మృతదేహాలైనా ఇప్పించండి

– మణిపూర్‌ కుటుంబం వేడుకోలు
సైకూల్‌ (మణిపూర్‌) : హింసాకాండతో మణిపూర్‌ అట్టుడుకుతోంది. మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కూడా లేకుండా పోతోంది. ఇది సైకూల్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతుల దీనగాథ. ఓ యువతి వయసు 21 సంవత్సరాలు కాగా మరొకరిది 24 సంవత్సరాలు. వీరిద్దరూ ఉపాధి కోసం అన్వేషిస్తూ రాజధాని ఇంఫాల్‌ వెళ్లారు. అక్కడ కార్లను కడిగే ఓ షెడ్డులో పనిలో చేరారు. ఒకరు కార్లను కడుగుతుంటే మరొకరు క్యాష్‌ కౌంటర్‌లో కూర్చునే వారు. అంతా బాగానే సాగుతోందనుకుంటున్న సమయంలో జాతి ఘర్షణలు వారి ప్రాణాలనే బలిగొన్నాయి. మెయితీలు, కుకీ-జో గిరిజనుల మధ్య మొదలైన విద్వేషాలు ఈ నెల 3న పెద్ద ఎత్తున హింసాకాండకు దారితీశాయి.
ఈ నెల ఐదవ తేదీ సాయంత్రం యువతుల తల్లికి ఓ మహిళ ఫోన్‌ చేసింది. మణిపురి భాషలో మాట్లాడిన ఆ మహిళ ‘నీ కుమార్తె బతకాలని కోరుకుంటున్నావా లేక చావాలని కోరుకుంటున్నావా’ అని ప్రశ్నిస్తూ ఫోన్‌ పెట్టేసింది. ఫోన్‌ చేసినా ఎవరూ బదులివ్వలేదు. రాత్రి సమయం కావడంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. మర్నాడు ఉదయం షెడ్డులో పని చేసే వారు ఫోన్‌ చేశారు. అల్లరి మూకలు వచ్చి మీ పిల్లలను చంపేశారని చెప్పారు. ఆ గుంపులో మహిళలు కూడా ఉన్నారట. పనివారు చెప్పిన వివరాల ప్రకారం…దాడి సమయంలో షెడ్డు యజమాని లేడు. దుండగులు ఆ మహిళలను ఓ గదిలోకి లాక్కొని వెళ్లి లోపల గడియ పెట్టారు. ఆ గదిలోనే వారిని దారుణంగా హతమార్చారు. లైంగిక దాడి చేశారేమో తెలియదు. అల్లరి గుంపు దాడి చేస్తుండగా ఓ పనివాడు వీడియో తీశాడు. జరిగిన దారుణం గురించి యజమానికి చెబుదామంటే ఫోన్‌ తీయలేదు. ఆయన ఏ తెగకు చెందిన వాడైనప్పటికీ పనివారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఆ దాడిలో ఆయనకు కూడా ప్రమేయముందేమో తెలియదు. దీనిపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయినా వారి నుండి ఇప్పటి వరకూ సమాధానం లేదు.
ఈ నెల ఐదవ తేదీ నుండి ఆ యువతుల మృతదేహాలు ఆస్పత్రి మార్చురీలోనే పడి ఉన్నాయి. ఇంఫాల్‌ వెళదామంటే అక్కడ ఉద్రిక్తతలు. కనీసం తమ కుమార్తెల శవాలనైనా అప్పగించాలని వారు కన్నీరుమున్నీరై వేడుకుంటున్నారు. ‘పోయిన ప్రాణాలు ఎలాగూ తిరిగి రావు. కనీసం శవాలైనా ఉంటే వాటికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించి తృప్తి పడతాం’ అని ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు. మణిపూర్‌లో ఇలాంటి అభాగ్యులు ఎందరున్నారో?

Spread the love