మూసీకి పదివేల కోట్లు ఇవ్వండి

Give Moosi ten thousand crores– జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులు కేటాయించాలి
– ఓఎంసీలకు గ్యాస్‌ సబ్సిడీ ముందుగానే చెల్లించండి
– పౌరసరఫరాల శాఖ బకాయిలు విడుదల చేయండి : కేంద్ర మంత్రులు సీఆర్‌ పాటిల్‌, హర్దీప్‌ సింగ్‌ పూరీ, జోషికి సీఎం రేవంత్‌ వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద రూ.పది వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ నగరంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిని దేశంలో మరెక్కడా లేని విధంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు సీఆర్‌ పాటిల్‌, హర్దీప్‌ సింగ్‌ పూరీ, ప్రహ్లాద్‌ జోషిలను ఆయన సోమవారం కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను వారి దష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌ నగరంలోని మురికి నీరంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. మూసీలో చేరే మురికి నీరును శుద్ధి చేయడం, వరద నీటి కాల్వల నిర్మాణం, స్థాయి పెంపు, మూసీ సుందరీకరణకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద దక్కన్‌ పీఠభూమిలోని నదుల పరిరక్షణ, అభివద్ధికి కేంద్రం యోచిస్తున్నందున మూసీలో కలిసే మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా గోదావరి జలాలను ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లతో నింపేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని మంత్రి పాటిల్‌ను కోరారు. ఈ రెండు చెరువులను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్‌ నీటి ఇబ్బందులు తీరడంతో పాటు మూసీ నది పునరుజ్జీవనానికి తోడ్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
రూ.16,100 కోట్లు అవసరం
జల్‌ జీవన్‌ మిషన్‌ కింద తెలంగాణకు నిధులు విడుదల చేయాలని జల్‌శక్తి మంత్రి సి.ఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2019 లెక్కల ప్రకారం జల్‌జీవన్‌ మిషన్‌ కింద రాష్ట్రంలో 77.60 శాతం ఇండ్లకు నల్లా నీరందుతోందని, ఇటీవల తాము చేపట్టిన సర్వేలో 7.85 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్‌ లేదని తేలిందని వివరించారు. ఆ ఇండ్లతో పాటు పీఎంఏవై (అర్బన్‌), (రూరల్‌) కింద చేపట్టే ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని, ఇందుకు మొత్తంగా రూ.16,100 కోట్లు అవసరమవుతాయని కేంద్ర మంత్రికి తెలిపారు. 2019లో జల్‌జీవన్‌ మిషన్‌ ప్రారంభించినా నేటి వరకు రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని, ఈ ఏడాది నుంచి నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ముఖ్యమంత్రి కార్యదర్శి చంద్రశేఖర్‌ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఉన్నారు.
రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరాలో
తెలంగాణలో రూ.500కే గ్యాస్‌ సరఫరాకు సంబంధించిన సబ్సిడీని ముందుగానే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే సదుపాయాన్ని కల్పించాలని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి పూరీని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా తమ ప్రభుత్వం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దష్టికి సీఎం తీసుకెళ్లారు. తాము ముందుగానే సబ్సిడీ చెల్లిస్తామని, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేయాలని గ్యాస్‌ ఏజెన్సీలను గతంలోనే కోరినా సానుకూలత వ్యక్తం కాలేదన్నారు. ప్రస్తుతం వినియోగదారులు సిలెండర్‌కు పూర్తిగా డబ్బులు చెల్లించిన తర్వాత సబ్సిడీ అందుతుండడంతో ఇబ్బందికరంగా ఉందన్నారు. గ్యాస్‌ సిలిండర్లకు చెందిన సబ్సిడీని ముందుగానే ఓఎంసీలకు చెల్లించేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. అలా వీలుకాని పక్షంలో వినియోగదారులకు తమ ప్రభుత్వం చెల్లించే సబ్సిడీని 48 గంటల్లోపు అందేలా చూడాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
పౌరసరఫరాల శాఖ బకాయిలు విడుదల చేయండి
ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నుంచి రావల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని సీఎం సోమవారం కలిశారు. 2014-15 ఖరీఫ్‌ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ. 1468.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టారని ఆయన కేంద్ర మంత్రికి తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని గుర్తు చేశారు. అందువల్ల బకాయిపడిన ఆ మొత్తాన్ని విడుదల చేయాలని సీఎం కోరారు. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987.730 మెట్రిక్‌ టన్నుల బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధ్రువీకరించుకొని అందుకు సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రి పూరీని సీఎం కోరారు. అలాగే 2021 మే నుంచి 2022 మార్చి వరకు నాన్‌ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ (నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు వెంటనే విడుదల చేయాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు.

Spread the love