– ఈ నెల 22న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
– జూన్‌లో ఛలో హైదరాబాద్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గొర్రెలు ఎప్పుడిస్తారో స్పష్టమైన తేదీ చెప్పకుండా ప్రభుత్వం గొల్లకురుమలతో డీ.డీలు ఎందుకు తీసుకుంటున్నాని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్) ప్రశ్నించింది. ప్రభుత్వం గొల్లకురుమల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించింది.ఈ నెల 22న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలనీ, జూన్‌లో ఛలో హైదరాబాద్ నిర్వహించాలని నిర్ణయించింది. శనివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడుతూ గొర్రెలు ఎప్పుడిస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించకుండా గొల్లకురుమలతో డీ.డీలు తీసుకుని, వారిని అప్పులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యం చేసిన కొద్ది ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిచ్చారు. 10 నెలల క్రితం డీ.డీలు తీసిన ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల వారికి ఇప్పటి వరకు గొర్రెలివ్వకుండా నిర్లక్ష్యం చేశారని గుర్తు చేశారు. నెల రోజుల్లో మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా హడావిడిగా వేలాది మందిని డీడీలు తీయించారని తెలిపారు. ఎన్ని నిధులు ఉన్నాయో చెప్పడం లేదనీ, ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఎవరికి ముందు పంపిణీ చేస్తారనే కనీస ప్రణాళిక లేకుండా అందరిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పాత పద్దతిలోనే దళారులతో గొర్రెలు పంపిణీ చేయిస్తూ… రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగిలిపోయి ఉన్న 3.5లక్షల మంది డీ.డీ.లు తీయిస్తే ఎన్నికలు వచ్చేలోపు గొర్రెల పంపిణీ సాధ్యపడదన్నారు. మునుగోడులో చేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా నగదు బదిలీ చేసి గొర్లకాపరులకు నచ్చినచోట ఇష్టమొచ్చిన గొర్రెలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అడిగినప్పుడల్లా త్వరలో ప్రారంభిస్తామని చెప్పడం, సకాలంలో పంపిణీ చేయకపోవడంతో గొల్లకుర్మలు విశ్వాసం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే దశలవారీగా జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులకు, శాసన సభ్యులకు మెమోరాండాలు ఇచ్చామనీ, అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. మరో వారం రోజుల్లో గొర్రెల పంపిణీ ప్రారంభించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు అవిశెట్టి శంకరయ్య, బొల్లం అశోక్, కాల్వ సురేష్, కడెం లింగయ్య, ఎక్కలదేవి కొమురయ్య, బచ్చలకూర శ్రీనివాస్, గౌర శ్రీశైలం, పయ్యావుల మల్లయ్య, కల్కినేని తిరీష్, వేల్పుల రమేష్, చేపూరి ఓదేలు, వజ్జె వినరు వివిధ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.