గీ సారి దసరా జోర్దారుంటది

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భగవంత్‌ కేసరి’. ఈ సినిమా దసరా సెలవుల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్‌ శనివారం అధికారికంగా ప్రకటించారు.
‘ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది’ అంటూ.. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ ఓ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో బాలకష్ణ నడిచే వాల్కనో లా ఉన్నారు. రెండు చేతుల్లో రెండు గన్స్‌తో ఫెరోషియస్‌గా నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపించారు. యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో హై యాక్షన్‌ ఉంటుంది. అనిల్‌ రావిపూడి మార్క్‌ మంచి వినోదం, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
‘బాలకృష్ణ, అనిల్‌రావిపూడి కాంబినేషన్‌లో సినిమా కావడంతో ఈ సినిమాపై సహజంగానే అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమా అటు ప్రేక్షకులు, ఇటు బాలయ్య అభిమానులను కచ్చితంగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. అనిల్‌రావిపూడి తన దైన మార్క్‌ వినోదం, యాక్షన్‌తో బాలయ్యను సరికొత్తగా సిల్వర్‌స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అన్ని కమర్షియల్‌ హంగులు ఉన్న చిత్రమిది’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్‌ పెద్ది, సంగీతం: ఎస్‌ తమన్‌, డీవోపీ: సి.రామ్‌ ప్రసాద్‌, ఎడిటర్‌: తమ్మి రాజు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవ్‌, ఫైట్స్‌: వి.వెంకట్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.కష్ణ.

Spread the love