అమలుకాని హామీలపై సమాధానాలు ఇవ్వండి

– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాని విషయంపై దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. కానీ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని, వాటి విషయంపై ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెబుతున్నారు కానీ.. పాలమూరు- రంగారెడ్డి, డిండి, ఉదయ సముద్రం, ఎస్‌ఎల్‌బీసీ టన్నల్‌ ప్రాజెక్టుల పనులు పూర్తి కాలేదని చెప్పారు. ఈ పనుల పూర్తికి నిధులు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. నిధుల విడుదలలో జాప్యం చేయడంతోపాటు వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని చెప్పారు. లిఫ్టులు మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయని వాపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏకకాలంలో రుణమాఫీ అమలు చేసి రైతుల కష్టాలను తీర్చాలన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించి సాగు చేస్తున్న ప్రతి రైతుకూ పట్టాలు ఇవ్వాలని కోరారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, మూడెకరాల భూ పంపిణీపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీనియర్‌ నాయకులు నూకల జగదీష్‌ చంద్ర తదితరులు ఉన్నారు.

Spread the love