న్యూఢిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత్రి గీతా మెహతా శనివారం కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఆమె ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 80 సంవత్సరాలు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నారు. ఆమె భర్త, ప్రముఖ పబ్లిషర్ సోని మెహతా 2019లోనే మరణించారు.ప్రముఖ రచయిత్రి, లఘుచిత్ర నిర్మాత, జర్నలిస్టుగా గీతా మెహతా సుపరిచితురాలు. 1943లో బిజూ పట్నాయక్, జ్ఞాన్ పట్నాయక్ దంపతులకు ఆమె జన్మించారు. ఆమె తండ్రి దివంగత బిజూ పట్నాయక్ ఒడిశాకు ముఖ్యమంత్రిగా చేసిన విషయం తెలిసిందే. ఆమె ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు, ప్రేమ్ పట్నాయక్‌కు సొంత అక్క.ఆమె ‘కర్మా కోలా’, ‘స్నేక్ అండ్ ల్యాడర్స్’, ‘ఏ రివర్ సూత్ర’, ‘రాజ్’, ‘ది ఎటర్నల్ గణేష’ పుస్తకాలను రాశారు. ఆమె తన సోదరుడు నవీన్ పట్నాయక్ అంటే ఆమెకు అమితమైన ప్రేమ. ఇటీవల భువనేశ్వర్‌ను సందర్శించినప్పుడు మాట్లాడుతూ..”నవీన్ పట్నాయక్ వంటి సీఎం లభించడం ఒడిశా ప్రజల అదృష్టం” అని వ్యాఖ్యానించారు. గీతా మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గీతా కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేశారు