గల్లగురిగి

”తాత.. వంద రూపాయలు ఇయ్యవా”
”వంద రూపాయలా…ఎందుకు పిల్లగా”
”నాకు గవర్నమెంట్‌ దాంట్లో సీటు వచ్చింది. ఈరోజు హాస్టల్‌ కి పోతున్నా”
”అంతేనా… మీ నానమ్మ దగ్గర ఉన్నాయి. అడిగి తీసుకోపో” అని అన్నాడు రాజయ్య.
” సరే తాత” అని పరిగెత్తుకుంటూ నానమ్మ దగ్గరకి వెళ్ళాడు చిన్నా.
”నానమ్మ! డబ్బులు”
”ఇస్తాగాని, మంచిగ ఉంటవా అక్కడ లేకపోతే ఏడుస్తవా” అని అనుకుంటూ రెండు వందలు ఇచ్చింది చిన్నా వాళ్ళ నానమ్మ గౌరమ్మ.
”ఒరేరు చిన్నా.. మీ నాన్న వచ్చినడంటే ఒక్క క్షణం కూడా ఆగడు. తొందరగా వెళ్లి స్నానం చేసి, బీరువాలో కొత్త బట్టలు ఉన్నాయి వేసుకోపో” అని గట్టిగా అరుస్తుంది చిన్నా వాళ్ళ అమ్మ కవిత.
స్నానం చేసి వచ్చి, బీరువా తీసిండు చిన్నా. కొత్తబట్టలు వేసుకొని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్నాడు.
”చిన్నా ! రెడీ అయినవా” అని అన్నది కవిత.
”అమ్మా వస్తున్నా” అని బీరువా డోర్‌ పెడుతున్నప్పుడు గల్లగురిగి కనిపించింది చిన్నాకి. అందులో నుంచి డబ్బులు తీద్దాం అని చాలాసేపు ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా రాకపోయేసరికి పక్కన పెట్టేస్తాడు. కనీసం బీరువాలో ఏమైనా డబ్బులు దొరుకుతాయేమో అని బట్టల కింద వెతికాడు. అప్పుడే వాళ్ళ అమ్మ చీర కింద ఒక గొలుసు దొరికింది చిన్నాకి. ఆ గొలుసు తీసుకొని ఆ గల్లగురిగిలో వేసేస్తాడు. ఆ రోజు సరదాగా తను చేసిన చిన్న పని వల్ల వాళ్ళ కుటుంబం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారో అప్పుడు తెలియదు చిన్నాకి.
అప్పుడే పొలం నుంచి ఇంటికి వచ్చాడు చిన్నా వాళ్ళ నాన్న శ్రీను.
”ఒరేరు అన్నీ సర్దుకున్నావా..వెళ్దామా” అడిగాడు.
”అన్ని బ్యాగులల్ల పెట్టిన, ఇగ అందరం తిని బయలుదేరుదాం” అంది కవిత.
చిన్నా, శ్రీను, కవిత ముగ్గురు కలిసి హాస్టల్‌ దగ్గరకి బయలుదేరారు. చిన్నాని హాస్టల్‌ లో చేర్పించి, కొద్దిసేపు అక్కడే ఉండి, మా వాడిని కొంచెం చూసుకోండి అని వార్డెన్‌ కి చెప్పి బయటకి వచ్చారు. అప్పటివరకు మంచిగానే ఉన్న చిన్నా మెల్లగా ఏడవటం మొదలుపెట్టాడు. అది చూసి వాళ్ళ అమ్మ కూడా ఏడ్చింది.
”హే.. నువ్వు ఏడుస్తే మళ్ళీ వాడు భయపడుతాడు. రా పోదాం దా బండి ఎక్కు” అన్నాడు శ్రీను. లోపల కొంచెం బాధ ఉన్నా ఎక్కువసేపు అక్కడ ఉంటే మళ్ళీ ఇంటికి వస్తా అని అంటాడేమో అని శ్రీనుకి భయం. మొత్తానికి చిన్నాని హాస్టల్‌లో ఉంచి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు ఇద్దరు.
