– రూ.78 కోట్లతో 107 జంక్షన్ల అభివృద్ధి
– ఆహ్లాదకర వాతావరణం కోసం సుందరీకరణ పనులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో జంక్షన్ల వద్ద రోడ్డు ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నట్టు జీహె చ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. నగరంలో నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో 40 నుంచి 60 శాతం వరకు జంక్షన్లలోనే జరుగుతున్నట్టు పలు సర్వేల్లో తేలింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జంక్షన్ల సుందరీకరణ, వాహనాలను క్రమబద్ధీకరించడంతోపాటు పాదచారుల ప్రమాదాల నివారణ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. జంక్షన్ల అభివృద్ధి, భద్రత కల్పించడం కోసం చర్యలు తీసుకుంటోంది. రూ.78 కోట్లతో 107 జంక్షన్ల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది.
శివారు ప్రాంతాలపైనా..
జీహెచ్‌ఎంసీకి ఆనుకొని ఉన్న నగరాలు, పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న జంక్షన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా నగరంతోపాటు శివారు ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా జీహెచ్‌ఎంసీ ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేస్తోంది. సర్కిల్ పరిధిలో గల ట్రాఫిక్ జంక్షన్లను గుర్తించి, ప్రమాదాలను అరికట్టేందుకు రూ.7814.94 లక్షల అంచనా వ్యయంతో 107 జంక్షన్ల అభివృద్ధికి చర్యలు చేట్టింది. సిగల్ ఏర్పాటు, పాదచారుల ప్రమదాలు జరగకుండా ఫుట్‌పాత్ నిర్మాణాలతోపాటు వాహనదారులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు సుందరీకరణ పనులు చేపట్టింది. ఇప్పటి వరకు 31 జంక్షన్లు పూర్తి చేయగా, 13 జంక్షన్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 17 జంక్షన్లు మంజూరు కావాల్సి ఉంది. 16 జంక్షన్లలో పనులు ప్రారంభం చేయాల్సి ఉంది. 8 టెండర్‌లు ప్రాసెస్‌లో ఉండగా, మరో 8 భూసేకరణ చేయాల్సి ఉంది. ఇక 14 జంక్షన్‌లు ఫిసిబులిటీలో లేవు. సర్కిల్ వారీగా ప్రాధాన్యత గల జంక్షన్లను గుర్తించి అభివృద్ధి చేస్తున్నారు.