– మిడ్‌డే మీల్స్ కేసులో హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాగనూరు, బూరుగుపల్లి ప్రభత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలపై ఆరు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ(ఏఏజీ) ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ ఇలాంటి ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. నారాయణపేట్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో రెండు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. 25,941 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మందికి పైగా విద్యార్థులన్నారనీ, వారిలో 75 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురయ్యారని ఏఏజీ వివరించారు. ఈ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కేంద్ర మార్గనిర్దేశకాల ప్రకారం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనాన్ని పక్కాగా పర్యవేక్షించాల్సి ఉంటుందనీ, కానీ క్షేత్రస్థాయిలో ఇలా జరగడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. విచారణ 6 వారాలకు వాయిదా పడింది.
హరీశ్‌రావును అరెస్టు చేయొద్దు : హైకోర్టు
స్థానిక పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌లో ఆయనకు ఊరట లభించింది. ఈ కేసు విచారణ జరపవచ్చుననీ, అయితే ఆయనను అరెస్టు చేయరాదని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏ విధమైన కఠిన చర్యలూ తీసుకోరాదని కూడా చెప్పింది. రాజకీయ దురుద్దేశంతో, కక్షసాధింపుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి జి.చక్రధర్‌గౌడ్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటాన్ని హరీశ్‌రావు సవాలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ లక్ష్మణ్ విచారించారు. ప్రాథమిక విచారణ, పరిశీలన చేయకుండానే పోలీసులు కేసు నమోదు చేశారన్నారని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. రాధకిషన్‌రావు ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఫిర్యాదుకు ఆధారాలు లేవన్నారు. ఇదే వ్యవహారంపై గౌడ్ గతంలో పిటిషన్ వేసి హైకోర్టు నుంచి వాపస్ తీసుకున్నారని చెప్పారు. పిటిషనర్ కీర్తి, ప్రతిష్టలను దెబ్బతీసేందుకే ఫిర్యాదు చేశారని అన్నారు. చట్ట ప్రక్రియను అమలు చేయడం లేదన్నారు. ఫిర్యాదు చేసిన గౌడ్ తనపై ఎలక్షన్ పిటిషన్ వేశారనీ, ఫోన్ ట్యాపింగ్ పిటిషన్ వేసి వెనక్కి తీసుకున్నారనీ, కేసుపై కేసు పెట్టి ఇబ్బంది పెట్టి అరెస్టు అయితే ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పారు. అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలనీ, కేసు విచారణపై స్టే ఇవ్వాలని కోరారు. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చిన హైకోర్టు, కేసు విచారణపై స్టేకు నిరాకరించింది. గౌడ్‌కు నోటీసులు ఇచ్చింది. విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేసింది.