– అరంగేట్ర ప్రపంచకప్ టైటిల్స్ మన సొంతం
– ఖోఖో ప్రపంచకప్ 2025
భారత్ చరిత్ర సృష్టించింది. ప్రథమ ఖోఖో ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ వ్యాప్తంగా 39 జట్లు పోటీపడిన ఉత్కంఠభరిత ప్రపంచకప్‌లో భారత మహిళల, పురుషుల జట్లు విజేతలుగా నిలిచాయి. అమ్మాయిలు నేపాల్‌ను చిత్తు చేయగా.. అబ్బాయిలు సైతం నేపాల్‌పై ఘన విజయం సాధించారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఖోఖో ప్రపంచకప్‌లో భారత్ అద్భుతం చేసింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి ప్రపంచకప్‌లో ఇటు అమ్మాయిలు, అటు అబ్బాయిలు విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత మహిళల జట్టు 78-40తో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. భారత పురుషుల జట్టు 54-36తో నేపాల్‌ను చిత్తు చేసింది. మెన్స్ ఫైనల్లో సూయాశ్ (భారత్) ఉత్తమ ఎటాకర్‌గా, మెహుల్ (భారత్) ఉత్తమ ఆటగాడి అవార్డులు అందుకున్నారు. మహిళల ఫైనల్లో అన్షు కుమారి (భారత్), చైత్ర బి (భారత్)లు ఉత్తమ ఎటాకర్, ఉత్తమ ప్లేయర్ అవార్డులు దక్కించుకున్నారు. ఖోఖో ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన భారత జట్లకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తాయి.
ఏకపక్షంగా కొట్టేశారు :
న్యూఢిల్లీలోని ఇంధిరా గాంధీ స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో నేపాల్‌ను భారత్ చిత్తు చేసింది. నాలుగు క్వార్టర్ల ఆటలో తిరుగులేని ప్రదర్శన చేసింది. 78-40తో భారీ విజయం అందుకుంది. ఆరంభం నుంచి నేపాల్‌పై ఎదురుదాడి చేసిన అమ్మాయిలు.. నేపాల్ అమ్మాయిల బ్యాచ్‌ను మూడు సార్లు సింపుల్ టచ్‌తో అవుట్ చేసింది. కెప్టెన్ ప్రియాంక తొలి టర్న్‌లో అద్భుతంగా రన్ చేసింది. ఆఖరు వరకు ఆధిక్యం నిలుపుకోవటంతో పాటు ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్ 38 పాయింట్ల తేడాతో గెలుపొందింది.
పురుషుల విభాగం ఫైనల్లోనూ అదే ప్రదర్శన పునరావృతం అయ్యింది. అమ్మాయిల స్థాయిలో ఆధిపత్యం చెలాయించకపోయినా.. అద్భుత విజయమే అందుకున్నారు. నాలుగు టర్న్‌ల్లోనూ దుమ్మురేపిన టీమ్ ఇండియా సమర్థవంతంగా నేపాల్‌ను నిలువరించింది. 54-36తో సూపర్ విక్టరీ సాధించింది. మెహుల్, సుయాశ్‌లు అద్భుతంగా రాణించారు. ఖోఖో తొలి ప్రపంచకప్ లో మహిళల, పురుషుల విభాగాల్లో భారత్ చాంపియన్‌గా నిలువగా… రెండు విభాగాల్లోనూ నేపాల్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.