ఢిల్లీలో బాలిక దారుణహత్య

– యూపీలో నిందితుడి పట్టివేత
– శాంతిభద్రతలపై సీఎం సహా పలువురి ఆగ్రహం
న్యూఢిల్లీ : ఢిల్లీలో 16 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన నిందితుడు సాహిల్‌ను యుపి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ హత్యకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని షహబాద్‌ డైరీ ప్రాంతంలో తన ఇంటి వెలుపల కూర్చున్న బాలికపై సాహిల్‌ ఆదివారం విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. 21సార్లు పొడిచాడు. కత్తి తలతో ఇరుక్కుపోవడంతో బండరాయితో మోది హత్య చేశాడు. ఆ హత్యను ప్రజలు చూసుకుంటూ వెళ్లారు తప్పితే ఒక్కరూ ఆపలేదు. ఈ ఉదంతం సిసి కెమెరాల్లో రికార్డ్‌ అయింది. ఈ ఘటన తర్వాత నిందితుడు సాహిల్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. 20ఏళ్ల సాహిల్‌ ఫ్రిజ్‌ – ఏసీ రిపేర్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. హత్య అనంతరం పారిపోయిన వ్యక్తిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని బులంద్‌ షహర్‌లో పట్టుకున్నారు.
శాంతి భద్రతల బాధ్యత గవర్నర్‌దే : కేజ్రీవాల్‌
బాలిక దారుణ హత్యపై ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతి భద్రతల బాధ్యత పూర్తిగా గవర్నర్‌దేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘ఢిల్లీలో బాలిక దారుణంగా హత్య చేయబడింది. ఇది చాలా విచారకరం. బాలికను హత్య చేసిన నేరస్తులు ఏమాత్రం భయం లేకుండా ఉన్నారు. పోలీసులంటే వారికి భయం లేదు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సార్‌.. ఢిల్లీలోని శాంతి భద్రతలు మీ బాధ్యత. దీనిపై దయచేసి ఏదో ఒకటి చేయండి’ అని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వికె సక్సేనాకు విజ్ఞప్తి చేశారు. బాలిక హత్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆప్‌ నేత అతిషి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వికె సక్సెనాపై మండిపడ్డారు. ‘ఢిల్లీలోని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాజ్యాంగం లెఫ్టినెంట్‌ గవర్నక్‌కి ఇచ్చింది. కానీ గవర్నర్‌ సక్సేనా మాత్రం.. అరవింద్‌ కేజ్రీవాల్‌ చేస్తున్న పనిని ఆపడానికే తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఢిల్లీలోని మహిళలు సురక్షితంగా లేరు. కాబట్టి వారి భద్రతపై దృష్టి పెట్టాలని నేను గవర్నర్‌ని రెండుచేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతిమలివాల్‌ ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన 16 ఏళ్ల బాలిక చేసిన తప్పేంటి? ఢిల్లీలో పోలీసులకు, చట్టానికి ఎవరూ భయపడరు. ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే క్రూరత్వానికి హద్దులుండవు’ అని ఆమె అన్నారు.

Spread the love