పొదుపు సొమ్ముతో జూదం

Gambling with savings– స్టాక్‌ మార్కెట్‌లో పేదల పైసలు
– జల్సాల కోసం మితిమీరిన ఖర్చులు…తప్పని అప్పుల తిప్పలు
– లోన్‌ యాప్‌లు, వడ్డీ వ్యాపారుల వలలో ప్రజలు
– పడిపోతున్న ప్రయివేటు పెట్టుబడులు, ఎఫ్‌డీఐలు
– భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు
తమ అవసరాల కోసం భారత రిజర్వ్‌బ్యాంక్‌ ( ఆర్బీఐ) నుంచి మోడీ ప్రభుత్వం డివిడెండ్ల రూపంలో వేలకోట్లు తరలించుకుపోతోంది. దీనికితోడు జనం దాచుకున్న పొదుపు పైసలతో జూదమాడుతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటుకు సంబంధించిన సూక్ష్మ సమాచారాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నెలాఖరుకు విడుదల చేయబోతోంది. జీడీపీ వృద్ధిరేటు 7.5-8 శాతం మధ్య ఉండవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మూడు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
న్యూఢిల్లీ : వ్యక్తిగత ఆదాయ స్థాయి, ప్రయివేటు పెట్టుబడులపై ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతుండగా ఇప్పుడది విదేశీ కంపెనీలు, వాటి పెట్టుబడి నిర్ణయాలకు కూడా వ్యాపించింది. వీటన్నింటినీ పరిశీలిస్తే పరిస్థితి ఆశాజనకంగా ఉన్నట్టు కన్పించడం లేదు. మోడీ ప్రభుత్వం సూక్ష్మ స్థాయిలో విడుదల చేసే సమాచారం తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. 2022 జనవరి-మార్చి త్రైమాసిక కాలం నుండి దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వ పీరియాడిక్‌ లేబర్‌ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) చెబుతోంది. అనేక మందికి ఉద్యోగాలు లభించాయని, వారంతా ఆదాయం పొందుతున్నారని దీని అర్థం. కానీ వాస్తవాలు అలా లేవు.
జనం డబ్బుతో చెలగాటం
ఆర్థిక మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం 2020-21లో భారతీయ కుటుంబాలు రూ.22.8 లక్షల కోట్ల మేర నికర ఆస్తులను సమకూర్చగా 2021-22లో సుమారు రూ.17 లక్షల కోట్లు, 2022-23లో రూ.13.8 లక్షల కోట్లు సమకూర్చాయి. అంటే ప్రజల్లో పొదుపు తగ్గిపోతోందని దీని అర్థం. పేద, మధ్య తరగతి ప్రజలు తాము కూడబెట్టుకున్న కొద్దిపాటి సొమ్మును సైతం స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్న ధోరణి బాగా పెరిగిపోతోంది. పేదలు తమ పొదుపు సొమ్ముతో బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ చేస్తున్నారని దీనిని బట్టి అవగతమవుతోంది. పొదుపు సొమ్ము భద్రంగా ఉండాలని భావించే వారు దానిని బ్యాంకుల్లో దాచుకుంటారు. వడ్డీరేటు ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతుంటాయి. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అంటే జూదంతో సమానమే. సోషల్‌ మీడియా ద్వారా ప్రభావం చూపే సలహాదారుల మాటలు నమ్మి ఎక్కువ ఆదాయాన్ని పొందాలన్న కోరికతో పలువురు స్టాక్‌ మార్కెట్‌లో తమ పొదుపు సొమ్మును మదుపు చేస్తున్నారు. సెబీ అధిపతి హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ చిన్న, మధ్యతరహా షేర్లలో పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తొలిసారి మదుపు చేసే వారు స్టాక్‌ మార్కెట్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. రాత్రికి రాత్రే లాభాలు వస్తాయని, ఆదాయ అవకాశాలు అధికంగా ఉంటాయని మభ్యపెట్టి వీరితో పెట్టుబడి పెట్టిస్తారు. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. నష్టాలు వచ్చినప్పటికీ ఆ ఊబిలో పడిన వారు పదేపదే పెట్టుబడి పెడుతూనే ఉంటారు.
ఇవి కూడా తగ్గుతున్నాయి
ప్రయివేటు రంగం నుండి పెట్టుబడులు లేకపోవడంతో ప్రజల ఆదాయ స్థాయి పడిపోతోంది. ప్రైవేటు పెట్టుబడులే కాదు…విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయం. విదేశీ పెట్టుబడిదారులు ఇప్పుడు ఇతర దేశాలను ఎంచుకుంటున్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి లభించకపోవడం, కార్మికుల లభ్యత తగినంత లేకపోవడం దీనికి కారణం. జూన్‌లో కేంద్రంలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వం ఈ అంశాలపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
మనుగడ కోసం అప్పులు
సురక్షితం కాని రుణాలపై కొరడా ఝుళిపించేందుకు రిజర్వ్‌బ్యాంక్‌ అనేక ఆంక్షలు విధిస్తోంది. హెచ్చరికలు జారీ చేస్తోంది. అయినప్పటికీ ఆ తరహా రుణాలు పెరుగుతూనే ఉన్నాయి. పోనీ నివాస గృహాలు, కార్లు, గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు ఈ రుణాలు తీసుకుంటున్నారా అంటే అదీ కాదు. విద్యాభ్యాసం కోసం తీసుకుంటున్న రుణాలు కూడా కావు. అవి… క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి కదా అనే భరోసాతో విచ్చలవిడిగా చేస్తున్న ఖర్చులు. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోవడంతో దిక్కుతోచక తీసుకుంటున్న రుణాలు. వీటిని ఆర్‌బీఐ ‘ఇతర వ్యక్తిగత రుణాలు’గా వర్గీకరించింది. వాస్తవానికి అవి మనుగడ కోసం తీసుకున్న అప్పులు. ఇవన్నీ బ్యాంకులు, బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక కంపెనీల నుంచి తీసుకున్న రుణాలు. రుణ యాప్‌ల ద్వారా, నియంత్రణ లేని వడ్డీ వ్యాపారుల నుండి కూడా రుణాలు తీసుకుంటున్నారు. ఈ తరహా రుణాలు తీసుకుంటే కొద్దిపాటి అప్పుకే అధిక వడ్డీ వసూలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి రుణాలు ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం కలిగిస్తాయని ఆర్‌బీఐ హెచ్చరిస్తోంది.

Spread the love