చీకట్లోనూ వెలిగిపోతోంది

జూలై 2016లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌వనీ హత్య తర్వాత కాశ్మీర్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో ఇన్షా ముస్తాక్‌ 9వ తరగతి చదువుతుంది. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని సెడో గ్రామంలోని తన ఇంటి కిటికీలోంచి చూసింది. భద్రతా బలగాలు ప్రయోగించిన లోహపు గుళికల వడగళ్లు ఆమె కంటి నుంచి దూసుకొని తల నుండి బయటకు వచ్చాయి. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మెలకువ వచ్చే సరికి చుట్టూ చిమ్మచీకటి. శాశ్వితంగా చూపు కోల్పోయింది. ఇలా ఆమె ఒక్కతే కాదు, కాశ్మీర్‌లో నిత్యం జరిగే ఇలాంటి సంఘటనలకు ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు. అయితే ఈమె మాత్రం కంటి చూపు లేకున్నా లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. పట్టుదలతో చదువుకుంది. ఇటీవల 12వ తరగతి ఫలితాల్లో ఓ మెరుపులా ప్రపంచం ముందుకు వచ్చిన ఆమె పరిచయం నేటి మానవిలో…

ఆత్మ విశ్వాసం నింపింది
సంఘటన తర్వాత తన ఆశలు సన్నగిల్లిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ”ప్రారంభంలో నేను నిస్సహాయంగా, ఎలాంటి అధారం లేనిదానిలా ఉన్నాను. అలాంటి సమయంలోనే కంటి చూపు కోల్పోయిన ఓ ఐఏఎస్‌ అధికారిని కలవడం నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ప్రస్తుతం నేను బ్యాచిలర్స్‌ చేస్తున్నాను. తర్వాత ఐఏఎస్‌ కోచింగ్‌ కోసం వెళ్తాను” చెప్పింది.
అప్పటి వరకు హాయిగా సాగిన ఇన్షా జీవితంలో ఒక్కసారిగా చీకటి మబ్బులు ప్రవేశించాయి. ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంది. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తనని తాను సిద్ధం చేసుకుంది. ప్రపంచాన్ని చూడలేక పోయినా పట్టుదలతో చదువు కొనసాగించింది. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 73శాతంతో ఉత్తీర్ణత సాధించి తిరిగి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 22 ఏండ్ల ఇన్షా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షపై తన దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించుకుంది ”మన జీవితంలో చాలా సవాళ్లు ఉండవచ్చు. కానీ మన లక్ష్యాన్ని మనం ఎప్పటికీ వదులుకోకూడదు” అని ఇన్షా తన ఫలితాల తర్వాత చెప్పింది.
ఆసుపత్రుల చుట్టూ తిరిగింది
    సంఘటన తర్వాత ఇన్షా నెలల తరబడి ఆసుపత్రుల్లో గడిపింది. అలాగే ట్రామా సెంటర్లలో కూడా తల దాచుకుంది. ”ప్రారంభంలో నేను శ్రీ మహారాజా హరి సింగ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందాను. ఆ తర్వాత నాలుగు నెలల పాటు ఢిల్లీలోని ట్రామా సెంటర్‌కి వెళ్లాను. ముంబైలో కూడా ఒక నెల గడిపాను” అని ఆమె చెప్పింది. ఇప్పుడు ఇన్షా సాధించిన ఫలితాలతో ఆమెకు సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. తనలాంటి బాధితులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందంటూ ఎందరో ఆమెను కొనియాడుతున్నారు.
ఏడుస్తూ ఇంటికి వచ్చేదాన్ని
     మందు గుండు కంటిని చీల్చుకు పోయినా అమె మాత్రం అన్నింటిలో స్థిరంగా ఉంది. తన విద్యను కొనసాగించాలనే ఆసక్తితో ణూూలో బ్రెయిలీ, కంప్యూటర్‌, ఇంగ్లీష్‌ నేర్చుకోవడం ప్రారంభించింది. ”అప్పుడు బ్రెయిలీ నాకు పూర్తిగా కొత్తది. నేర్చుకోవడం చాలా కష్టంగా ఉండేది. దాంతో ఏడుస్తూ ఇంటికి వచ్చేదాన్ని. కానీ ఉపాధ్యాయులు నన్ను ప్రోత్సహించారు. నేర్చుకోవడంలో సహాయం చేసారు” అంటూ ఆమె అప్పటి విషయాలను గుర్తు చేసుకుంది.
వారిని మించిపోయానన్నారు
చూపు కోల్పోయిన తర్వాత కొత్త జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి ఇన్షా పోరాటం కొనసాగింది. 2017లో 10వ తరగతి బోర్డు పరీక్షలకు వేరొకరి సహాయంతో హాజరయ్యింది. పదో తరగతి తర్వాత ణూూలో చేరింది. 12వ తరగతిలో సోషియాలజీ, ఎడ్యుకేషన్‌, హిస్టరీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ఇంగ్లీషు సబ్జెక్టులు ఎంపిక చేసుకుని 500కి 367 మార్కులు సాధించింది. ”ఫలితాలు ప్రకటించినప్పుడు ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని భావించాను. తక్కువ మార్కులు వచ్చాయని మొదట్లో ఏడ్చాను. కాని కంటి చూపు ఉన్న చాలా మంది విద్యార్థులను నేను మించిపోయానని నా తల్లిదండ్రులు నన్ను ఓదార్చు” అని ఆమె చెప్పింది.
నాలో ధైర్యం నింపారు
    కుటుంబం ఇన్షాకు పూర్తి మద్దతునిచ్చింది. అన్ని విధాలుగా సహకరించింది. ”ఎప్పుడూ ఆశ కోల్పోవద్దని, నేను ఏదైనా చేయగలనని నా వాళ్ళు నాలో ధైర్యం నింపారు. నేనూ అలాగే చేసాను. నా ప్రయాణంలో చాలా సవాళ్లను, సమస్యలను ఎదుర్కొన్నాను. వాటిని జయించాను’ అంటూ ఆమె చెప్పింది. 12వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు బ్రెయిలీని మాత్రమే కాకుండా, రికార్డ్‌ చేసిన ఉపన్యాసాలు కూడా ఉపయోగించింది. ”నేను ఉపన్యాసాలను రికార్డ్‌ చేస్తాను. ల్యాప్‌టాప్‌లో వింటూ వాటిని తయారు చేసుకుంటాను” అన్నది.
చదువులో సాయం చేస్తున్నారు
ఇన్షా ‘జమ్మూ కాశ్మీర్‌ సెంటర్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌’ నుండి ప్రశంసలు అందుకుంది. ఈ సంస్థ 2018 నుండి విద్యను కొనసాగించడంలో ఆమెకు సహాయం చేస్తున్న ప్రభుత్వేతర సంస్థ. ”వారు నాకు పునరావాసం కల్పించారు. నాకు మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా నాదిర్‌ అలీ. వారు నాకు చదువులో ఎల్లప్పుడూ సహాయం చేస్తారు” అంటూ ఆమె ఆ సంస్థ గురించి చెప్పింది. ఒకప్పుడు సహాయకులు లేకుండా కనీసం బయటకు వెళ్ళడమే ఇన్షాకు పెద్ద సవాలు. అలాంటి ఆమె తన లక్ష్యాన్ని సాధించడంలో ఎదురయ్యే సవాళ్లన్నింటినీ ఎదుర్కొంటూ అనుకున్న గమ్యాన్ని చేరతానని ఆత్మ విశ్వాసంతో చెబుతుంది.
అనువాదం : సలీమ

Spread the love