రైతులకు కొత్త రుణాలివ్వండి

Give new loans to farmers– రుణాల మంజూరులో ఉదాసీనత తగదు
– రుణమాఫీ డబ్బులను ఇతర అప్పులకు జమ చేయొద్దు
– లీడ్‌ బ్యాంక్‌ పెద్దన్న పాత్ర పోషించాలి
– రూ.రెండు లక్షలకు పైబడిన రుణాలను రికవరీ చేసుకోవాలి
– ఏకకాలంలో రుణమాఫీ దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయం : బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రైతుల రుణమాఫీ కింద మంజూరైన నిధులను జమ చేసిన తర్వాత రైతులకు కొత్త పంట రుణాలివ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. రుణమాఫీ డబ్బులను ఇతర అప్పులకు జమ చేయొద్దని సూచించారు. వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో రుణాల మంజూరులో ఉదాసీనత తగదని బ్యాంకర్లను కోరారు. రెండు లక్షలకు పైబడిన రుణాల రివకరీ కోసం కృషి చేయాలని సూచించారు. ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. రుణమాఫీ అమలు, కొత్త రుణాల మంజూరుతోపాటు సాంకేతిక సమస్యల వల్ల రుణం మాఫీ కాకపోవడం వంటి సమస్యల విషయంలో లీడ్‌ బ్యాంక్‌ పెద్దన్న పాత్ర పోషించాలని ఆదేశించారు. రైతుల రుణమాఫీ నేపథ్యంలో బ్యాంకు ఆవరణలో బ్యాంకర్లు సంబరాలు నిర్వహించి కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశాన్ని నిర్వహించారు. రైతు రుణమాఫీ దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. రూ.2లక్షల రుణమాఫీ పథకం ద్వారా ఒకేసారి రూ.31వేల కోట్లు ఏ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదని వివరించారు. ‘ఆగస్టు నెల దాటకముందే రుణమాఫీ కింద రూ.31వేల కోట్ల నిధులను విడుదల చేస్తాం. 11 లక్షలకుపైగా రైతులకు రూ.6వేల కోట్లు విడుదల చేశాం. ఈ నెలలలోనే రెండో దఫా రూ.లక్షన్నర వరకు ఉన్న రుణాలకు, ఆ తర్వాత రూ.2లక్షల రుణాలకు నిధులు విడుదల చేస్తాం. రూ.2 లక్షలకు పైబడి రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకోవాలి. ప్రభుత్వం మంజూరు చేసే రూ.2లక్షలు కలిపి మొత్తంగా ఏ రైతూ రుణ బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని బ్యాంకర్లకు సూచించారు. రూ.2 లక్షల వరకు రుణాలు పొందిన రైతులకు బీమా వర్తిస్తుం దన్నారు. రైతుల రుణమాఫీ అనే తమ ఎన్నికల వాగ్దానాన్ని కాంగ్రెస్‌ పార్టీ పట్టుదలతో నెరవేరుస్తున్నదని చెప్పారు. విడుదలైన నిధులను రైతుల రుణాల మాఫీకే కచ్చితంగా వినియోగించాలని పునరుద్ఘాటించారు. అధికారంలోకి రాకముందు రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా, తాను సీఎల్పీ నేతగా రుణమాఫీ హామీపై సంతకం చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్లామని గుర్తు చేశారు. రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల బ్యాంకు ఖాతాల్లో రూ.31,000 కోట్లు జమ చేస్తుందని ఆయన వెల్లడించారు. భారత దేశ బ్యాంకింగ్‌ చరిత్రలో ఒకేసారి ఇంత భారీ మొత్తం రికవరీ కావడం ఇదే తొలిసారి అని భట్టి అభిప్రాయపడ్డారు. కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ రంగంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకులు ఒక్కసారిగా రికవరీ చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బ్యాంకింగ్‌ రంగానికి భారీ ప్రోత్సాహకమని పేర్కొ న్నారు. రుణమాఫీపై రైతులు పండుగ చేసుకున్నట్లే, బ్యాంకర్లు కూడా ఈ వేడుకను జరుపు కోవాలని సూచించారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలను ప్రవేశపెడుతుందని తెలిపారు. రాష్ట్ర జీఎస్‌ జీడీపికి వ్యవసాయ రంగం 16.5 శాతం దోహదపడిందన్నారు. జనాభాలో 45 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు.

Spread the love