గణేష్‌ నిమజ్జనం.. అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు

Ganesh immersion.. Metro services till late night– రెండు రోజుల పాటు ప్రత్యేక సర్వీసులు
– వినాయక ఉత్సవాలతో ప్రతిరోజూ మెట్రోలో 5లక్షల మంది ప్రయాణం
– నిమజ్జనం ముగిసేవరకు అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడుపుతాం : మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌లో వినాయక ఉత్సవాలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో మెట్రో రైల్‌లో ప్రయాణించిన వారి సంఖ్య రికార్డుస్థాయిలో నమోదవుతోంది. ప్రతిరోజూ ప్రయాణీకుల సంఖ్య సుమారు ఐదు లక్షల మార్కును దాటుతోంది. ఖైరతాబాద్‌ గణేష్‌ సందర్శకులతో ఈ రద్దీ మరింత పెరిగింది. ఒక్క శనివారమే ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌లో మొత్తం 94వేల ఫుట్‌ఫాల్‌ నమోదు కాగా, ఈ స్టేషన్‌ల్లో 39వేల మంది మెట్రో రైలు ఎక్కగా.. 55వేల మంది రైలు దిగారని మెట్రో అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనంతో పాటు గణేష్‌ శోభాయాత్ర నేపథ్యంలో గ్రేటర్‌ ప్రజలు హుస్సేన్‌ సాగర్‌కు భారీగా తరలిరానున్న నేపథ్యంలో మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోనున్నాయి. దాంతో మంగళవారం నుంచి రెండు రోజుల పాటు అర్ధరాత్రి వరకు ప్రత్యేక రైళ్లు నడపాలని హైదరాబాద్‌ మెట్రో నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి.. ఎల్‌అండ్‌టీ మెట్రో సీఎండీ కేవీబీ రెడ్డితో పాటు ఇతర సీనియర్‌ అధికారులతో సమావేశమై ప్రత్యేక ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. నాగోల్‌-రాయదుర్గం, ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ స్టేషన్‌ కారిడార్లలో సర్వీసులు అందుబాటులో ఉంటాయని, ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రోకు చెందిన మూడు కారిడార్లలోని అన్ని చివరిస్టేషన్ల నుంచి మెట్రో రైళ్లు బయలుదేరి.. అర్ధరాత్రి 2:00 గంటలకు అంటే బుధవారం తెల్లవారుజామున చివరి స్టేషన్‌కు చేరుకోనున్నట్టు ఆయన వివరించారు. ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రయివేట్‌ సెక్యూరిటీ సిబ్బందిని మొహరించామని, డిమాండ్‌ను బట్టి కొన్ని మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్‌ కౌంటర్లు, అదనపు రైళ్లు నడపనున్నట్టు తెలిపారు. 18న ఉదయం 6 గంటలకు యథాత థంగా మెట్రో రైల్‌ కార్యకలాపాలు కొనసా గుతాయని పేర్కొన్నారు. ప్రయాణికులు తమ భద్రతతో పాటు సురక్షితమైన ప్రయాణం కోసం మెట్రో రైలు భద్రతా సిబ్బంది, ఇతర సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులను విజ్ఞప్తి చేశారు.

Spread the love