శిలాజ ఇంధనాల రూపంలో భూతాప పెను ప్రమాదం

ప్రపంచ దేశాలు శిలాజ ఇంధనాల (ఫాజిల్‌ పూయల్స్‌) వాడకం అనబడే వ్యసనానికి అనాలోచితంగా బానిసలు అవుతున్నాయి. తాత్కాలిక, స్వల్పకాలిక ప్రయోజనాలకు ఆశపడి దీర్ఘకాలిక సంక్షోభాగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ధరిత్రితో పాటు మానవ సమాజ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి కోల్‌, కోల్‌ ఉత్పత్తులు, సహజ వాయువు, ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, వంట చెరుకు లాంటి శిలాజ ఇంధనాలను వినియోగించడం సర్వ సాధారణం అయ్యింది. తక్షణమే ప్రపంచ దేశాలు శిలాజ ఇంధనాల వినియోగానికి క్రమ క్రమంగా స్వస్తి పలికి సౌర, పవన, సముద్ర అలల, బయోమాస్‌, జియోథర్మల్‌, హైడ్రోజన్‌, హైడ్రోపవర్‌ లాంటి పునరుత్పాదక ఇంధనాలను ఆశ్రయించని యెడల సుస్థిర శక్తి భద్రత, శక్తి వినియోగ ధరలు, సర్వతోముఖాభివద్ధి, ధరణి ఆరోగ్య పరిరక్షణలకు విఘాతం కలుగుతుందని తెలుసుకోవాలి.
శిలాజ ఇంధనాల వినియోగం మూలంగా వాతావరణ ప్రతికూల మార్పులతో భూగోళం నిప్పుల కుంపటి మారనుంది, మారుతున్నది. సాంప్రదాయ తరిగే శిలాజ ఇంధనాల వాడకాన్ని విశ్వవ్యాప్తంగా తగ్గిస్తూ తరగని సాంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాల్సిన అగత్యం ఏర్పడింది. పునరుత్పాదక ఇంధనాలే ప్రపంచానికి 21వ శతాబ్దపు ఆరోగ్య భాగ్యాలను ప్రసాదించే వరాలని భావించాలి. సరసమైన ధరలకు పునరుత్పాదక శక్తిని అందించే సుస్థిర స్థితికి చేరినపుడు మాత్రమే భూగోళం జీవుల నివాసయోగ్యతకు అర్హతను కలిగి ఉంటుంది. శిలాజ ఇంధన రూపంలో పొంచి ఉన్న భూతాప ప్రమాదాలను మరిచిన ప్రపంచ దేశాలు నేటికీ వాటి వాడకం మీదనే అతిగా ఆధారపడి ఉండడం సోచనీయం, ఆక్షేపణీయం.
శిలాజ ఇంధనాల దుష్ప్రభావం: రోమ్‌ తగలపడుతున్న వేళ నీరో ఫిడేలు వాయించినట్లు భూవాతావరణం వేడెక్కుతున్న వేళ పలు దేశాధినేతలు అనాలోచితంగా శిలాజ ఇంధనాల వినియోగానికి ఉవ్విలూరుతున్నారు. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంతో వాతావరణ మార్పులు తీవ్ర సమస్యగా మారుతున్నది. ప్రపంచ దేశాలు శిలాజ ఇంధనాల సరఫరాలో ప్రతి నిమిషం 11 బిలియన్ల అమెరికన్‌ డాలర్ల సబ్సిడీలను భరిస్తున్నాయి. శిలాజ ఇంధన వినియోగం ఇలాగే కొనసాగితే అకాల వర్షాలు, వరదలు, కరువుకాటకాలు, కార్చిచ్చులు, అసాధారణ అనారోగ్య కారణ ఉష్ణోగ్రతలు లాంటి ప్రకతి విపత్తులు సాధారణం కానున్నాయి. దీనికి తోడుగా జీవవైవిధ్య సమస్యతో జీవకోటి మనుగడ ప్రశ్నార్థకం కానున్నది. నేడు భూగోళం వాతావరణ ప్రతికూల మార్పుల కల్లోలం ఉంది. శిలాజ ఇంధనాలతో వాతావరణ మార్పుల సంక్షోభం అంచున ప్రపంచ ప్రాణికోటి నిలబడి ఉంది. ఈ ప్రతికూల మార్పులకు అతీతులెవరూ లేరు. అన్ని జీవరాశులతో పాటు ప్రపంచ మానవ సమాజం ఈ భూగోళ మంటల్ని భరించాల్సిందే, తగు శాప ఫలాలను అనుభవించాల్సిందే.