రాత్రి అందరు కూర్చొని భోజనం చేస్తున్నారు. వాడు తిన్నాడో లేదో, ఎట్లా ఉన్నాడో, ఎవరైనా దోస్తులు అయ్యుంటరా, రేపు ఒకసారి వెళ్లి చూసి వద్దామా అని మాట్లాడుకుంటూ తింటున్నారు.
అప్పుడే ఒక ఫోన్‌ వచ్చింది శ్రీనుకి. తనకు ముప్పైవేలు అప్పు ఇచ్చిన నాగేంద్ర దగ్గర నుంచి. నెల నెల వడ్డీ సరిగ్గానే కడుతున్నాడు. కానీ ఈ నెల మొత్తం ఇస్తా అని మాట ఇచ్చిండు. కొంచెం భయంతోనే ఫోన్‌ ఎత్తిండు శ్రీను.
”అన్నా.. నమస్తే”
”హా.. నమస్తే! ఏమైంది ఈరోజు ఇంటికి వచ్చేసరికే ఎక్కడికో వెళ్లినవుగా”
” మా వాడిని హాస్టల్‌ లో జాయిన్‌ చేయడానికి వెళ్లినా అన్న”
”అవునా.. సరే రేపు పొద్దునట్టు ఇంటికి వస్తా. డబ్బులు ఇచ్చేరు మరి.
”అన్నా.. ఇంకో నాలుగు రోజులు ఆగరాదే” అని అన్నాడు శ్రీను.
”ఏంది తమాషాలా.. ఇప్పటికే చాలారోజులు ఆగిన. ఇగ నాకు ఏమి చెప్పకు. రేపు అయితే నా పైసలు నాకు కావాలి” అని ఫోన్‌ పెట్టేసిండు నాగేంద్ర.
”ఏమైందయ్యా” అని అడిగింది కవిత. నాగేంద్రన్న రేపు పొద్దునకల్లా డబ్బులు కావాలి అంటున్నాడు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఏమి చేయాలో అర్ధమవుతలేదు అని అనుకుంటూ చేయి కడిగేసుకున్నాడు శ్రీను.
”మరి బయట ఎక్కడైనా అడగరాదు” అంది కవిత.
”ఈ అప్పు తీర్చడం కోసం ఇంకో అప్పు చేయాలానే. అయినా ఇప్పుడు ఎవరిని అడిగినా పంట అమ్మిన తరువాత ఇస్తా అంటారు”
”అయితే నా గొలుసు తాకట్టు పెట్టరాదు. డబ్బులు వచ్చిన తరువాత విడిపించుకుందాం”
”తాకట్టు ఎందుకే ఏమి వద్దులే. నేనే ఎక్కడైనా ప్రయత్నిస్తా” అన్నాడు శ్రీను.
”ఇప్పుడు మళ్ళీ వేరే ఎవరిని అడుగుతావు గాని రేపు పొద్దున గొలుసు తాకట్టు పెట్టి డబ్బులు తెద్దాం. ఇప్పుడు అయితే నువ్వు ప్రశాంతంగా పడుకో” అని అన్నది కవిత.
”కవిత! వెళ్లి గొలుసు తీసుకొని రా…” అన్నాడు శ్రీను.
”సరే తీసుకువస్తా” అని బీరువా దగ్గరకి వెళ్ళింది కవిత. బీరువా తీసి బట్టల కింద చెయ్యి పెట్టి చూసింది. కానీ గొలుసు కనిపించలేదు. కొద్దిగా కంగారు మొదలయ్యింది. వెంటనే బట్టలు మొత్తం తీసి చూసింది. గొలుసు కనిపించలేదు.
”ఏమైందే ఇంకా ఎంతసేపు”
”ఏమయ్యా.. గొలుసు కనిపిస్తలేదు”
”గొలుసు కనిపిస్తలేదా! మొత్తం వెతికినవా అసలు” అని బీరువా దగ్గరకి వెళ్లి మళ్ళీ మొత్తం వెతికాడు శ్రీను.
”ఎక్కడ పెట్టినవే నువ్వు”
”మొన్న పండగకి వెళ్లి వచ్చిన తరువాత ఆ కొత్త చీర కిందనే పెట్టిన”
”బంగారు గొలుసు ఎవరైనా బట్టల కింద పెడుతారే. లోపల డబ్బులు దాచే దాంట్లో పెడుతారు గానీ”
వీళ్లిద్దరు మాట్లాడుకుంటుండగానే నాగేంద్ర వచ్చిండు.
