దైవాంశ సంభూతుడు!

అతను నాలా నీలా కాదు
అచ్చం దైవాంశ సంభూతుడు
అతను మన విధిరాత
విదర్భ విధ్వంసానికి
బెస్ట్‌ బేకరీ నరమేధానికి
దర్శక నిర్మాత!
అతను నాలానీలా కాదు
తల్లి పేగు తెంచుకొని పుట్టడానికి
సాక్షాత్తు దైవ కుమారుడు!

అకస్మాత్తుగా పచ్చ నోట్లకు
మంగళ గీతం పాడి
బ్యాంకుల ముందు జనాల్ని బారులు తీర్చి
డజన్ల కొద్ది ప్రాణాలకు
మోక్షం ప్రసాదించిన మహాత్ముడు!

అందరి సొమ్మును అప్పనంగా కాజేసిన
మానవోత్తములను వైతరణి దాటించిన
పరమ పావన కామధేనువు
అతను నాలా నీలా కాదు
కారణజన్ముడు!

హత్రాస్‌లో ఆడపిల్లను చిదిమేసిన వాళ్లనీ
ఆటలాడి మువ్వన్నెల జెండాకు
మెరుగుపెట్టిన వాళ్ల అభిమానాన్ని
అపహాస్యం చేసిన వాళ్లను
తన రెక్కల కింద దాచుకొని
కాపాడిన తల్లికోడి అతను!

అతడు నాలా నీలా కాదు
దైవం ఏరి కోరి భువికి పంపబడ్డాడు
మణిపూర్‌ మంటలు అతని
ఆత్మను కాల్చజాలవు

అకస్మాత్తుగా అతను విధించిన
కరోనా కర్ఫ్యూను సవాలు చేస్తూ
వేల కిలోమీటర్లు నడిచిన
కాళ్లు కార్చిన రక్తం
అతని ఆత్మను తడపజాలదు
ప్రాణవాయువు అందక
పసిబిడల్ని కోల్పోయిన
తల్లులు కార్చిన కన్నీళ్లు సైతం
అతని మనసు ముంచెత్త జాలవు

గడ్డ కట్టిన చలిలో
రాజధాని నడిబొడ్డున
గొంతెత్తిన అన్నదాత ఆర్తనాదాలు
అతని చెవికి వినపడవు
అతను నాలా నీలా కాదు
మానవాతీతుడు!

అతని మనోనిబ్బరం మంచు పర్వతం
ప్రజాగ్రహానికి మాత్రమే కరుగగలదు
ఆకాశమార్గాన సంచరించే అతని అహాన్ని
ఇదొక్కటే భూమార్గం పట్టించగలదు…

-టి హరికృష్ణ, 9494037288

Spread the love