– ప్రభుత్వ బ్యాంకులే లక్ష్యంగా మోసాలు
– కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఆఫీస్‌లు
– సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
నవతెలంగాణ-మియాపూర్
నకిలీ డాక్యుమెంట్స్, ప్రభుత్వ ఆఫీసర్ల స్టాంప్స్, ఇతర గ్రామపంచాయతీ లే అవుట్ కాపీలు తయారీ చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆరుగురిని అరెస్టు చేసి, వీరి నుంచి పెద్ద మొత్తంలో డాక్యుమెంట్స్, స్టాంప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పరిధిలో ఆరుగురు ఒక ముఠాగా ఏర్పడి ప్రభుత్వ అధికారుల స్టాంపులను, నకిలీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్నారు. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ ఇంటి పర్మిషన్, ట్రేడ్ లైసెన్స్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని విభాగాలకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్స్, గ్రామపంచాయతీ లే అవుట్ కాపీలు, హెచ్‌ఎండీఏ నాలా కన్వర్షన్ సర్టిఫికెట్లు, బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లతో పాటు నకిలీ హౌస్ హౌల్డర్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నారు. వీటి ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ జాతీయ బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్నారు. హౌసింగ్ లోన్ తీసుకునే సమయంలో అధికారులు వెరిఫికేషన్‌ను నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని సీపీ వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు నిర్లక్ష్యంగా జరిగాయా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగాయా? వీటి వెనుక ఎవరు ఉన్నారనే ఆంశంపై దర్యాప్తు వేగవంతం చేసి, త్వరలోనే వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. నిందితుల నుంచి 687 నకిలీ రబ్బర్ స్టాంపులు, వివిధ డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన ఫేక్ సర్టిఫికెట్స్, 1180 డాక్యుమెంట్లు, 10 లాప్‌టాప్స్ సీపీయూలు, 8 మానిటర్స్, 2 ప్రింటర్స్, స్టాంప్ తయారు చేసే ఒక మిషన్, 57 మొబైల్ ఫోన్స్, టూవీలర్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 10 కోట్ల వరకు ఉంటుందని సీపీ వివరించారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.