”శ్రీను ఉన్నవా”
”హా! అన్నా వస్తున్నా” అని బయటకి వచ్చిండు శ్రీను.
”అన్నా లోపలికి రా.. బయటనే నిలబడ్డవేంది” అని నాగేంద్రని లోపలికి తీసుకొని వెళ్లిండు.
”నాకు పని ఉంది. తొందరగా డబ్బులు ఇస్తే పోతా”
”అన్నా.. ఇంకో పదిరోజులు ఆగరాదు” అని అన్నాడు శ్రీను.
”పదిరోజులా.. ఏంది పిచ్చెక్కిందా. నేను నిన్ననే చెప్పిన. నాకు రేపు కచ్చితంగా డబ్బులు కావాలని”
”నిజమే అన్నా.. గొలుసు తాకట్టు పెట్టి డబ్బులు ఇద్దాం అనుకున్నా. కానీ ఆ గొలుసు కనిపిస్తలేదు. బీరువా మొత్తం వెతికినం ఎక్కడ పోయిందో తెలుస్తలేదు”
”గొలుసు పోయిందా. ఏంది నా డబ్బులు నాకు ఇవ్వమంటే గొలుసు పోయింది అని కథలు పడుతున్నావ్‌”
”నిజంగా అన్నా.. రెండు తులాల గొలుసు. ఇప్పుడు ఏమి చేయాలో అర్ధమవుతలేదు”
”ఎన్ని తులాలయితే నాకు ఏంది. ముందు నా డబ్బులు ఇచ్చి తరువాత ఆ సంగతి చూసుకో”
”అన్నా.. ఒక్క నాలుగు రోజులు ఆగు. మా తమ్ముడిని అడిగి ఇస్తా” అని అన్నది కవిత.
”సరే.. నాలుగు రోజుల తరువాత వస్తా. మళ్ళీ ఏ ముచ్చట నాకు చెప్పొద్దు” అని వెళ్ళిపోయిండు నాగేంద్ర.
చిన్నగా గొలుసు పోయిన విషయం ఊరు మొత్తం తెలిసింది. కొంతమంది పాపం ఎవడు తీసిండో అని మాట్లాడుకుంటుంటే, మరికొంతమంది ఇంట్లో వాళ్లే ఎవరో తీసుంటరు అని అనుకున్నారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకున్నారు. అందరు ఇలా మాట్లాడుకుంటున్నారు అని తెలిసి శ్రీను కుటుంబం అసలు బయటకి వెళ్లడమే తగ్గించేసారు. నలుగురోజులు అయిపోవస్తుంది. నాగేంద్ర ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన ఎత్తట్లేడు శ్రీను.
”నిజంగా నువ్వు బీరువాలోనే పెట్టినవానే” అని అడిగిండు శ్రీను.
”అంటే నేను అబద్ధం చెబుతున్నా అనుకుంటున్నావా. లేకపోతే ఊరిలో వాళ్ళు అంటున్నారని నువ్వు కూడా అంటున్నావా”
”అలా కాదే. ఇంకా ఎక్కడైనా పెట్టి మర్చిపోయినవా అంటున్నా. అవును మన చిన్నగాడు ఏమైనా తీసుంటడా”
”వాడి సామాన్లు మొత్తం నేనే సదిరినా వాడేమి తీయలేదు”
”మరి ఇంక ఎట్లా పోయిందే” అన్నాడు శ్రీను.
”ఏమో నేనైతే బీరువాలోనే పెట్టినా. మరి ఎవరికి ఏమి అవసరముందో, ఎవరు తీసినరో ఏమో?”
”అంటే ఏందే మేము తీసినం అంటున్నావా?”
”నేను అట్లా అన్నానా. మనం ఇద్దరం పనికి పోతం. పొద్దునుంచి ఇంట్లో ఉండేది మీ అమ్మానాన్న. వాళ్ళకి తెలియకుండా ఎవరు తీస్తారు”
” మా ఇంట్లో మేము దొంగతనం చేస్తామా. మాకు ఏమి అవసరం” అన్నాడు రాజయ్య.
