ఇచ్చిన హామీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉంది. క్లైమేట్ ఫైనాన్స్‌పై వర్థమాన, పేద దేశాల డిమాండ్లు ఈ డిక్లరేషన్‌లో ప్రతిబింబించలేదు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుతున్న రుణ ఇబ్బందులను తగ్గించేందుకు, వారిపై భారాన్ని తొలగించేందుకు ఎలాంటి వాస్తవిక చర్యలు ఇందులో లేవు. అమెరికా నిరంతరాయంగా పెంచుతున్న వడ్డీ రేట్ల వల్ల గత సంవత్సర కాలంలో పేద దేశాల రుణ భారాలు దాదాపు 800 బిలియన్ల డాలర్ల మేర పెరిగిన విషయాన్ని ప్రస్తావించడంలో డిక్లరేషన్ విఫలమైంది. తమ రుణాల చెల్లింపు బాధ్యతల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్న 60దేశాలకు రుణాలను రద్దు చేస్తామన్న హామీ కూడా ఆ డిక్లరేషన్ ఇవ్వలేకపోయింది. ఐక్యరాజ్య సమితి విధించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంపై శీఘ్రగతిన పురోగతిని సాధించాలని డిక్లరేషన్ పిలుపునిచ్చింది. 2015లో వీటిని ప్రారంభించారు. 2030 కల్లా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు, 17లక్ష్యాల అమల్లో కేవలం 12శాతం పురోగతి మాత్రమే జరిగింది. అయితే వాటిని సాధించేందుకు మరింతగా కృషి చేయాలంటూ దేశాలకు పిలుపివ్వడంతోనే డిక్లరేషన్ సంతృప్తి పడాల్సి వచ్చింది.
భారత్-మధ్య ప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ (ఐఎంఇసి)ని ఏర్పాటు చేయడంపై ఒప్పందం కుదుర్చుకోవడం ఈ సదస్సు నేపథ్యంలో వెలువడిన రెండో ప్రకటన. ఇది కూడా అమెరికా చొరవతోనే జరిగింది. ఈ కారిడార్‌లో రైలు, సముద్ర మార్గాల అభివృద్ధి కూడా ఇమిడి ఉంది. ఈ మార్గాలు భారత్‌ను మధ్య ప్రాచ్యం ద్వారా యూరప్‌కు అనుసంధా నిస్తాయి. ఈ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థికాంశాలు, వివిధ ప్రాజెక్టుల ఫైనాన్సింగ్ వంటి వివరాలు లేవు. చైనా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌కు ప్రతిగా ఐఎంఇసిని తయారు చేయాలన్నది ఇక్కడ అమెరికా ఆలోచన అని వేరే చెప్పనక్కరలేదు. జి-20 ప్రధాన బహుళార్థ వేదికగా అసమర్థ మైనదిగా ఇప్పటివరకు సాగిన ప్రక్రియ నిరూపించింది. ఎందుకంటే ఇక్కడ జి-7 దేశాలు, వాటి మిత్రపక్షాలే ఆధిపత్యం చెలాయించాయి. అయితే, భారత్ అధ్యక్ష బాధ్యతలకు సంబంధించినంతవరకు చూసి నట్లైతే జి-20 సదస్సుకు ఇతర ఉపయోగాలు ఉన్నాయి. మోడీ నాయకత్వం వల్ల భారత్‌కు చాలా లాభం కలిగిందని ఊదరగొట్టవచ్చని ఈ జి-20 సదస్సును నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం భావించాయి. మోడీ ప్రతిష్టను దేశీయంగా పెంచుకోవాలన్న తాపత్రయంతో పెద్దఎత్తున హంగామా చేశారు. గతేడాది కాలంలో జి-20 సమావేశాల కోసం ఏకంగా రూ.4100 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. జి-20 కోసం చేసిన బడ్జెట్ కేటాయింపులు కేవలం రూ.990 కోట్లుగా ఉన్నాయి. సదస్సు సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన కటౌట్లతో సహా ప్రచారార్భాటమంతా కూడా మోడీని అంతర్జాతీయ వేదికపై ముఖ్యమైన వ్యక్తిగా చూపించే యత్నం చేశారు. ఈ సదస్సును కవర్ చేయడానికి వచ్చిన విదేశీ మీడియా వెంటనే దీన్ని గుర్తు పట్టేలానే ఈ వ్యవహారం ఉంది. మోడీ తన వ్యక్తిగత పేరు ప్రతిష్టలను పెంచుకోవడానికి, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయావకాశాలను మెరుగు పరుచుకోవడానికి ఈ సదస్సును దారుణంగా దుర్వినియోగ పరిచారంటూ బ్రిటిష్ వార్తాపత్రిక ‘ది అబ్జర్వర్’ తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. ఏమీ లేకపోయినా మోడీని విశ్వగురుగా చూపించే మరో కార్యక్రమంగా జి-20 సదస్సు మిగిలి పోతుంది.
(‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)