గాజాలో నరమేధం

Genocide in Gaza– ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా అమెరికా ఏకపక్ష వైఖరి !
జెరూసలేం, వాషింగ్టన్‌ : ఇజ్రాయిల్‌ వైమానిక దాడులతో పాలస్తీనాలో నరమేధం కొనసాగుతుంది. మరో వైపు పశ్చిమాసియాలో ప్రస్తుతమున్న పరిస్థితులను మరింత రెచ్చగొట్టేలా అమెరికా ఏకపక్ష వైఖరి అవలంబిస్తోంది. తన చర్యలతో పరిస్థితులు దిగజారతాయని ఆందోళ నలు పెరుగుతున్నా వాటిని లక్ష్యపెట్టకుండా రెండో విమాన వాహక నౌకను మధ్య ప్రాచ్య ప్రాంతానికి పంపాలని భావిస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. కాగా, ఇజ్రాయిల్‌, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని మరికొన్ని దేశాలు ప్రయత్ని స్తున్నాయి. ఇజ్రాయిల్‌ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించే అమెరికా వైఖరి ఈ ప్రయత్నాలను దెబ్బతీసే ముప్పు పొంచి వుంది. బుధవారానికి ఈ యుద్ధంలో ఇరు పక్షాల వైపు 1900మందికి పైగా మరణించారు. ఇప్పటికే తూర్పు మధ్యధరా సముద్రంలో మకాం వేసిన యుఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌.ఫోర్డ్‌కు జతగా రెండో విమాన వాహక నౌకను పంపాలని అమెరికా యోచిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. గురువారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఇజ్రాయిల్‌లో పర్యటిస్తు న్నారు. అక్కడ ఇజ్రాయిల్‌ సీనియర్‌ నేతలతో చర్చలు జరిపి, తర్వాత జోర్డాన్‌ వెళతారు. అమెరికా ఏకపక్షంగా వ్యవహరించే ఈ విధానంతో గాజాలో ఉద్రికత్తలు చల్లారవని, పైగా ఇంకా హింస పెచ్చరిల్లే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రారంభమైన ‘ఆపరేషన్‌ అజయ్’
మొదటి దఫా భారతీయులతో చార్టర్డ్‌ విమానం
ఇజ్రాయిల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపరేషన్‌ అజయ్ పేరుతో ఈ తరలింపు ప్రక్రియ గురువారం మొదలైంది. ఈ తరలింపు క్రమాన్ని విదేశాంగ మంత్రి జై శంకర్‌ పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశామని, ఇతర ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయన్నారు. ఇజ్రాయిల్‌లో మొత్తంగా 18వేల మంది భారతీయులు వున్నారు. వీరిలో ఐటి ఉద్యోగులు, వజ్రాల వ్యాపారులు, విద్యార్ధులు, కేర్‌ గివర్స్‌గా పనిచేస్తున్నవారు వున్నారు. ‘ముందు వచ్చిన వారిని ముందుగా తీసుకెళ్ళడం’ అనే పద్దతిపై 230మంది భారతీయులను తీసుకుని గురువారం రాత్రి మొదటి విమానం బయలు దేరింది. భారత్‌కు వచ్చే భారతీయులు టిక్కెట్‌ ఫీజు చెల్లించనక్కరలేదు. భారత ప్రభుత్వమే ఆ ఖర్చును భరిస్తుంది. భారతీయుల భద్రత కోసం ఇజ్రాయిల్‌ అన్ని చర్యలు తీసుకుంటుందని ఇజ్రాయిల్‌లో భారత రాయబారి సంజీవ్‌ సింగ్లా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.
యుద్ధ సమయంలో..
నెతన్యాహు జాతీయ ఐక్యతా ప్రభుత్వం  మితవాద ప్రధానిగా బెంజామిన్‌ నెతన్యాహు నేతృత్వంలో యుద్ధ సమయంలో జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించింది. మాజీ రక్షణ మంత్రి, మిలటరీ చీఫ్‌ బెన్నీ గంట్జా, నెతన్యాహుతో కలిసి ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన చేశారు. ఐదుగురు సభ్యులతో’ యుద్ధ పరిస్థితుల నిర్వహణా’ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మంత్రివర్గంలో నెతన్యాహు, గంట్జా, ప్రస్తుత రక్షణ మంత్రి యోవా గాలంట్‌లతో పాటూ మరో ఇద్దరు ఉన్నతాధికారులు పరిశీలక సభ్యులుగా వుంటారు.
పోరాటం కొనసాగుతున్నంత కాలమూ యుద్ధానికి సంబంధించి ఎలాంటి చట్టాలు చేనడం కానీ నిర్ణయాలు తీసుకోవడంగానీ ప్రభుత్వం చేయదని ఆ ప్రకటన పేర్కొంది. కాగా, మితవాద, అతివాద-సాంప్రదాయ పార్టీల మిశ్రమమైన నెతన్యాహ ప్రస్తుత ప్రభుత్వ భాగస్వాముల పరిస్థితి ఏమిటనేది వెంటనే తెలియరాలేదు. ఆస్పత్రుల్లో సరఫరాలు తగ్గిపోతుండడం, మరికొన్ని గంటల్లో విద్యుత్‌ సరఫరాలు నిలిచిపోతాయని భావించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.
గాజాలో 3,38,000మందికి పైగా నిర్వాసితులయ్యారు : యూఎన్‌
ఇప్పటివరకు గాజా ప్రాంతం నుండి 3,38,000మందికి పైగా ప్రజలను వారి ఇళ్ల నుండి బలవంతంగా వెళ్ళగొట్టారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్ళగొట్టబడుతున్నారని ఐక్యరాజ్య సమితి మానవతా సంస్థ ఒసిహెచ్‌ఎ ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారానికి ఈ సంఖ్య కేవలం 75వేలుగా వుండగా, గురువారానికి ఒక్కసారిగా 3,38,934కి పెరిగిందని పేర్కొంది. నిర్వాసితులైన వారిలో దాదాపు 2,20,000మంది ఐక్యరాజ్య సమితి ఆశ్రయ కేంద్రాల్లో తల దాచుకున్నారని తెలిపింది. మరో 15వేల మంది పాలస్తీనా అథారిటీ నిర్వహించే స్కూళ్లకు వెళ్ళారని పేర్కొంది. మరో లక్ష మంది తమ బంధువులు, ఇరుగుపొరుగువారు, చర్చిలు, ఇతర షెల్టర్లలో తలదాచుకున్నారు.

Spread the love