”ఏమో మీకు ఏమి అవసరం ఉందో నాకు ఏమి తెలుసు” అన్నది కవిత.
”అమ్మా! మాకు అంత అవసరం ఉంటే పింఛన్‌ డబ్బులు ఉన్నాయి. లేకపోతే మా కొడుకుని అడుగుతాం కానీ ఈ దొంగ పని మేము ఎందుకు చేస్తాం?” అని అన్నది గౌరమ్మ.
”అయినా మా వయసు అయిపోయిందేమో గానీ మా గుణం ఏమి మారలేదు. అంత కష్టం అనిపిస్తే ఏమన్నా వేసుకొని చస్తాం కానీ ఇలాంటి పని చేయం” అన్నాడు రాజయ్య.
”నాయిన ఏమి మాట్లాడుతున్నావు, నువ్వు ఆగు” అన్నాడు శ్రీను.
వీళ్లు ఇలా గొడవ పడుతుండగానే ”శ్రీను అన్నా సర్పంచ్‌ మిమ్మల్ని అందరిని వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడు” అని చెప్పిండు స్వామి.
సర్పంచ్‌ ఇంటికి వెళ్ళగానే ”నాగేంద్రన్న నేను చెప్పినగా నాలుగు రోజులల్ల ఇస్తా అని” అన్నాడు శ్రీను.
”ఏమి చెప్పినావురా నువ్వు. నాలుగు రోజులల్ల ఇస్తా అని చెప్పి, తరువాత ఫోన్‌ కూడా ఎత్తట్లేవు. అరె నా డబ్బులు నాకు ఇవ్వురా అంటే గొలుసు పోయింది అని నాటకాలు ఆడుతున్నారు”
”అన్నా మంచిగ మాట్లాడు. నిజంగానే గొలుసు పోయింది. లేదంటే ఈ పాటికి ఎప్పుడో ఇచ్చేటోడిని”
అరేరు నా ఇంటికి వచ్చి మళ్ళీ మీరే మాట్లాడుకుంటారు ఏందిరా. శ్రీను ఇప్పుడు నీ ఇంట్లో ఏమి సమస్య అయినా ఉండొచ్చు కానీ అప్పు తీసుకున్నాక తల తాకట్టు పెట్టి అయినా తీర్చాల్సిందే. ఇప్పుడు నువ్వు ఏమంటావు మరి” అన్నాడు సర్పంచ్‌.
”అన్నా ఇంకొక్క పది రోజులు ఆగమను. నా బామ్మరిదిని అడిగిన డబ్బులు. అవి రాగానే ఇస్తా”
”నాగేంద్ర విన్నావుగా. ఒక పదిరోజులు అంట ఆగు. అసలే గొలుసు పోయిన బాధల ఉన్నారు వాళ్ళు”
”హే గొలుసు పోలె ఏమి పోలె అన్నా. వీళ్ళే దాచి మనల్ని పిచోళ్ళని చేస్తున్నారు. వీళ్ళు ఎలాంటోళ్ళో నాకు తెలియదా”
”నాగేంద్రన్న సక్కగ మాట్లాడు. నీ ముప్పైవేల కోసం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు మాకు”
”ఏమో! తాగిన అప్పులు తీర్చడం కోసం మీ అయ్య తీసిండో లేకపోతే తాకట్టు పెట్టడం ఇష్టంలేక నీ భార్యనే దాచిపెట్టి నాటకం ఆడుతుందో” అని అన్నాడు నాగేంద్ర.
ఆ మాట అనగానే అందరు కలిసి నాగేంద్ర మీదికి పోయిండ్రు. ఆ గొడవలో శ్రీను నాగేంద్రని కిందకి నెట్టేస్తాడు. నాగేంద్ర తలకి దెబ్బ తాకింది. ”ఒరేరు మీ పని ఇక్కడ కాదు పంచాయతీలనే చేసుకుంటా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
”అరె శ్రీనుగా ఎంత పని చేసినావురా. ఇక్కడే నిమ్మళంగా అయిపోగొడదాం అనుకుంటే పంచాయతీ దాకా తీసుకొని పోయినరు ఏందిరా. సరే రేపు పంచాయతీల మాట్లాడుదాం పో” అని లోపలికి వెళ్ళిపోయాడు సర్పంచ్‌.
శ్రీను కుటుంబం తిరిగి ఇంటికి వచ్చేసింది. ”మన తరుపున ఎవరినైనా తీసుకువెళ్ళాలి అన్నా. కనీసం ఓ మూడు వేయిలైనా చేతిలో లేకపోతే ఎట్లా. ఈ టైంలో ఎవరినైనా అడుగుదామన్నా ఎట్లనో అనిపిస్తుంది” అంది కవిత.
”నా దగ్గర పదిహేను వందలు ఉన్నాయి తీసుకో అమ్మ” ఇచ్చాడు రాజయ్య.
అలా అందరి దగ్గర ఉన్న డబ్బులు పోగేసి మూడు వేలు అయితే చేసిండ్రు. అప్పటివరకు వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నా ఈ విషయంలో మాత్రం అందరు ఒక్కటై నిలబడ్డారు. పంచాయతీ విషయం తెలుసుకున్న శ్రీను వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వచ్చిండు.
”పెద్దనాన్న నేనే ఫోన్‌ చేద్దామనుకుంటున్న” అన్నాడు శ్రీను.
”అదే రేపు పంచాయతీ ఉందంటగారా నాగేంద్రది. వాడితోటి ఎందుకు పెట్టుకున్నావురా”
”నేనేం అన్ననే. వాడే తప్పుగా మాట్లాడిండు” అని అన్నాడు శ్రీను. ఇద్దరు కలిసి వాళ్ళ దగ్గరి వాళ్లందరికీ ఫోన్‌ చేసి మాట్లాడిండ్రు రేపు రమ్మని. అప్పుడే చిన్నా హాస్టల్‌ దగ్గర నుంచి ఫోన్‌ వస్తుంది. సెలవలు ఉన్నాయి తీసుకువెళ్ళమని.
పంచాయతీ ఉందని చిన్నాని తీసుకురావడానికి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకుని పంపించి, అందరు కలిసి పంచాయతీ ఆఫీస్‌ దగ్గరకి వెళ్తారు.
”ఏమి శ్రీను అప్పు కట్టమన్నందుకు కోడతవా. ఊరిలో ఎవరు అడగరనుకుంటున్నావా ఏంది?”
”లేదు బాపు. అప్పు కట్టమంటే కథలు పడుతున్నారు. మీ అయ్య తీసిండో లేకపోతే మీ పెళ్ళాం తీసిందో గొలుసు అని తప్పుగా మాట్లాడిండు”
”ఏంది నాగేంద్ర? ఎంత అప్పు ఇస్తే మాత్రం ఇంట్లోల్ల గురించి తప్పుగా మాట్లాడుతావా?”
”డబ్బులు ఇస్తా అని చెప్పి రాత్రికి రాత్రి నా గొలుసు పోయింది అని మాట్లాడుతుంటే ఏమనాలే మరి”
”ఇంతకీ ఆ గొలుసు ఏమైంది కవిత” అడిగినరు పెద్దమనుషులు.
”మొన్న బుధవారం రోజు పండగకి వెళ్లి వచ్చి బీరువాలనే పెట్టిన. శనివారం రోజు పొద్దున తాకట్టు పెడదామని చూస్తే కనిపించలేదు” అన్నది కవిత.
”మరి మీరు కాకుండా ఇంకా ఎవరైనా వచ్చినరా మీ ఇంటికి” అడిగారు పెద్దమనుషులు.
”లేదు. ఎవరు రాలేదు”
”మీరు తీయకపోతిరి. బయటి వాళ్ళు ఎవరూ రాలేదు అంటిరి. మరి ఎక్కడికి పోయింది అది. అయినా డబ్బులు తీసుకుంది గాక మా అన్న మీద చెయ్యి వేస్తారా. ఈ రోజు ఒక్కడిని కూడా విడిచిపెట్టేదే లేదు” అన్నారు నాగేంద్ర మనుషులు.
”ఏమి మాట్లాడుతున్నారు పంచాయతీకి వచ్చి. అయితే మీరు మీరు చూసుకునేది అయితే మేము ఎందుకు మరి” అన్నారు అక్కడ ఉన్న పెద్దమనుషులు.
