తెలంగాణలో గద్దర్‌ ప్రజా పార్టీ

న్యూఢిల్లీ : తెలంగాణలో తెరపైకి మరో రాజకీయ పార్టీ రానుంది. ప్రజా గాయకుడు గద్దర్‌ నేతృత్వంలో ‘గద్దర్‌ ప్రజా పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటుచేయనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆయన బుధవారం కలిశారు. గద్దర్‌ ప్రజా పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నెలరోజుల్లో పూర్తికానుంది. ఈ సందర్భంగా గద్దర్‌ మీడియాతో మాట్లాడుతూ తాను వ్యక్తిగా ఉన్నప్పుడు కేసీఆర్‌పై పోటీ చేస్తానని చెప్పనని, తాను ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని, పుచ్చి పోయిన తెలంగాణ చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ విధానాలు తప్పనీ, ధరణి పేరుతో ముఖ్యమంత్రి భూములు మింగారని గద్దర్‌ విమర్శిం చారు. పదేండ్ల తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన అందలేదని, దొరల పరిపాలన సాగుతున్నదని దుయ్యబట్టారు. 77 ఏండ్ల వయసులో దోపిడీ పార్టీ పోవాలని ప్రజా పార్టీ పెట్టానన్నారు. ఓట్ల యుద్ధానికి సిద్దం కావాలని పిలుపిచ్చారు. ఓటును బ్లాక్‌ మనీ నుంచి బయటకు తేవాలన్నారు. ఇప్పటి వరకు అజ్ఞాత వాసం నుంచి ప్రజలను చైతన్యం చేశానన్నారు. ఇక నుంచి పార్లమెంటరీ పంథాను నమ్ముకుని బయలుదేరానని, ఇది శాంతి యుద్ధం, ఓట్ల యుద్ధమని అన్నారు. పార్టీ నిర్మాణం కోసం గ్రామ గ్రామానికి వెళ్తానని స్పష్టం చేశారు. సచ్చే ముందు సత్యమే చెపుతున్నానని, తాను భావ విప్లవకారుడినని, ఐదేండ్లు అడవిలో ఉన్నానని చెప్పారు. ప్రజలకు స్వేచ్ఛ, నీరు, ఉద్యోగాలు కావాలని గద్దర్‌ అన్నారు. కాగా అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసేముందు ఏపీ, తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి గద్దర్‌ పూలమాలవేసి నివాళులర్పించారు.

Spread the love