గోల్కొండ కోటపై గోల్ మాల్ తతంగం

– దశాబ్ది ఉత్సవాల పేరుతో క్షుద్ర రాజకీయం
– కేసీఆర్ కుటుంబంపై విషం కక్కిన కిషన్ రెడ్డి
– బీజేపీ అంటేనే బడా గోల్ మాల్ పార్టీ
– తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో చెప్పకుండా సొల్లు పురాణం
– అధికార వేదికపై ఎలా మాట్లాడాలో తెలియని అజ్ఞాని
– గోల్కొండ కోటపై దర్శనమిచ్చిన గోబెల్స్ అవతారం
– కిషన్ రెడ్డి అప్పుడప్పుడు దర్శనమిచ్చే టూరిస్టు
– మోడీ, కిషన్ రెడ్డి, బండిసంజయ్, ఎంపీ అరవింద్ లది చదువురాని సన్నాసుల సంఘం
– అందుకే తెలంగాణ అభివృద్ధి వారికి కనిపించడం లేదు
– తెలంగాణ అప్పుల కుప్పకాదు,అభివృద్ధి, సంక్షేమ రాష్ట్రం
– మోడీ హయాంలో 80లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు?
– ప్రజల సంపద ఎవరికి దోచిపెడుతున్నారో దేశమంతా తెలుసు
– పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విర్చిన ఘనుడు మోడీ
– తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర శూన్యం
– బీజేపీ గౌరవ పార్టీ కాదు, కౌరవ పార్టీ
– చావు నోట్లో తల పెట్టి రాష్ట్రం సాధించిన యోధుడు కేసీఆర్
– తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్ కు ముందు,కేసీఆర్ కు తర్వాత అని బేరీజు వేయాలి
– హామీలు ఇచ్చినవి, ఇవ్వనివి కలిపి 450 పథకాలు అమలు చేస్తున్న దమ్మున్న సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నవతెలంగాణ కంఠేశ్వర్
కేంద్ర ప్రభుత్వం పేరుతో బీజేపీ గోల్కొండ కోటపై గోల్ మాల్ తతంగం నడిపిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల పేరుతో కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి క్షుద్ర రాజకీయం చేశారని మండి పడ్డారు. కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన, పదేళ్ళలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పకుండా కేసీఆర్ పై, ఆయన కుటుంబంపై విషం కక్కడానికే మొత్తం సమయాన్ని కేటాయించారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.పదేళ్ళలో తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో, ఇక ముందు ఏమిస్తుందో చెప్పకుండా కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు వల్లెవేస్తూ సొల్లు పురాణం వినిపించారని ఆయన విమర్శించారు.అధికార వేదికపై ఎలా మాట్లాడాలో తెలియని అజ్ఞాని కిషన్ రెడ్డి. ఆయనగోల్కొండ కోటపై దర్శనమిచ్చిన గోబెల్స్ అవతారం.
కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి అప్పుడప్పుడు తెలంగాణలో కనపడే టూరిస్టు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఫ్లై ఓవర్లు ఉన్నాయో, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో, ఎంత పంట పండుతుందో, ఎన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో తెలియదు. బీజేపీ నాయకులది చదువురాని సన్నాసుల సంఘం. ఈ సంఘానికి అధ్యక్షుడు మోడీ అయితే ఉపాధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి తొండిమాటల బండిసంజయ్ కాగా నిజామాబాద్ జిల్లా అష్ట దరిద్రపు ఎంపీ అరగుండు అరవింద్ కార్యదర్శి. వీరి చదువులు ఫేక్, వీళ్ల వ్యవహారం ఫ్రాడ్. వీరు చెప్పేది ఫాల్స్.అందుకే ఈ చదువురాని మొద్దులకు తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదు. రాష్ట్రం రాక ముందు తెలంగాణ ఎట్లుంది?. రాష్ట్రం అయిన ఈ పదేండ్లలో ఎట్లుంది? అని నాడు-నేడు పేరుతో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ దేశమే గర్వపడుతున్న తెలంగాణ మోడల్ గురించి రోజుకొక సబ్జెక్ట్ పై వివరించే కార్యక్రమాన్ని మేం నిర్దేశించుకున్నాం. దీన్ని ఓర్వలేక బీజేపీ కొత్తగా కేంద్రం ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల పేరుతో సరికొత్త డ్రామాలకు తెరలేపింది. కిషన్ రెడ్డి చిత్రీకరించినట్టు తెలంగాణ అప్పుల కుప్పకాదు,అభివృద్ధి, సంక్షేమ రాష్ట్రం. వాస్తవానికి బీజేపీయే దేశాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. 14మంది ప్రధాన మంత్రులు రూ. 56 లక్షల కోట్ల అప్పులుచేస్తే ఒక్క మోడీ ప్రభుత్వమే రూ.80లక్షల కోట్ల అప్పులు చేసింది.ప్రతి క్షణానికి రూ.5.34 లక్షల అప్పు చేస్తున్నది. తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని పదేపదే గొంతు చించుకుంటున్న కిషన్ రెడ్డికి ఇది కనిపించడం లేదా?.దేశంలోని బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువగా లక్షల కోట్లు అప్పులు చేస్తూ, వడ్డీల కోసం కోట్లకు కోట్లు తగలేస్తున్నా వారికి కనిపించడం లేదు.
అప్పుల్లో 55శాతం మిత్తీలకే పోతున్నది...
– 2021-22 లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆ ఏడాది చేసిన అప్పు రూ.14,86,618 కోట్లు. ఇక రోజువారీగా గణిస్తే ప్రతి రోజూ రూ.4,073 కోట్లు అప్పు చేసింది.
– ఇక ఆ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.8,05,499 కోట్లు మిత్తీ(55 శాతం) కట్టింది. అంటే.. రోజుకు రూ.2,207 కోట్లు వడ్డీ చెల్లించింది
– తాజాగా సమర్పించిన బడ్జెట్‌లో ఈ ఏడాది రూ.16.85 లక్షల కోట్ల అప్పు చేస్తామని కేంద్రం తెలిపింది.
– దీంతో మోడీ హయాంలో పదేండ్లలో చేసిన అప్పు రూ.112 లక్షల కోట్లకు చేరనున్నది.
– పదేండ్లలో జీడీపీ విలువ 140 శాతం పెరిగితే అప్పులు మాత్రం 170 శాతానికి పైగా పెరిగాయి. మోడీ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే మార్గాల కన్నా అప్పులపైనే ఎక్కువగా దృష్టిపెట్టిందని దీన్నిబట్టి స్పష్టం అవుతున్నది.
– తాజాగా ఆర్ధికశాఖ ప్రకటన ప్రకారమే కేంద్రం అప్పు రూ.147 లక్షల కోట్లు.
– గడచిన ఎనిమిదన్నరేళ్ళల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం చేసిన అప్పే సుమారు 70 లక్షల కోట్ల రూపాయలుందట.
– మోడీ ప్రభుత్వం అసలిన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేసింది?.
– ఒక్క పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏర్పాటు చేయలేదు.
– సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయకపోగా ఉచితాలు వద్దంటూ మోడీ గోల చేస్తున్నారు..
– పోనీ కరోనా వైరస్ కాలంలో ఏమన్నా జనాలకు సాయం చేశారా అంటే అదీలేదు.
– అప్పట్లో ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో ఎవరికీ తెలీదు.
చిన్నతరహా పరిశ్రమలకు సాయం చేస్తున్నారా అంటే అదీ కనబడటం లేదు. పీఎం కేర్స్ పేరుతో విరాళాల రూపంలో కొన్ని వందల కోట్ల రూపాయలు వచ్చాయి. అవేం చేశారో ఎవరికీ తెలీదు. ఇదే సమయంలో ఏవో కారణాలు చెప్పి పబ్లిక్ సెక్టార్లలో కొన్నింటిని రూ. 4 లక్షల కోట్లకు అమ్మేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు బ్యాంకుల అప్పుల రూపంలో వేల కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు. మరోవైపు పారిశ్రామికవేత్తలు చెల్లించాల్సిన రూ. 12 లక్షల కోట్లను ప్రభుత్వమే రానిబాకీల కింద రద్దు చేసింది. మరి చేయాల్సిన నష్టం చేస్తూ కూడా మళ్ళీ రూ. 70 లక్షల కోట్లు అదనంగా ఎందుకు అప్పు చేసిందో కిషన్ రెడ్డి చెప్పాలి.