అప్పుడే చిన్నాని హాస్టల్‌ నుంచి తీసుకొని వచ్చాడు వాళ్ళ బాబారు.
”బాబారు అక్కడ ఏంది అంతమంది ఉన్నారు?”
”మీ ఇంట్లో గొలుసు పోయిందంటరా. అందుకే అమ్మానాన్న పంచాయతీకి వచ్చిండ్రు”
”గొలుసా! అది ఎక్కడ ఉందో నాకు తెలుసు బాబారు” అని బండి దిగి ఇంటి వైపు పరుగెత్తుతాడు చిన్నా.
”సరే నాగేంద్ర నువ్వు మాటలు అనుడు తప్పే, శ్రీనుగాడు నీ మీద చెయ్యి వేయడం తప్పే. ఇద్దరిది తప్పే ఉంది. ఇప్పుడు ఏమి చేయమంటావు చెప్పు నాగేంద్ర”
”నేను అనేది ఏముంది. మీరు ఎట్ల చెప్తే అట్లనే చేస్తా” అన్నాడు నాగేంద్ర.
”నువ్వేమంటావ్‌ శ్రీను. ఇగ నీ ఇంట్లో ఏమి జరిగింది అనేది మాకు సంబంధం లేదు. పది రోజులు టైం ఇస్తున్నా. ఈ లోపు డబ్బులు మొత్తం కట్టు. మరి పోయింది బంగారం కాబట్టి స్టేషన్‌కి పోయి కంప్లైంట్‌ ఇవ్వు” అని పెద్దమనుషులు చెబుతుండగానే గల్లగురిగి తీసుకొని వచ్చిండు చిన్నా.
”చిన్నా ఏంది గల్లగురిగి తీసుకొని వచ్చినావు?” అంది కవిత.
”అమ్మ నీ గొలుసు ఇందులోనే ఉంది. నేనే హాస్టల్‌ కి పోతన్నప్పుడు ఇందులో వేసినా” అన్నాడు చిన్నా.
అంతే ఆ మాట వినగానే అందరు సైలెంట్‌ అయిపోయారు. అందరి చూపు మొత్తం గల్లగురిగి మీదనే ఉంది. చిన్నా చేతిలో నుంచి గల్లగురిగి తీసుకొని కింద పగలగొట్టింది కవిత. అందులో నుంచి డబ్బులతో పాటు గొలుసు కూడా బయటపడింది.
శ్రీను కుటుంబానికి ఒక్కసారిగా గుండెల మీద బరువు మొత్తం దిగినట్టు అనిపించింది. గొలుసు చూడగానే చిన్నాని కవిత కొట్టబోతుంటే..
”ఆగమ్మా కవిత. చిన్నపిల్లగానికి ఏమి తెలుసు. ఒరేరు పిల్లగా ఎంత పని చేసినావురా, ఎవరి జోలికి పోకుండా నిమ్మళంగా ఉండేటోళ్ళని ఉత్త పుణ్యానికి పంచాయతీల పడేసినవుగారా?” అన్నారు అక్కడ ఉన్న పెద్ద మనుషులు నవ్వుకుంటూ. అక్కడే ఉన్న మిగతావాళ్లు కూడా చిన్నా చేసిన పనికి తెగ నవ్వుకున్నారు.
ఇలా తను తెలియక చేసిన ఒక పని వల్ల చిన్నా వాళ్ళ ఊరిలోనే కాకుండా చుట్టు పక్కల ఊర్లలో కూడా బాగా ఫేమస్‌ అయ్యిండు. తనని చూసి నవ్వుకున్నోళ్ళే వాళ్ళ కుటుంబాన్ని చూసి పాపం అనుకున్నారు. మొత్తానికి ఆ గొలుసుని తాకట్టు పెట్టి నాగేంద్ర అప్పు తీర్చిండు శ్రీను. ఇగ సెలవలు అయిపోవడంతో చిన్నాని హాస్టల్‌కి పంపించి ఎప్పటిలాగే మళ్ళీ వాళ్ళ సాధారణమైన జీవనాన్ని కొనసాగించారు.
– రమేష్‌ మాండ్ర, 8555929026

Spread the love