ఇంగ్లీష్‌ టీమ్‌ ఎదుట భారీ టార్గెట్.. సెంచరీతో మెరిసిన గిల్

నతెలంగాణ- విశాఖపట్నం: భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్‌ సేన.. ఇంగ్లీష్‌ టీమ్‌ ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 255 పరుగులకు ఆలౌట్‌ అవడంతో ఇంగ్లండ్‌ ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఛేదనను ఇంగ్లండ్‌ ఎప్పటిలాగే దూకుడుగా మొదలుపెట్టింది. రెండో రోజు 14 ఓవర్లు మాత్రమే ఆడిన ఇంగ్లండ్‌.. 4.79 రన్‌ రేట్‌తో 67 పరుగులు చేసింది. రెండు రోజుల ఆట మిగిలిఉన్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయానికి 332 పరుగులు అవసరం కాగా భారత్‌కు 9 వికెట్లు కావాలి. ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ ఆట ఆడుతుంటంతో ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు కచ్చితంగా ఫలితం తేలే అవకాశం ఉన్న నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదిన యశస్వీ జైస్వాల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులే చేశాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (13) మరోసారి విఫలమయ్యాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (29) అదే బాటపట్టాడు. శుభ్‌మన్‌ గిల్‌ (104) సెంచరీతో ఆదుకున్నాడు. అతడికి తోడుగా అక్షర్‌ పటేల్‌ (45) అండగా నిలవడంతో భారత్‌ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో అశ్విన్‌ (29) రాణించడంతో భారత్‌ ఇంగ్లండ్‌ ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఇంగ్లీష్‌ బౌలర్లలో హర్ట్లీ నాలుగు వికెట్లు తీయగా రిహాన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ ఆది నుంచే దూకుడుగా ఆడుతోంది. ముకేశ్‌ కుమార్‌ వేసిన రెండో ఓవర్లోనే బెన్‌ డకెట్‌ (28) రెండు బౌండరీలు బాదాడు. అతడే వేసిన నాలుగో ఓవర్లోనూ క్రాలే అదే సీన్‌ రిపీట్‌చేశాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన ఆరో ఓవర్లో క్రాలే భారీ సిక్సర్‌ కొట్టాడు. అశ్విన్‌ వేసిన పదో ఓవర్లో డకెట్‌ బౌండరీ కొట్టడంతో ఇంగ్లండ్‌ 50 పరుగులు పూర్తిచేసింది. బౌండరీ కొట్టిన మరుసటి బంతికే డకెట్‌ ఇచ్చిన క్యాచ్‌ను భరత్‌ అద్భుతంగా అందుకోవడంతో ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ ఒక వికెట్‌ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రాలే (29 నాటౌట్), నైట్‌ వాచ్‌మెన్‌ రిహాన్‌ అహ్మద్‌ (9 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.

Spread the love