ప్రస్తుత కర్తవ్యం ఏమిటి? : ప్రపంచ దేశాలు 2030 నాటికి క్రమంగా శిలాజ ఇంధనాల వినియోగాలను, వాటికి సంబంధించిన మౌళిక వసతులను తగ్గిస్తూనే పునరుత్పాదక తరగని ఇంధనాల వినియోగాలను, పెట్టుబడులను, ఉత్పత్తులను పెంచాల్సిన అనివార్యత ఏర్పడింది. జీ-20 దేశాల ప్రభుత్వాలతో పాటు ఓఈసిడి దేశాలు ఈ దిశగా వడివడిగా అడుగులు వేయాల్సి ఉంది. పునరుత్పాదక ఇంధనాలకు సంబంధించిన సాంకేతికతలను, టెక్నాలజీ మార్పుల ప్రతిబంధకాలైన మేధో హక్కులను సడలించడం సత్వరమే జరగాలి. తరగని సాంప్రదాయేతర ఇంధన టెక్నాలజీ ఉపకరణాలను, ముడి సరుకుల సరఫరా శంఖలాలను ప్రపంచ దేశాల మధ్య నెలకొల్పాల్సి ఉంటుంది. 2020 నాటికే అందుబాటులోకి వచ్చిన 5 గీగావాట్ల బ్యాటరీ స్టోరేజ్‌ సామర్థ్యాలను 2030 నాటికి అనేక గీగావాట్ల నిలువ సామర్థ్యాలకు పెంచాల్సి ఉంది. శిలాజ ఇంధనాలకు వెచ్చించే నిధులను తరగని ఇంధనాల అభివద్ధికి, ఉత్పత్తికి వినియోగించుకోవలసి ఉంటుంది. సౌర, పవన శక్తి ఉత్పత్తికి సంబంధించిన ప్రభుత్వ అనుమతులు వేగంగా, సులభంగా అందుబాటులోకి రావాలి. పునరుత్పాదక శక్తి ఉత్పత్తులను కనీసం 3 రెట్లు పెంచడానికి ప్రణాళికలు అమలు చేయాలి. సాంప్రదాయేతర ఇంధనాల ఉత్పత్తి పరిశ్రమలు నెలకొల్పడానికి తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు వితరణ చేసేలా యాంత్రాంగాలను సమాయత్తం చేయాలి.
భూగ్రహం నివాసయోగ్యతను కాపాడలేమా? : వాతావరణ ప్రతికూల మార్పులతో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరిగితే భూగోళం నివాసయోగ్యతలను కోల్పోతుందని మరువరాదు. 2030 నాటికి 40 శాతం కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడంతో పాటు 2050 నాటికి జీరో కార్బన్‌ ఉద్గార స్థాయికి చేరుకునేలా స్థిరమైన అడుగులు పడాలి. పునరుత్పాదక శక్తి విప్లవం మానవాళి మనుగడకు గొడుగులు పట్టనున్నది. నేడు ఉక్రెయిన్‌ యుద్ధంతో చమురు, సహజ వాయువు ధరలు చుక్కలను అందుకుంటున్న వేళ పునరుత్పాదక శక్తి ధరలు తగ్గనున్నాయి. పునరుత్పాదక శక్తి ఉత్పత్తి పరిశ్రమలు లక్షల ఉద్యోగాలను ఇవ్వనున్నాయి. అడవుల నరుకువేత, భూసారం తగ్గడం లాంటి ప్రధాన అంశాలు కూడా భూతాపానికి దోహదపడుతున్నాయని మనకు తెలుసు. చేతులు కాలక ముందే ఆకులు సిద్ధం చేసుకుంటూ, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటూ భూమాతను ఓ అద్భుత నివాసయోగ్య ఆలయంగా మార్చుకుందాం. శిలాజ ఇంధనాలకు చరమగీతం పాడుదాం.
– డా||బుర్ర మధుసూదన్‌ రెడ్డి, 9949700037

Spread the love