– మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మెన్ పదవి ఇవ్వడం చట్టవిరుద్ధమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షానికి పీఏసీ చైర్మెన్ పదవి ఇవ్వడం దేశంలో ఆనవాయితీగా వస్తున్నదన్నారు. దానికి తిలోదకాలివ్వడం పార్లమెంటరీ స్ఫూర్తికి, సాంప్రదాయాలకు విరుద్ధమన్నారు. పీఏసీలో 13 మంది సభ్యులుంటే అందులో తొమ్మిది మంది అసెంబ్లీ నుంచి ఉండాలని రూల్‌బుక్‌లో స్పష్టంగా ఉందని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఫైనాన్షియల్ కమిటీల ఎన్నిక షెడ్యూల్‌ను స్పీకర్ ప్రకటించారనీ, నామినేషన్లు వేయడం, ఉపసంహరించడానికి రెండు గంటల సమయమే ఇచ్చారని తెలిపారు. ఎన్నిక తర్వాత సభ్యుల పేర్లు ప్రకటించకుండా 38 రోజుల తర్వాత అసెంబ్లీ కమిటీలను ప్రకటించడం దారుణమని విమర్శించారు. నిబంధనల ప్రకారం పీఏసీలో ముగ్గురు బీఆర్‌ఎస్ సభ్యులకు అవకాశముంటే తాను, హరీశ్‌రావు, గంగుల కమలాకర్ నామినేషన్లు వేశామనీ, మధ్యలో ఈ గాంధీ ఎక్కడ నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఓటింగ్ జరగకుండానే హరీశ్‌రావు నామినేషన్‌ను ఎలా తొలగించారని నిలదీశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పెన్షన్ తొలగిస్తున్నారనీ, ఇక్కడే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పిలిచి పీఏసీ పదవి ఇచ్చారని విమర్శించారు. రాహుల్ విధానాలు తెలంగాణలో అమలు కావా? అని ప్రశ్నించారు. గాంధీని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి శిఖండి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పీఏసీపై పునరాలోచన చేయాలని స్పీకర్‌ను కోరారు. స్పీకరు నిర్ణయం మారకపోతే గవర్నర్‌ను కలిసి ఇతర మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. గాంధీ బీఆర్‌ఎస్ సభ్యులే అని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.