– లోక్‌సభలో ప్రధాని, కేంద్రవిద్యాశాఖమంత్రులకు ప్రతిపక్షాల నిరసన సెగ
– వెలుపల రాజ్యాంగ ప్రతులతో ఆందోళన
18వ లోక్‌సభ సమావేశాలు తొలిరోజు నుంచే వేడెక్కాయి. ఇప్పటివరకు బీజేపీ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా ఉండేది. కానీ ఈసారి బీజేపీ సొంత మెజారిటీ కోల్పోయి, పదేండ్ల తర్వాత సంకీర్ణ సర్కార్ కొలువయ్యాక.. సోమవారం లోక్‌సభలో ఇండియా ఫోరం ఎంపీలు జోరు పెంచారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో మోడీ ప్రభుత్వం చెలగాటమాడుతున్న నీట్, నెట్, ఇతర పోటీ పరీక్షల నిర్వహణలో విఫలమైన తీరును ఎండగట్టారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నిరసనలు తెలిపారు. నీట్ అంశాన్ని బీజేపీ సర్కార్‌పై ప్రతిపక్షాలు ఆయుధంగా ఎక్కుపెట్టాయి.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం లోక్‌సభలో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మెహతాబ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. మెహతాబ్ తొలుత ప్రధాని మోడీతో ప్రమాణ స్వీకారం చేయించగా, తరువాత ప్రొటెం స్పీకర్ల ప్యానెల్ సభ్యులు రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తేతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత అక్షర క్రమంలో రాష్ట్రాలకు చెందిన సభ్యులతో ప్రమాణ స్వీకారం కొనసాగింది. సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయగా, మంగళవారం తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజరు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడో సారి అధికారం చేపట్టిన తరువాత సోమవారం ప్రారంభమైన తొలి పార్లమెంటు సమావేశాల్లోనే నీట్ నిర్వహణలో బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష ఇండియా ఫోరం నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. రాజ్యాంగ ప్రతులను చేతిలో పట్టుకుని, రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నేతలు నినాదాలు హోరెత్తించారు. బీజేపీ రాజ్యాంగాన్ని అవమానిస్తోందని విమర్శించారు.
ఆందోళనలో సోనియా, ప్రతిపక్ష ఎంపీలు
ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, వివిధ పార్టీల నేతలు, ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం వాయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ఆమోదించారు.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ప్రతిపక్ష పోటీ
లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు పోటీ చేస్తామని ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమ్చందన్ పేర్కొన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై ప్రతిపక్షాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునేందుకు ముందుకొస్తే తాము పోటీపై పునరాలోచిస్తామని చెప్పారు. ప్రభుత్వం మొండివైఖరితో వెళితే తాము తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీపై ప్రధాని మోడీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గత పదేండ్లలో మోడీ పాలనలో రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్ధలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాజ్యాంగ మార్పుకు కాషాయ పాలకులు గట్టి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ మార్పులను ప్రతిపక్షం ఐక్యంగా ఎదుర్కొని నిలువరిస్తుందని అన్నారు. రాజ్యాం గాన్ని కాపాడుకు నేందుకు తాము కలిసికట్టుగా పోరాడ తామని స్పష్టం చేశారు . దేశ లౌకిక ప్రజా స్వామ్య స్ఫూర్తిని రక్షించా ల్సిన అవసరం ఉందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలు, సిద్ధాం తాలను పరిరక్షించుకోవాలని అన్నారు.
రాజ్యసభనేతగా జేపీ నడ్డా
రాజ్యసభ సభ పక్ష నేతగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఆ పార్టీ ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో ముంబయి నార్త్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన పియూశ్ గోయల్ స్థానంలో ఆయనను నియమించింది. గోయల్ 2010 జులై 5న రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2021 జులై 14న ఆయనను రాజ్యసభ సభా నాయకుడిగా ప్రకటించారు. జూన్ 4న లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన స్థానంలో జేపీ నడ్డా నియమించారు. జేపీ నడ్డా తొలిసారిగా 2012 ఏప్రిల్ 3న రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోమవారం ఆయనను సభపక్ష నేతగా నియమిస్తూ పార్టీ నిర్ణయించింది.
15 రోజుల అరాచకాలు.. : రాహుల్ గాంధీ
మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారం చేపట్టిన 15 రోజులపాటు అరాచక పాలన కొనసాగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.ఈ15 రోజుల్లో ప్రజలు ఎదుర్కొన్న పది సమస్యలపై ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రజా సమస్యల్ని పక్కకు పెట్టి.. ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో మోడీ బిజీగా ఉన్నారని ఆరోపించారు.ఎక్స్‌లో ఆయన సుదీర్ఘ పోస్ట్ చేశారు. అందులో పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదం నుంచి కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నీట్ నిరసన మధ్యే ప్రమాణం
ప్రధాని మోడీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లకు నిరసన సెగ తగిలింది. సోమవారం లోక్‌సభలో ప్రధాని మోడీ ఎంపీగా ప్రమాణ చేసేందుకు సీటులో నుంచి వెళ్తుండగా ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లో లేచి, రాజ్యాంగ ప్రతులను చూపించి నిరసన తెలిపారు. అలాగే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీగా ప్రమాణ చేసేందుకు సీటులో నుంచి వెళ్తుండగా ప్రతిపక్ష ఎంపీలు నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో సభను హౌరెత్తించారు. ‘నీట్.. నీట్.. నీట్..’ అంటూ నినదించారు. ప్రతిపక్షాల నినాదాల మధ్యే ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు.
ఇంకెన్నాళ్లు అదే పాట.. ప్రధానికి స్ట్రాంగ్ కౌంటర్
ఎమర్జెన్సీపై పార్లమెంటులో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంకెన్నాళ్లు అదే పాత పాట పాడుతారంటూ చురకలంటించారు. ఇప్పటికే ఆయన ఈ మాట వందసార్లు చెప్పి ఉంటారని.. ఇంకెన్నాళ్లు అలాంటి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ అధికారంలో కొనసాగుతారు. నీట్ ఆందోళనలపై గానీ, వెస్ట్ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంపై గానీ, మణిపూర్ అల్లర్లపై గానీ మోడీ స్పందిస్తారని చూస్తుంటే.. ఆ విషయాలపై ఆయన మౌనం పాటిస్తూ వస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్యంపై ఎమర్జెన్సీ మచ్చ : ప్రధాని మోడీ
సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ దేశానికి మూడోసారి సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు రేపటితో 50 ఏండ్లు అని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 50 ఏండ్ల కిందట జరిగిన తప్పు మరెవరూ చేయకూడదన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనంలో 18వ లోక్‌సభ సమావేశమవుతుందని చెప్పారు. ‘ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ నిర్వహించాం. 65 కోట్ల మంది ఓటర్లు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మా విధానాలకు, అంకితభావానికి జనామోదం లభించింది. ప్రజలు మాకు వరుసగా మూడోసారి సేవచేసే అవకాశం కల్పించారు. ఇది చాలా పవిత్రమైన రోజు. కొత్త సభ్యులకు స్వాగతం. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి. అందరి సహకారంతో భరతమాత సేవలో పాల్గొంటాం. కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలి. 2047 వికసిత్ భారత్ సంకల్పం, లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతాం. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటాం. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతాం. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కృషి చేస్తాం’ అని మోడీ తెలిపారు. 18వ లోక్‌సభలో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.