– కళాకారులు, సాహిత్యకారులకు వచ్చే ఏడాది నుంచి పురస్కారాలు
– లిక్కర్ పార్టీని ఇంటికి పంపారు..
– నిక్కర్ పార్టీని కూడా ఓడించి గద్దర్ ఆశయాన్ని నిలపాలి
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– రవీంద్రభారతిలో ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు
నవతెలంగాణ-కల్చరల్
కళాకారులు, సాహిత్యకారులకు ఇక నుంచి నంది స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇటీవల సినీ కళాకారులు తనను కలిసి నంది అవార్డ్స్‌ను పునద్ధరించాలని కోరారని.. తాను వారికి నంది కాదు గద్దర్ పేరిట అవార్డ్స్ ఇస్తామని చెప్పానని అన్నారు. అలాగే మెదక్ జిల్లాకు గద్దర్ పేరు, ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటుపై మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై గద్దర్ ఫౌండేషన్ ప్రారంభం, ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ జయంతిని బుధవారం ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గద్దర్ జయంతి రోజు కళాకారులకు, సాహిత్యకారులకు అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ఈ వేదికగా చెబుతున్నా.. ఇదే శాసనం.. ఇదే జీవో అన్నారు. వచ్చే ఏడాది నుంచి గద్దరన్న జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామని తెలిపారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న అన్నారు. పొలిటీషియన్ లేదా క్రిమినల్‌ను ఎదుర్కోవటం సులువు కానీ.. క్రిమినల్ పొలిటీషియన్‌ను ఎదిరించి నిలవటం కష్టమని ఆయన చెప్పేవారన్నారు. నిక్కర్ పార్టీనీ, లిక్కర్ పార్టీనీ ఓడిస్తేనే సమ సమాజం అని గద్దర్ అనేవారని, లిక్కర్ పార్టీని ఇంటికి పంపామని.. రాబోయే ఎన్నికల్లో నిక్కర్ పార్టీని ఓడించడానికి ప్రజల సహకారం అవసరం అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూలుతుందని, ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారన్నారు. అలాంటి ఆలోచన చేసిన వారికి తెలంగాణ ప్రజలు ఘోరీ కడతారని హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఐదేండ్లు సుస్థిరంగా పాలన అందిస్తుందన్నారు. ప్రతిపక్షం బాధ్యతతో సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూమిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పేరిట తిరిగి భూస్వాములను కట్టబెట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ఇందిరమ్మ పాలనలో పేదల భూమి పదిలంగా ఉండేలా ధరణిని మూలకు పెట్టామని చెప్పారు. గద్దర్ ఒక కులం, ప్రాంతానికి చెందిన వారు కారని, అయన విశ్వమానవుడని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో, మండలంలో గద్దర్ స్ఫూర్తితో కళాకారులు, సాహితీవేత్తలు సమ సమాజం కోసం అకింతం కావటమే ఆయనకు నివాళి అన్నారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ.. నేడు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందని.. అసలైన కష్ట కాలం ముఖ్యమంత్రికి ముందు ఉందన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు ఆశలు, ఆకాంక్షలు ఎక్కువగా పెట్టుకున్నారని, కావునా ప్రజారంజక పాలన చేయలని సూచించారు.
సాహితీవేత్త కంచ ఐలయ్య మాట్లాడుతూ.. అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహ ప్రతిష్టకు సహకరించాలని ఎమ్మెల్సీ కవిత తనను కోరారని చెప్పారు. తనకే వల వేసిన వారు అధికార పార్టీ శాసన సభ్యులకు వల వేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలని సూచించారు. సభకు ముందుగా ఫౌండేషన్ స్థాపకుడు సూర్య కిరణ్ స్వాగతం పలుకుతూ గద్దర్ ఆశయాలు కొనసాగించటమే తమ సంస్థ లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా పాటకు జీవ కణం, గద్దర్ తరగని గ్రంథాలను సీఎం ఆవిష్కరించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, ప్రజా గాయకుడు జయరాజ్, గద్దర్ కుమార్తె వెన్నెల, సీపీఐ(ఎం) నాయకులు రాములు, సాంస్కృతిక పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, గద్దర్ సతీమణి విమల తదితరులు పాల్గొన్నారు.