– కలెక్టరేట్, బ్యాంకు ముందు రైతుల ఆందోళన
– గద్వాల, వరంగల్‌లో ఘటనలు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల/లింగాలఘనపురం
”మేమూ.. తెలంగాణ రైతులమే.. మాకెందుకు రుణమాఫీ చేయరు.. వెంటనే మాకూ రుణమాఫీ చేయండి” అంటూ రైతులు ఆందోళనకు దిగారు. గద్వాల, వరంగల్ జిల్లాల్లో సోమవారం కలెక్టరేట్, కెనరా బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి.. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మారమునగాల, పల్లెపాడు, చండూరు, ఇటిక్యాలపాడు గ్రామాల రైతులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. అలంపూర్ నియోజకవర్గం ఎనిమిది మండలాల్లోని గ్రామాల రైతులు కొంతమంది చాలా ఏండ్లుగా కర్నూల్‌లో నివాసముంటున్నామని చెప్పారు.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నట్టు తెలిపారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెగ్యులర్‌గా రైతుబంధు వేశారు.. కానీ రుణమాఫీ చేస్తామని చెప్పి కొందరికే చేశారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా తమకు అన్యాయం చేయడం సరికాదన్నారు. తక్షణమే తమకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయని పక్షంలో పెద్దఎత్తున రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు, కురువపల్లయ్య, పల్లెపాడు శంకర్‌రెడ్డి, రైతులు బీచుపల్లి, రాముడు, నాగేంద్ర, కృష్ణయ్య నాయుడు, సూర్యాగౌడ్, సత్యారెడ్డి, శ్రీరాములు, గోపాల్ రెడ్డి, శేషన్న, కురువ చిన్న కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
కెనరా బ్యాంక్ ముందు రైతుల ధర్నా
వరంగల్ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల కెనరా బ్యాంకు ఎదుట రైతులు ఆందోళన చేశారు. ”మాకు రుణాలు మాఫీ కాలేదు.. మేము రైతులం కాదా? వ్యవసాయం చేయడం లేదా ?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి విడత రుణమాఫీలో తమ పేర్లు లేవని, రెండో విడత ప్రకటించినా పేర్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారీ రెన్యువల్ చేస్తున్నారు కదా ? రూ.లక్ష లోపు అప్పు తీసుకున్నా ఎందుకు మాఫీ కాలేదంటూ బ్యాంక్ అధికారులను రైతులు నిలదీశారు. గోల్డ్ క్రాప్ లోన్‌లు కూడా మాఫీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు అందరికీ మాఫీ అవుతుందని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఏడమ అంజయ్య, రాగుల ఉప్పలయ్య, గంపల యాదయ్య, నర్సయ్య, కడకంచి బీరయ్య, కోతి ఉప్పలయ్య, రాములు, వెంకటేశం, గొరిగే శ్రీను తదితరులు పాల్గొన్నారు.