– అరకొర సోలార్ హీటర్లు..అవీ పని చేయట్లే
– నీళ్లు వేడి చేసేందుకు గ్యాస్..కట్టెలూ కరువు
– 80 శాతం హాస్టళ్లల్లో ఇదే పరిస్థితి
– చాలా భవనాల్లో తలుపుల్లేని కిటికీలే
– రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత
– మొఖం పగిలిపోతుందని విద్యార్థుల ఆవేదన
– చేతికందని కాస్మోటిక్ చార్జీలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
”చలి పంజా విసురుతున్న వేళ చన్నీళ్ల స్నానంతో హాస్టల్ విద్యార్థులు గజగజ వణికిపో తున్నారు. అరకొరగా ఉన్న సోలార్ హీటర్లు కొన్ని చోట్లే పని చేస్తున్నా అవి విద్యార్థుల సంఖ్యకు సరిపోవడం లేదు. ఎక్కువ హీటర్లు రిపేర్లు వచ్చి పని చేయట్లేదు. 80 శాతం హాస్టళ్లలో హీటర్లు, కనీసం నీళ్లు వేడి చేసేందుకు గ్యాస్, కట్టెలు లేని పరిస్థితి నెలకొంది. చాలా భవనాల్లో కిటికీలకు తలుపుల్లేక టవల్స్, దుప్పట్లు కప్పుకుని చలిగాలి రాకుండా జాగ్రతలు పడాల్సి వస్తుంది. చలికి చర్మం పగిలి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు కొబ్బరి నూనె, వాస్‌లెన్ సైతం ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. కాస్మోటిక్ చార్జీలు పెరిగినా అవి నెల నెలా చేతికందట్లేదు. దీన్ని బట్టి సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీ, మహాత్మాజ్యోతిరావు పూలే వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల పాలకుల చిన్నచూపు ఏ విధంగా ఉందో అర్థమవుతోంది.
సంక్షేమ హాస్టల్స్‌లో వేడి నీళ్లకు దిక్కులేదు. జిల్లా కేంద్రం, డివిజన్ కేంద్రాల్లోని హాస్టల్స్‌లో మాత్రమే సోలార్ వాటర్ హీటర్లున్నాయి. మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉన్న హాస్టళ్లలో ఎలాంటి సౌకర్యం లేదు. సోలార్ హీటర్లు ఉన్న చాలా చోట్ల రిపేర్లు వచ్చి వాడకంలో లేవు. సంగారెడ్డి జిల్లాలో 17 కస్తుర్బా గాంధీ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశారు. మొదట్లో అవి పని చేయడంతో చలి కాలంలో విద్యార్థులు వేడి నీళ్లతో స్నానాలు చేసేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి. తర్వాత వాటి నిర్వహణ సరిగ్గా లేక పనిచేయకుండా పోయాయి. నవంబర్ చివరి వారం నుంచి చలి పెరగడం, సోలార్ హీటర్లు పని చేయకపోవడంతో విద్యార్థులు చన్నీళ్లతోనే స్నానాలు చేయాల్సి వస్తోంది. అదే విధంగా 48 ఎస్సీ సాంఘీక సంక్షేమ హాస్టల్స్ ఉండగా 35 చోట్ల సోలార్ హీటర్లు ఏర్పాటు చేశారు. వాటిల్లో సగం వరకు నిరుపయోగంగా ఉన్నాయి. 13 ఎస్సీ హాస్టళ్లుండగా సోలార్ హీటర్లు అసలే పెట్టలేదు. అదే విధంగా 13 ఎస్సీ, 9 ఎస్టీ, 12 బీసీ గురుకులాలున్నాయి. 13 ఎస్సీ గురుకులాల్లో ఒక్క చోట కూడా సోలార్ హీటర్లు లేవు. 12 బీసీ గురుకులాల్లో గ్రీజర్లు ఉన్నా అవి సరిగ్గా పనిచేయడం లేదు. ఇదే పరిస్థితి మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, కస్తుర్బాల్లోనూ కొనసాగుతోంది. సోలార్ హీటర్లు, గ్రీజర్లు లేకపోయినా కనీసం నీళ్లు వేడి చేసేందుకు కట్టెలు లేవు. గ్యాస్ వాడితే ఖర్చు పెరుగుతుందని నిర్వాహకులు చెబుతు న్నారు. కొన్ని చోట్ల సోలార్ హీటర్లున్నా విద్యార్థుల సంఖ్యకు సరిపడా వేడినీళ్లు అందే పరిస్థితిలేదు. వంద మందికి పైగా విద్యార్థులున్న చోట వాటర్ హీటర్లు ఉన్నా సగం మందికి కూడా వేడినీళ్లు అందట్లేదు. స్కూల్ సమయం దృష్ట్యా ఎక్కువ మంది చన్నీళ్ల స్నానంతో సరిపెడుతున్నారు.
