– ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వినతి
న్యూఢిల్లీ : పాత్రికేయులు, అభిమానులకు వీసా మంజూరు ప్రక్రియ వేగవంతం చేసేలా చూడాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కోరింది. అక్టోబర్ 5న 2023 ఐసీసీ ప్రపంచకప్ ఆరంభం కానుండగా.. పాకిస్థాన్ తొలి మ్యాచ్ అక్టోబర్ 6న ఆడనుంది. ఇప్పటికే తొలి వార్మప్ ఆడేసిన బాబర్ సేన.. మంగళవారం రెండో వార్మప్ సైతం ఆడనుంది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తొలి మ్యాచ్‌కు మరో నాలుగు రోజులే ఉండటంతో.. పాకిస్థాన్ మీడియా, అభిమానులకు వీసా మంజూరు చేసేలా చూడాలని పీసీబీ కోరింది. పాకిస్థాన్ నుంచి సుమారు 50 మంది క్రీడా పాత్రికేయులు ప్రపంచకప్ కవరేజ్‌కు రానుండగా.. అభిమానులపై స్పష్టత లేదు. భారత్‌కు పాకిస్థాన్ ప్రియర్ రిఫరెన్స్ లిస్ట్ (పీఆర్‌సీ) జాబితాలో ఉండటంతో.. విదేశాంగ శాఖ, హోం శాఖ సహా క్రీడా శాఖ సైతం అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌లకు వీసాలు ఇవ్వటంపై బీసీసీఐ నుంచి స్పష్టమైన హామీ లభించినా.. అభిమానులపై ఎటూ తేల్చలేదని సమాచారం. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఐసీసీని పీసీబీ కోరింది. ఐసీసీ ప్రపంచకప్ కోసం భారత్‌కు రానున్న పాత్రికేయుల వివరాలను విదేశాంగ శాఖ పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీనిపై రానున్న 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.