మణిపూర్‌పై సమగ్ర నివేదికివ్వండి

–  బీరెన్‌ సర్కార్‌కు సుప్రీం ఆదేశాలు..10వ తేదీకి విచారణ వాయిదా
న్యూఢిల్లీ : మణిపూర్‌లో నెమ్మదిగానైనా పరిస్థితులు మెరు గుపడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సోమవారం చెప్పింది. ఆదివారం తాజాగా హింస చెలరేగి మరో నలుగురు మరణించిన నేప థ్యంలో ఈ ప్రభుత్వ ప్రకటన వెలువడింది. ఇదిలా వుండగా, క్షేత్ర స్థాయిలో నెలకొన్న వాస్తవిక పరిస్థితులను వివరిస్తూ తాజాగా నివేదికను తదుపరి విచారణ జరిగే 10వ తేదీలోగా దాఖలు చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ”పునరావాసానికి, ఆయుధాలు రికవరీ చేసుకోవడానికి, శాంతి భద్రతల పరిస్థితులను పునరుద్ధరించడానికి జరుగుతున్న కృషిని తెలుసుకోవాలనుకుంటున్నాం. సవివరమైన నివేదిక మాకు కావాలి.” అని చంద్రచూడ్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చాలా దారుణంగా వున్నాయని పిటిషనర్‌ మణిపూర్‌ గిరిజన వేదిక ఢిల్లీ (ఎంటీఎఫ్‌డీ) తరపున సీనియర్‌ న్యాయవాది కొలిన్‌ గొంజాల్వెజ్‌ కోర్టుకు తెలియచేశారు. ఆ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు వెలువడ్డాయి. తాజాగా చోటు చేసుకున్న హింసాకాండలో ఒక వ్యక్తి తల నరికివేసినట్టు వార్తలందాయని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ కేసుకు మతం రంగు పులమవద్దని మెహతా పిటిషనర్‌ని కోరారు. ”సమస్య పరిష్కారమవుతోంది, పరిస్థితి నెమ్మదిగా అయిన మెరుగుపడుతోంది.” అని చెప్పారు. పరిస్థితి మెరుగుపడుతోందని చెబుతున్నా రాష్ట్రంలో గణనీయంగానే రక్షణ, భద్రతా బలగాలు వున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. 355 సహాయ శిబిరాలు వున్నాయి. కర్ఫ్యూను ఐదు గంటలకు తగ్గించారని తెలిపింది. ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం సుప్రీంకోర్టులో హామీ ఇచ్చినా హింస, హత్యలు కొనసాగుతున్నాయని సోమవారం గొంజాల్వెజ్‌ పేర్కొన్నారు. కోర్టు ఈ అంశాన్ని విచారణకు చేపట్టినపుడు 20వరకు మరణాలు నమోదవగా, ఇప్పుడు 110మంది చనిపోయారని పేర్కొన్నారు. కుకీలకు వ్యతిరేకంగా హింసకు పాల్పడాలన్న తమ ఉద్దేశాన్ని రెండు తీవ్రవాద గ్రూపులు బహిరంగంగానే ప్రకటించినా ఇంతవకు ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేదన్నారు. కాగా ఆర్టికల్‌ 370పై ఈనెల 11న సుప్రీం కోర్టు ఐదుగురి కూడిన ధర్మాసనం విచారించనున్నది.

 

Spread the love