గజగజ
చలి తీవ్రతతో హాస్టళ్లల్లో వేడినీళ్లు కాచుకునే సౌకర్యం లేకపోవడంతో ట్యాంకుల్లోని చన్నీళ్లతోనే స్నానం చేయాల్సి రావడంతో హాస్టల్స్, గురుకుల, కస్తూర్బాల్లోని విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. బోరు ద్వారా సరిపడా నీటి లభ్యతలేకపోవడంతో ఒక రోజు ముందే ట్యాంక్‌ను నింపుతారు. చలితీవ్రత పెరగడంతో ట్యాంక్‌ల్లోని నీళ్లు ముట్టుకుంటే తట్టుకోలేనంత చల్లగా ఉంటున్నాయి. పొద్దున 9 గంటల వరకు కూడా చలి తీవ్రత ఉంటోంది. స్కూల్ సమయానికి ముందే స్నానం చేసి గబాగబా పాఠశాలకు బయలుదేరాల్సి వస్తుంది. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు 8.30కే పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. దీంతో అందరి కంటే గంట ముందే లేచి రెడీ అవ్వాల్సి వస్తుంది. సాయంత్రం పూట కూడా 6 గంటల వరకు ప్రత్యేక తరగతుల్లో ఉండి వస్తున్నారు. చాలా చోట్ల హాస్టళ్లు పాఠశాలలకు చాలా దూరం ఉండటంతో చలిలోనే నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. స్వెటర్స్, మంకీక్యాప్‌లిచ్చామని చెబుతున్నా విద్యార్థులు మాత్రం అవి లేకుండానే కనిపిస్తున్నారు. కొందరు మాత్రమే ఇంటి నుంచి తెచ్చుకున్న స్వెటర్స్, మంకీక్యాప్స్ వాడుతున్నారు. మరో పక్క అద్దెభవనాలు, సొంత భవనాలైనా పాత వాటికి కిటికీలు, తలుపులు సరిగ్గాలేవు. చాలా చోట్ల ఊడిపోవడంతో చలి వీస్తుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. తలుపుల్లేని చోట బస్తాలు, పాత గుడ్డల్ని చాటుగా కట్టుకుని చలి రాకుండా చూస్తున్నారు. సాయంత్రం పూట వరండాలో కూర్చోబెట్టి చదివించడం వల్ల చలికి వణికిపోతున్న పరిస్థితి ఉంది.
సీజనల్ వ్యాధులతో చిక్కులు
ఒక పక్క చలి తీవ్రత, మరో పక్క చన్నీళ్ల స్నానం వల్ల విద్యార్థులు చర్మం పగిలిపోయి పొడిబారిపోతుందని చెబుతున్నారు. పౌష్టికాహార లోపం వల్ల కొందరు విద్యార్థులు వీక్‌గా ఉన్నారు. మరికొందరు అస్తమా వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నప్పుడు ఎక్కువ సార్లు న్యూమోనియాతో బాధపడిన విద్యార్థులు చలిని తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఐదారు తరగతుల్లోపు విద్యార్థులు రెండు మూడు రోజులకోసారి స్నానం చేయాల్సిన పరిస్థితి వస్తుందని సీనియర్ విద్యార్థులు చెబుతున్నారు. పదో తరగతిలోపు విద్యార్థులే కాకుండా కళాశాల హాస్టల్స్‌లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు సైతం చన్నీళ్లతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఇటీవల కాస్మోటిక్ చార్జీలు పెరిగినా అవి నెల నెలా అందట్లేదు. అక్టోబర్‌లో ఇచ్చారు. నవంబర్, డిసెంబర్‌లో ఇవ్వకపోవడంతో విద్యార్థులు కొబ్బరి నూనె, వాజ్‌లైన్ వంటి క్రీమ్‌లను వాడలేకపోతున్నామని చెబుతున్నారు. ఇంటి నుంచే నూనెలు, ఏదైనా క్రిమ్‌లు తెచ్చుకుంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వెంటనే మెస్ చార్జీలను హాస్టల్లోని ప్రాథమిక స్థాయి విద్యార్థులకు రూ.5.45 నుంచి రూ.6.19కి పెంచింది. ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.8.17 నుంచి రూ.9.29కి పెంచింది మెస్ చార్జీల ప్రారంభం సందర్భంగా డిసెంబర్ 14న హాస్టళ్లల్లో పండగ వాతావరణం ఉండేలా తల్లిదండ్రులను పిలిచి మటన్, బగారా భోజనం పెట్టాలని సీఎస్ శాంతకుమారి ఆదేశించారు. ఇంత వరకు బాగానే ఉన్నా చన్నీళ్ల స్నానం చేస్తున్న విద్యార్థులకు వేడినీళ్లు అందించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
వేడి నీళ్ల సదుపాయం కల్పించాలి : అశోక్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి
సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కస్తుర్బా వంటి వాటిల్లో చలికాలం పోయే వరకు వేడి నీళ్ల సదుపాయం కల్పించాలి. సోలార్ హీటర్లను రిపేర్లు చేసి అన్ని నడిచేలా చూడాలి. చెడిపోయిన గ్రీజర్లను కూడా సరి చేయాలి. ఎక్కువ చోట హీటర్లు, గ్రీజర్లు లేని పరిస్థితి. ఉన్న చోట కూడా విద్యార్థుల సంఖ్యకు సరిపడా వేడినీళ్లు అందించే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించి అన్ని గురుకులాలు, హాస్టళ్లు, కస్తుర్బాల్లోనూ విద్యార్థుల సంఖ్యను బట్టి వేడినీళ్లను అందించేలా హీటర్లు, గ్రీజర్లు ఏర్పాటు చేయాలి. చలి పెరిగినందున కనీసం గ్యాస్, కట్టెలనైనా అదనంగా సరఫరా చేయాలి.