మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల గౌరవ వేతనమివ్వండి

For lunch workers
Give an honorarium of Rs.10 thousand– పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి : పాఠశాల విద్యా శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మధ్యాభోజన కార్మికులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ.రమ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరు రాములు డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌, మిడ్డేమీల్‌ ఇన్‌చార్జి ప్రసాద్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. పాఠశాలల్లో కార్మికులు వంట చేసేందుకు గ్యాస్‌ను సబ్సిడీపై ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న గౌరవవేతనాన్ని, గుడ్ల బిల్లులను వెంటనే ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అందించే పనిని హరే రామ హరే కృష్ణ, తదితర సంస్థలకు ఇచ్చే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాచేస్తే 54,202 మంది మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలనీ, రాగిజావ పోయాలని కార్మికులపై ఒత్తిడి పెంచడం సరిగాదని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు రెండు గుడ్లకే సరిపోవడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గుడ్లకు అదనంగా బడ్జెట్‌ కేటాయించాలనీ, లేనిపక్షంలో అంగన్‌వాడీ కేంద్రాలకు మాదిరిగానే స్కూళ్లకు కూడా ప్రభుత్వమే సప్లరు చేయాలని కోరారు. రాగిజావ చేయడానికి అయ్యే ఖర్చులను కట్టివ్వాలని విన్నవించారు. గౌరవవేతనాలను కార్మికుల ఖాతాల్లోనే వేయాలని కోరారు.

Spread the love