ప్రజల సంపద ఎవరికి దోచిపెడుతున్నారో దేశమంతా తెలుసు
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విర్చిన ఘనుడు మోడీ” అని జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు.
తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర శూన్యం. తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపిచ్చిందనడం సిగ్గుచేటు.
ఒక్క రోజైనా బీజేపీ ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొందో చెప్పాలి.
ఏ ఒక్క బీజేపీ నాయకుడిపై అయినా ఉద్యమ కేసు ఏ పోలీసు స్టేషన్లో నమోదయిందో కిషన్ రెడ్డి చెప్పాలి.
బీజేపీ తెలంగాణ బద్ధ శత్రువు. తెలంగాణ పేరెత్తే అర్హత కూడా బీజేపీకి లేదు.
ఒక్క బీజేపీ నాయకుడికైనా తెలంగాణకోసం పోరాడిన చరిత్ర ఉందా?. తెలంగాణ కోసం రాజీనామా చేద్దామంటే పారిపోయిన చరిత్ర కిషన్ రెడ్డిది. తల్లిని చంపి పిల్లకు ప్రాణం పోశారని విషం కక్కిన చరిత్ర ప్రధాని మోడీది. కేంద్రం తెలంగాణకు అడుగడుగునా ద్రోహం తప్ప ఒక్క మేలైన చేసిందా?.
బీజేపీ ఎంత మొసలి కన్నీరు కార్చిన అది పచ్చి తెలంగాణ ద్రోహి.
చావు నోట్లో తల పెట్టి రాష్ట్రం సాధించిన యోధుడు కేసీఆర్.
తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్ కు ముందు, కేసీఆర్ కు తర్వాత అని బేరీజు వేయాలి.
హామీలు ఇచ్చినవి, ఇవ్వనివి కలిపి 450 పథకాలు అమలు చేస్తున్న దమ్మున్న సీఎం కేసీఆర్.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అనగానే కేంద్రం ఏదైనా తీపి కబురు చెప్పుతుందని ఆశించాం. తీపి కబురు చెప్పకపోగా కిషన్ రెడ్డి ఒక పాపి గా తెలంగాణ పై విషం కక్కిండు.
బీజేపీ ఒక గౌరవ పార్టీ కాదు..కౌరవ పార్టీ
పదేండ్లలో ఒక్క సారీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కేంద్రానికి కనిపించలేదు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి దశాబ్ది ఉత్సవాల పేరుతో గోల్కొండ పై కాషాయ సర్కస్ కంపెనీ దిగింది. తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బానిసగా మారిందన్న కిషన్ రెడ్డి బీజేపీని శాసిస్తున్న కుటుంబాల గురించి నోరు విప్పాలి.
రాష్ట్రంలో అన్ని రంగాల్లో అవినీతి పేరుకుపోయిందన్న కిషన్ రెడ్డి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. మోడీ ప్రభుత్వం అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అన్న నిజం ఆయనకే తెలుస్తుంది. తెలంగాణ దగా పడ్డ తెలంగాణగా మారిపోయిందన్న కిషన్ రెడ్డి అన్ని రంగాల్లో తెలంగాణ టాప్ అని కేంద్రం అవార్డుల మీద అవార్డులు ఎందుకిస్తున్నదో తెలుసుకోవాలి. ధరణి, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలపై కిషన్ రెడ్డి కండ్లలో నిప్పులు పోసుకున్నాడు అని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా,మేయర్ నీతూ కిరణ్ , నుడా చైర్మన్ ప్రభాకర్,మాజీ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు ఈగ గంగారెడ్డి మరియు నిజామాబాద్ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు సిర్ప రాజు పాల్గొన్నారు.

Spread the love